ETV Bharat / state

ఇక్కడ సర్వర్ పనిచేయదు - అక్కడ నమోదు కాదు : సా....గుతున్న 'ఫార్మర్‌ రిజిస్ట్రీ' నమోదు

పీఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుకు రైతుల ఇబ్బందులు - సాంకేతిక కారణాలతో నెమ్మదిగా సాగుతున్న నమోదు ప్రక్రియ - పీఎం కిసాన్, ఇతర పథకాలకు ఫార్మర్​ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి

PM Kisan Farmer Registries Problems
PM Kisan Farmer Registries Problems (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 7:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

PM Kisan Farmer Registries Problems : 'ప్రియమైన రైతు రామస్వామి. మీ సర్వే నంబరు ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఎంటర్ కాలేదు. వీలైనంత త్వరగా మీసేవా సెంటర్​ను లేదా వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని సంప్రదించండి. పీఎం కిసాన్, ఇతర పథకాలను పొందేందుకు ఇది తప్పనిసరి’ తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ పేరిట రంగారెడ్డి జిల్లాలోని ఓ రైతుకు వచ్చిన మెసేజ్​ ఇది. దీంతో వెంటనే ఆయన ఏఈవో వద్దకు వెళ్లగా ‘మా వద్ద సర్వర్‌ పని చేయట్లేదు. మీ-సేవకు వెళ్లండి అని సూచించారు. మీసేవా సెంటర్​కు వెళ్లగా అక్కడా నమోదు కావడం లేదని ఆపరేటర్‌ చెప్పారు. ఇలా రాష్ట్రంలో చాలామంది రైతులు ఆధార్‌ తరహాలో 11 నంబర్లతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’లో నమోదు కోసం నానా అవస్థలు పడుతున్నారు.

మచ్చుకు కొన్ని : వరంగల్‌కు చెందిన రైతు సమ్మయ్య అనారోగ్యంతో చనిపోగా, ఆయన భూమి కుమార్తె అనిత పేరిట రిజిస్టర్‌ అయింది. ఆమె గత రెండు సంవత్సరాలుగా పీఎం కిసాన్‌ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయ కార్యాలయాలు, మీ-సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో వేల మంది రైతులదీ ఇదే పరిస్థితి.

గత ఏడాది మే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ని ప్రారంభించింది. 8 నెలలు గడిచినప్పటికీ రాష్ట్రంలో 30 శాతం రైతులు కూడా నమోదు కాలేదు. దాదాపు 74 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 22 లక్షల మంది మాత్రమే నమోదయ్యారు. నమోదు చేసుకోవడానికి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ క్రమంలో వెబ్‌సైట్, సర్వర్‌లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి.

నెమ్మదిగా సాగుతున్న నమోదు ప్రక్రియ : రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్‌కు సంబంధించి 2019 జనవరి 31వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారినే అర్హులుగా గుర్తిస్తూ నమోదు ప్రారంభించారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ కటాఫ్‌ తేదీని పొడిగించలేదు. లబ్ధిదారులుగా ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే వారి వారసులకు నమోదుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర వెబ్‌సైట్‌లో సొంతంగా లేదా ఏఈవోల వద్ద, మీ-సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారిని గుర్తించేందుకు ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్రానికి పంపుతుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆయా పేర్లను తనిఖీ చేయించి, మళ్లీ కేంద్రానికి నివేదిస్తుంది. గత ఆరు నెలలుగా పీఎం కిసాన్‌ నమోదు ప్రక్రియ సజావుగా సాగడం లేదు. కేంద్ర వెబ్‌సైట్‌లో నమోదు కావడం కష్టతరమవుతోంది. దీంతో రైతులు ఏఈవోలు, మీ-సేవా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏటా దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వస్తుండగా, అందులో కొంతమంది పేర్లు మాత్రమే నమోదవుతున్నాయి. 2024-25 సంవత్సరంలో 16 వేల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. 2025-26లో ఇంతవరకు 10,243 మంది మాత్రమే కొత్తగా నమోదయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం : ఫార్మర్‌ రిజిస్ట్రీ, పీఎం కిసాన్‌ పథకాల నమోదుకు సాంకేతిక సమస్యలకు తోడు వ్యవసాయాధికారులు పంటల నమోదు, యూరియా పంపిణీ తదితర విధుల వల్ల అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా నమోదుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ప్రకటించాలని వెబ్‌సైట్, సర్వర్లు నిరంతరం పని చేసేలా సాంకేతిక సమస్యలను సరిదిద్దాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్‌ కుమార్‌ తెలిపారు.

రైతన్నలు 'ఫార్మర్ రిజిస్ట్రీ' చేసుకోండి - ఈ కార్టు ఉంటేనే ప్రభుత్వ పథకాలు

ఆ రైతులకు ప్రతి నెలా రూ.3 వేలు! - మీరు దరఖాస్తు చేసుకున్నారా?