భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్థుల ఆందోళన - భారీగా మోహరించిన పోలీసులు
ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగిన నల్లలింగాయపల్లి గ్రామస్థులు - భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వాలని గ్రామస్థుల ధర్నా - ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తున్న మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 7:45 PM IST
Farmers Protest at Bharathi Cement Factory in Kadapa District : కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పెద్దఎత్తున రైతులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం సమయంలో భూములు ఇచ్చిన రైతులకు సరైన ఉద్యోగాలు, పరిహారం అందించలేదని నల్లలింగాయపల్లె గ్రామస్థులు నిరసన తెలియజేశారు. గతంలో భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని రైతులు, మహిళలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద దాదాపు 500 మంది వరకు గ్రామస్థులు, మహిళలు ఆందోళన చేస్తుండగా వారికి మద్దతుగా కమలాపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అక్కడే టెంట్లు వేసుకుని ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. భూములు కోల్పోయిన రైతులకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించి తక్కువ వేతనాలు ఇస్తున్నారని బాధితులు మండిపడ్డారు.
''భారతి సిమెంట్‌లో మా ఆయన ఉద్యోగం చేశాడు. 7 ఎకరాల పొలం పోయింది. రూ.15,000 జీతం కుటుంబాన్ని పోషించాలి అంటే సరిపోవడం లేదు. జీతాలు పెంచడం లేదు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయడం లేదు.'' - గ్రామస్థులు
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ : జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు అడిగితే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందన్నారు. ఇప్పుడు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని గ్రామస్థులు తేల్చి చెప్పారు. మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. గ్రామస్తులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
''10 ఏళ్లుగా భారతి సిమెంట్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా చర్చలు, సమావేశాలకు వెళ్తున్నాను. సమస్య పరిష్కారం అయితే కావడం లేదు. ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు. జీతాలు తక్కువ, మరో పక్క మా భూములను కోల్పోయాం. కనీసం ఉద్యోగాలు అయినా పర్మినెంట్ చేయమంటే ఏదొక కహానీలు చెబుతున్నారు. రోజు అడుగుతున్నామని మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు.'' - గ్రామస్థులు
''ప్రస్తుతం నా జీతం రూ.20 వేలు. ఆ జీతంలో కుటుంబాన్ని పోషించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. డస్ట్ వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఉన్నా ట్రీట్మెంట్ లేదు.'' - గ్రామస్థులు
భారతి సిమెంట్ అడ్డగోలు వాదన - త్వరలో సున్నపురాయి లీజుల రద్దు!
సాంకేతికతతో నేరగాళ్ల గుట్టురట్టు - సంచలన కేసులు ఛేదిస్తున్న పోలీసులు

