ETV Bharat / state

ఆసుపత్రికి వెళ్దామంటే నమ్మి వెళ్లారు - నాన్నే ఇలా ఉసురు తీస్తాడనుకోలేదు

రెండేళ్ల క్రితం భార్యతో శివరాములుకు విడాకులు - అప్పట్నుంచి తండ్రి దగ్గరే ఉంటున్న ఇద్దరు పిల్లలు - పొలం దగ్గరికి పిల్లలిద్దర్నీ తీసుకెళ్లి ఉరేసి చంపిన తండ్రి

Father killed Children
Father killed Children (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 1:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Father killed Children in Narayanpet : భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ఇక ఆమె రాదన్న విషయం తేలిపోయింది. ఇద్దరు పిల్లలకు అన్నీతానై ఆలనా పాలనా చూసే బాధ్యత తండ్రిపై పడింది. తానూ ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. తల్లిలేని లోటు తెలియకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ ఓ రోజు హఠాత్తుగా ఇద్దరు పిల్లలతో పాటు తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరిగింది? గుండెల్ని పిండేసిన ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో చోటు చోసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌ గ్రామానికి చెందిన శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన సుజాతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె రితిక, ఆరేళ్ల కుమారుడు చైతన్య ఉన్నారు. వివాహమైన వెంటనే శివరాములు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు.

పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి (ETV)

మనస్పర్థలతో విడిపోయిన జంట : చైతన్య జన్మించక ముందు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలతో కుమారుడికి మూడు నెలల వయసున్నప్పుడే భర్తను వదిలేసి సుజాత పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత శివరాములు హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం వచ్చాడు. నాటి నుంచి పిల్లలు తండ్రి వద్దే పెరుగుతున్నారు. పిల్లలకు అమ్మలేని లోటు తెలియనీయకుండా చూసుకునే వాడు. రాత్రి వేళల్లో పొలం వద్దకు పిల్లలను తీసుకెళ్లి నిద్రించే వాడు. గత ఏడాది మార్చిలో భార్యాభర్తలు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శివరాములు ఇంట్లో ముభావంగా ఉండేవాడు.

ఇటీవల రితికకు దద్దుర్లు రావడంతో సాయంత్రం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా అంటూ ఇద్దరు పిల్లలను శివరాములు పొలం వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి 9 దాటినా ఆసుపత్రికి వెళ్లిన వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్‌ చేయగా, మరికల్‌లో ఉన్నట్లు చెప్పాడు. కానీ కొంతసేపటికి అసలు విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. పిల్లలిద్దర్నీ తండ్రి చంపినట్లు తెలుసుకున్నారు.

''రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. పిల్లలను ఆసుపత్రిలో చూపించుకొని వస్తారు కదా అని ఇంటివారు తిని పడుకున్నారు. పది, పదకొండు అయింది. ఇంకా రాలేదు. వారి ఇంట్లో అవ్వ, తాత, చిన్నమ్మ, చిన్ననాన్న ఉన్నారు. ఎప్పుడన్నా ఏడిస్తే కూడా ఆ పిల్లల్ని మేము చూసుకునే వాళ్లం.'' - రాములమ్మ, చిన్నారుల పెద్దమ్మ

గాఢ నిద్రలో ఉరివేసిన తండ్రి : పొలం వద్ద గుడిసెలో పిల్లలు గాఢనిద్రలో ఉన్న సమయంలో తాడుతో ఉరివేసి చంపిన శివరాములు, సమీపంలోని యాపల్‌చెర్వు వంపు వాగు కల్వర్టులో వారిద్దర్నీ పడేశాడు. ఆ తర్వాత తానూ చనిపోయేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. అనంతరం తాను చనిపోయేందుకు గడ్డి మందు తాగాడు. వెంటనే చనిపోవాలని కరెంట్​ తీగను పట్టుకున్నాడు. షాక్‌ కొట్టడంతో ఫ్యూజు ఎగిరిపోయింది. తన జేబులో ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. అప్పటికి మరణించకపోవడం, గడ్డి మందుతో కడుపులో మంట రావడంతో తాళలేక ఈ విషయాన్ని స్నేహితులకు ఫోన్​లో​ చెప్పాడు.

చికిత్స పొందుతూ తండ్రి మృతి : వారు వెంటనే పొలం దగ్గరకు వెళ్లి చూసి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. యాపల్‌చెరువు వంపు వాగు కాలువలో వెతకగా పిల్లల మృతదేహాలు లభించాయి. శివరాములును ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్‌లోని ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పిల్లలను ఉరేసి చంపాడా? నీటిలో ముంచి చంపాడా? అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని సీఐ రాజేందర్‌ రెడ్డి తెలిపారు.

''శివరాములు తన భార్యతో ఆరు ఏళ్లుగా విడిపోయి ఉండటంతో రెండేళ్ల కింద వాళ్లకు విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి తనే పిల్లల్ని పెంచి, పోషిస్తున్నాడు. ఆ చిన్నారులను పోషించడం ఇబ్బందిగా మారడం, తర్వాత భార్య లేకుండా ఉండటం ఇలా జీవితం మీద విరక్తి చెంది వాళ్ల ఇద్దరు పిల్లల్ని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరికీ గొంతుకు తాడు బిగించి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు'' - రాజేందర్ రెడ్డి, మరికల్ సీఐ

నా భర్తలా నేను చూసుకోలేను - ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

'అమ్మ, నాన్న, తమ్ముడు క్షమించండి' - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య