ETV Bharat / state

'మా ఆరోగ్యం మా చేతుల్లోనే' - అరుదైన వంగడాలతో ప్రకృతి వ్యవసాయం

మా ఆరోగ్యం మా చేతుల్లోనే అంటున్న చిత్తూరు వాసులు - వ్యవసాయం చేస్తూనే విత్తన నిధి ఏర్పాటు చేస్తున్న కుమార్‌రెడ్డి - తనతో పాటు మరికొందరు ఇదే వ్యవసాయం చేసేలా ప్రోత్సాహం

Natural Farming in Chittoor District
Natural Farming in Chittoor District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 5:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Natural Farming in Chittoor District: రసాయన ఎరువులతో పండించిన పంటలకు తోడు మారుతున్న ఆహారపు అలవాట్లు కలిపి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. రోజురోజుకీ ఇది ఎక్కువ అవుతున్నా ఏం చేయలేని పరిస్థితి. అలాంటి వాటికి మేం దూరం అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు. మా ఆరోగ్యం మా చేతుల్లోనే అంటూ ప్రకృతి వ్యవసాయం చేయటమే కాకుండా విత్తన నిధి ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

త్రేతాయుగం నాటి బియ్యం పల్లవులు, చోళులు తిన్న ఆహారం, గౌతమ బుద్ధుడు స్వయంగా సేకరించిన బియ్యం ఈ మాటలు వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ? అధిక దిగుబడి కోసం దశాబ్దాలుగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోవడమే కాకుండా పంటలు విషతుల్యంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన చిత్తూరు జిల్లాకు చెందిన రైతు చందోల్‌ కుమార్ రెడ్డి తాను ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయించారు.

'మా ఆరోగ్యం మా చేతుల్లోనే' - అరుదైన వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు (ETV)

ఉపాధ్యాయ వృత్తిని వదిలి: పురుగు మందుల అవశేషాలతో నిండిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు తమ పొలంలో తమకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాన్నిపండించుకోవచ్చని ఈ రైతులు నిరూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై తిరుపతిలో సుభాష్‌పాలేకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన చందోల్‌కుమార్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం పట్ల ఆకర్షితులై ఉపాధ్యాయ వృత్తిని వదిలి వ్యవసాయంలో అడుగుపెట్టారు.

ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆదాయం: ఇలాంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన రైతు చందోల్‌ కుమార్ రెడ్డి తాను ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు మరికొందరిని ప్రోత్సహిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తూ పలు రకాల దేశీయ వంగడాలతో పంటలు సాగు చేస్తున్నారు. నవారా, కాలా నమక్, ఇంద్రాయణి, మాపిళ్లై సాంబ, కాలా బాటి వరి రకాలను సాగుచేస్తూ ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆదాయాన్ని పొందుతున్నారు.

'ఉప్పు తప్ప అన్ని పండిచుకోవచ్చు అనే సంకల్పంతో మా పొలల్లో మేం పండించుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2016లో నేను తిరుపతిలో ఉన్నప్పుడు సుభాష్‌పాలేకర్‌ ప్రసంగాన్ని విన్నాను. మా కుటుంబ సభ్యులతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని పంచడం చాలా సంతృప్తిని కలిగించింది. అమ్మకి డయాబెటిక్ కంట్రోల్ అయ్యింది. 55 మంది రైతులను తయారు చేసుకున్నాను. ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనం ఇచ్చి వారిని పండించుకుని తినండి. అలాగే వినియోగదారులకు అమ్మండి. ప్రతి సంవత్సరం మీరు పండించిన పంటలో 2 కేజీల విత్తనం తిరిగి ఇవ్వండి.' - చందోల్‌ కుమార్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయదారుడు

తమ పొలంలోనే ఇంట్లోకి కావాల్సిన వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, అరటి, బొప్పాయి, మామిడి పండ్లు పండిస్తున్నారు. అంతేకాదు ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాలు ఇచ్చి విత్తన నిధి ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటను వినియోగదారులకు నేరుగా అమ్ముతున్నారు. హైబ్రిడ్ రకాలు కాకుండా, దేశీయ రకాలను ప్రోత్సహిస్తున్నారు. రైతులు సాగుకు దేశీ వంగడాలను ఉచితంగా ఇచ్చి, వారు పండించిన తర్వాత రెట్టింపు విత్తనాలు వెనక్కి తీసుకుంటున్నారు.

చందోల్‌ కుమార్ రెడ్డి వద్ద ఉన్న పురాతన వంగడాలను తామూ పండించేందుకు ఇతర ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు. వాటి ప్రయోజనాలపై అధ్యయనం చేసిన కుమార్‌ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. దేశీయ వంగడాలను సాగుచేయడంతో పాటు విత్తన నిధి ఏర్పాటు చేయడంపై కుమార్‌రెడ్డిని పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రకృతి సేద్యానికి విదేశీయులు ఫిదా - సాగు తీరును పరిశీలించేందుకు రాష్ట్రానికి క్యూ!

ఎకరంలో 64 రకాల పంటలు - ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం - రైతులకు ఉచితంగా శిక్షణ