విభిన్నంగా ఆలోచించిన రైతు - పొలాల్లో తామర సాగు చేస్తూ లాభాలు
వరితో కొన్నేళ్లు లాభాలు మరికొన్నేళ్లు నష్టాలు - వినూత్నంగా ఆలోచించి తామర సాగు - పండుగల సమయాల్లో మంచి డిమాండ్ ఉంటుందన్న రైతులు - ఇప్పటికే రెండు వేల తామరపూలు విక్రయించినట్లు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 2:03 PM IST
Farmer Reaping Profits by Cultivating Lotuses an Alternative to Paddy: అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తారు. తమ నేల తీరు, నీటి వనరులను ఆధారంగా పండే పంటను ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల యువత సైతం వ్యవసాయం మీద మక్కువ చూపిస్తున్నారు. వారికున్న పరిజ్ఞానంతో, సాంకేతికత వినియోగంతో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడు వరిసాగులో తండ్రి నష్టపోతున్నారని గుర్తించి తామర సాగుకు శ్రీకారం చుట్టారు. ఆ తామరలు మాములు వాటికంటే భిన్నంగా, ఆకర్షణీయంగా ఉండటంతో మంచి ఆదరణ లభిస్తుందని రైతు తెలుపుతున్నారు.
దిగుబడి: వరికి ప్రత్యామ్నాయ పంటపై వినూత్నంగా ఆలోచించిన ఓ రైతు, తామర సాగుతో మంచి దిగుబడి పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్త తుంగపాడులో తండ్రీకొడుకులు ఎకరం పొలంలో తామరను సాగు చేస్తున్నారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను ఇలా పొలాల్లో సాగు చేయడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పండుగల సమయాల్లో తామరకు మంచి డిమాండ్ ఉంటుందని రైతులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సుమారు రెండు వేల తామరపూలను విక్రయించినట్లు రైతు వీరబాబు తెలిపారు. ఒక్కో కమలాన్ని రూ.20 నుంచి 30 వరకు అమ్ముతున్నారు. వినియోగదారులు సైతం వీటిని చూసి సంతృప్తి చెందుతున్నట్లు తెలుపుతున్నారు. పెద్దగా పెట్టుబడి లేకుండా కమలాల సాగు మంచి ఆదాయాన్నిస్తుందని రైతు వివరిస్తున్నారు.
'మా నాన్న నాకు భూమి ఇచ్చి 10 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి నేను వరి సాగు చేస్తున్నా. కానీ కొన్ని సంవత్సరాలు లాభాలు, మరోసారి నష్టాలు చవిచూశాం. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా అవుతుంది. ప్రత్యామ్నాయ పంట పండిద్దామనుకున్నా. నా కుమారుడి సూచన మేరకు తామర పెట్టాను. జూన్ ఫస్ట్‌కు పంట వేశా, జులై నుంచి పంట చేతికొస్తుంది.' - వీరబాబు, రైతు
'మా స్నేహితుడి సాయంతో ఈ తామర సాగు గురించి తెలుసుకున్నాను. పూజలు, దేవతార్చనలకు కమలాలను ఎక్కువగా వినియోగిస్తారు. కానీ సాధారణంగా దొరికేవాటికంటే భిన్నమైన రకాన్ని సాగు చేస్తున్నాం. వీటికి 108 పూరేకులు ఉంటాయి. చూడడానికి లేత గులాబీరంగులో ఉండి, వరుసలుగా రెమ్మలతో చూపరులను ఆకట్టుకుంటాయి. వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి సహా పలు పండుగలకు వినియోగిస్తారు. 6 నుంచి 7 నెలల వరకు దిగుబడి వస్తుంది.' -గంగాధర్, యువరైతు
భూమిని నమ్ముకుంటే ఎప్పటికీ నష్టం జరగదని రైతులంటున్నారు. కాకపోతే విభిన్నంగా ఆలోచించి పంట మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మన్యంలో కుంకుమపువ్వు ప్రాజెక్టు - 30 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇసుక నేలలో మామిడి సాగు- ఏటా లక్షల్లో ఆదాయం

