ETV Bharat / state

తెలంగాణలోనూ ఖర్జూర పంటను పండిస్తున్న రైతులు - ఏటా రూ.లక్షల్లో ఆదాయం

మన దేశంలోనూ ఖర్జూర పంటపై రైతులకు పెరుగుతున్న ఆసక్తి - లండన్​ నుంచి తెప్పించి మెదక్​లో సాగు - పంటకు సంబంధించి రైతుల వివరణ - ఖర్జూరను సాగుచేస్తున్న రైతు సత్యనారాయణ

తెలంగాణల రైతుల ఖర్జూర సాగు
Telangana Farmers Date Palm Crop Cultivation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 6, 2026 at 7:00 PM IST

|

Updated : July 6, 2026 at 7:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana Farmers Date Palm Crop Cultivation : ఖర్జూర అంటే బహుశా తెలియని వారుండరు! డ్రై ఫ్రూట్స్​లో దీనిది ప్రత్యేక స్థానం. ఎక్కువగా ఎడారి దేశాల్లో మాత్రమే ఈ పంటను పండిస్తారు. ఇక మన దేశంలో ఈ పంట సాగు చాలా తక్కువ. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఖర్జూను పండిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సత్యనారాయణ అనే రైతు ఈ పంటను సాగు చేస్తూ, ఏటా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఖర్జూర పంట సాగు విధానం, పెట్టుబడి, మార్కెట్ వంటి తదితర విషయాల గురించి రైతు సత్యనారాయణతో 'ఈనాడు - ఈటీవీ భారత్' నిర్వహించిన​ ప్రత్యేక ముఖాముఖితో తెలుసుకుందాం.

మీకు ఖర్జూర పంటను సాగు చేయాలని ఎందుకు అనిపించింది?
మాది 13 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఇందులో ఇంతకుముందు మలబార్, శ్రీ గంధం చెట్లు పెంచేవాళ్లం. ఒకసారి అనంతపూర్​ వెళ్లినప్పుడు అక్కడ ఖర్జూర తోటను చూశాను. వీటిని మనమెందుకు వేయకూడదని ఆలోచన వచ్చింది. వెంటనే వారితో మొక్కలు, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నాను. వాటిని లండన్​ నుంచి నిజాముద్దీన్​ అనే వ్యక్తి తీసుకొచ్చారని వారు చెప్పారు. వారి సాయంతో నేను కూడా 2019లో 280 మొక్కలు తెప్పించుకొని నాటాను.

పంట సాగు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
మేము నాటిన ఖర్జూర మొక్కలు 2023 నుంచి కాపు దశకు వచ్చాయి. అయితే, ప్రపంచంలో అనంతపూర్​ ఖర్జూర మాత్రమే చాలా తీయగా ఉంటుంది. మేము నాటిన మొక్కలు కూడా అదే రుచిలో ఉన్నాయి. దీంతో మరో 750 మొక్కలను ఇరాన్ టిష్యూ ల్యాబ్​ నుంచి తెప్పించి నాటాం. ఇందులో పాలినేషన్​ ప్రక్రియ చాలా కీలకం. దీని కోసం మొత్తం చెట్లలో 10 శాతం మగ చెట్లుంటాయి. ఇవి జనవరిలో ఉదయం 4 గంటల సమయంలో పుప్పొడినిస్తాయి. వీటిని 6.30 గంటల లోపే కోసి, ఏసీ రూముల్లో నిల్వ చేసుకుంటాం. మళ్లీ 15 రోజుల తర్వాత ఆడ చెట్ల పుప్పొడి వస్తుంది. ఇవి సహజంగా ఫలదీకరణం చెందవు. అందుకే మేమే ఆడ, మగ పుప్పొడుల ముళ్లను చాలా జాగ్రత్తగా పూయాల్సి ఉంటుంది. జూన్​, జలైలో కాయ దశ నుంచి పండుగా మారతాయి.

సంవత్సరానికి ఎన్నిసార్లు పంట చేతికి వస్తుంది?
ఎక్కడైనా గానీ ఈ ఖర్జూర ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేతికి వస్తుంది. అందరూ దుబాయ్​ నుంచి తాజా ఖర్జూర వస్తుందనుకుంటారు. కానీ, అది ప్రాసెస్డ్ చేసిందని తెలియదు. ఖర్జూరలను ఉడకబెట్టి, నిల్వ ఉండేందుకు రసాయనాలు కలుపుతారు. కానీ, మన దేశంలో తాజా ఖర్జూరను మాత్రమే విక్రయిస్తారు. అందుకే మాకు ఎగుమతులకు ఆర్డర్లు వస్తున్నాయి. 'భారత్​ డేట్స్​' అన్న పేరుతో మా పంటను అమ్ముతున్నాం. ఒక చెట్టు దాదాపు ఒక క్వింటాలు దిగుబడినిస్తుంది. రూ.10వేల ఆదాయం వస్తుంది. ఒక్కో చెట్టుకు రూ.5వేలు చొప్పున పెట్టుబడి పోగా రూ.5వేలు మిగులుతాయి.

కొత్తగా వేరే రైతులు సాగు చేయాలనుకుంటే వారికి మీరిచ్చే సలహాలేంటి?
ఈ పంటను పండించాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మేము ప్రతి రోజూ, ప్రతి చెట్టును పరిశీలిస్తుండాలి. 100, 200 మొక్కలతో కొద్ది మొత్తంలో సాగుచేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పండ్లను తీసుకెళ్లడానికి లిఫ్ట్ అవసరమవుతుంది. అందుకే కొద్ది మంది రైతులు కలిసి సాగు చేస్తే ఇబ్బంది ఉండదు.

ప్రస్తుతం కిలో ఎంత చొప్పున అమ్ముతున్నారు? ఇందులోనూ పోటీ ఏమైనా ఉందా?
మేము కిలో రూ.200లకు విక్రయించాలని భావించినా, ఆ మేరకు ధర రావడం లేదు. దీంతో రూ.150కే అమ్ముకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్ ఖర్జూరను విచ్చలవిడిగా అమ్ముతూ పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా మా పంట హైదరాబాద్​లోనే అమ్ముడవుతోంది.

పంటకు చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
మేము దాదాపుగా రసాయనాలు వినియోగించకుండా జీవామృతంతోనే పంటకు స్ప్రే చేశాం. కానీ, 'రెడ్​ పామ్ వీవిల్'​ అనే పురుగు మొండిగా చెట్టు చనిపోయేదాకా రసం పీలుస్తాయి. దాని కోసం ప్రత్యేక పెట్టెలు అమర్చి, అందులో మాత్రలు వేయడంతో అవి బయటకొచ్చి చనిపోయాయి. ప్రభుత్వం ప్రోత్సహించి పండ్లను ప్రాసెస్​ చేసి జామ్​, ఐస్​క్రీమ్​ వంటివి తయారు చేసేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ఇక కూరగాయల సాగు, నాటుకోళ్ల పెంపకం మొదలెట్టాల్సిందే!

YUVA: వీకెండ్​ ఫార్మింగ్​ : సేంద్రీయ సాగుతో అదరగొడుతున్న యువతి

Last Updated : July 6, 2026 at 7:31 PM IST