30 నుంచి 40 రెస్టారెంట్లు - ఫుడ్ లవర్స్ అడ్డా గురునానక్ కాలనీ
ఒకే దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు, లగ్జరీ హోటళ్లు, కేఫ్‌లు - స్పెషల్ బిర్యానీల ఘుమఘుమలకు భోజనప్రియులు ఫిదా - మండి నుంచి కాంటినెంటల్ ఫుడ్ వరకు రుచుల సమాహారం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 1:36 PM IST
Vijayawada Food Hub Guru Nanak Colony : కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజ్‌కి బెజవాడ ఎంత ఫేమస్సో ఆంధ్రా వంటకాలకూ అంతే క్రేజ్. ఇప్పుడీ ఫుడ్ కల్చర్‌లోకి మరో అడ్రస్ వచ్చి చేరింది. అదే గురునానక్ కాలనీ. సాంప్రదాయ వంటలకు డిఫరెంట్ ఫ్లేవర్స్‌ను జోడిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు రోడ్లన్నీ ఫుడ్ లవర్స్‌తో కిక్కిరిసిపోతాయి. ఘుమఘుమలాడే బిర్యానీ సువాసనలు, హాట్ హాట్ టిఫిన్స్‌తో నోరూరిస్తాయి. అందుకే ఈ స్పాట్ విజయవాడలో మోస్ట్ హ్యాపెనింగ్, ట్రెండీ ఫుడ్ హబ్‌గా మారిపోయింది.
ఏంటి బ్రో ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అని విజయవాడ యువతను అడిగితే ఇంకేముంది గురునానక్ కాలనీకి పోదాం పద అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఫుడ్ అడ్డాగా మారింది. చిన్న బండి నుంచి లగ్జరీ హోటళ్ల వరకు టీ కొట్టు నుంచి కేఫ్ వరకు అన్నీ ఒకే దగ్గర కొలువుదీరాయి. భోజన ప్రియులను ఆకర్షించేందుకు వినూత్న పేర్లతో స్వాగతం పలుకుతున్నాయి. కిలోమీటర్ పరిధిలోనే 30 నుంచి 40 వరకు రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లున్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో వీధులన్నీ ఘుమఘుమలాడుతూ ఫుడ్ లవర్స్‌ను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి.
వెజ్ టూ నాన్‌వెజ్ రుచుల సమాహారం: ఒక్కో రెస్టారెంట్, ఒక్కో ప్రత్యేకమైన మెనూతో కస్టమర్లను ఫిదా చేస్తోంది. వైవిధ్యమైన వంటకాలను వండి వడ్డిస్తున్నారు. సాంప్రదాయ తెలుగు రుచులైన ఇడ్లీ, దోసెల నుంచి జెన్‌జీ ఇష్టపడే బర్గర్లు, పిజ్జాలు, మోమోస్, మాక్‌టైల్స్ ఇక్కడ దొరుకుతాయి. వెజ్ టూ నాన్‌వెజ్ మండి నుంచి చాట్ వరకు, కాఫీ నుంచి కాంటినెంటల్ ఫుడ్ వరకు, రుచుల సమాహారంగా మారిపోయింది. ప్రత్యేకంగా ఇక్కడ దొరికే కుండ బిర్యానీ, దిల్‌ఖుష్ బిర్యానీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్టర్స్‌కూ ఫుల్ క్రేజ్. భీమవరం రొయ్యల వేపుడు, తందూరి కబాబ్స్, రాగి సంగటి, కొబ్బరి అన్నం తింటే ఆహా అనాల్సిందే.
రుచితో పాటు ధర అందుబాటులో: సూపర్ ఆంబియన్స్‌తో సిట్టింగ్ స్పాట్స్ యువతకు తెగ నచ్చేస్తున్నాయి. వీకెండ్ వస్తే ఈ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ స్పాట్స్‌గా మారాయి. నచ్చినవి తింటూ కబుర్లు చెబుతూ మైమరిచిపోతున్నారు. తిన్న తర్వాత నోరు తీపి చేసుకోవడానికి డెజర్ట్స్, ఐస్‌క్రీమ్స్, మిల్క్ షేక్స్ కూల్‌కూల్‌గా సర్వ్ చేస్తున్నారు. రుచితో పాటు ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్. ఒకే ప్రాంతంలో ఎన్నో రుచులు, మరెన్నో కాన్సెప్ట్స్‌తో విజయవాడ ఫుడ్ మ్యాప్‌లో గురునానక్ కాలనీ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ నచ్చిన వారితో వెళ్లి పసందైన విందును కడుపునిండా ఆరగించేయండి.
100 ఆర్డర్లలో 90 అవే - విజయవాడలో పెరుగుతున్న బిర్యానీ లవర్స్
రోజుకు మూడు వేల ఆర్డర్లు - 'బిర్యానీ'కే జై కొడుతున్న విజయనగరం వాసులు

