ETV Bharat / state

మానవత్వం మరిచి - సొంత వారినే చంపుతున్న కుటుంబసభ్యులు

దూరమౌతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ - డబ్బులు, ఆస్తులు, వివాహేతర సంబంధాలు వంటి వాటికి అధిక విలువ - చిన్నపాటి గొడవలతో ప్రాణాలు తీసేందుకూ వెనకాడని వైనం

Family Members Killing Their Own People
Family Members Killing Their Own People (IANS (Representational image))
author img

By ETV Bharat Telangana Team

Published : January 5, 2026 at 1:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Family Members Killing Their Own People : చిన్నపాటి గొడవలతోనే ప్రాణాలు తీసేవరకు వెలుతున్నారు. మనుషుల మధ్య అనుబంధాలు మాయమవుతున్నాయి. మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబాల్లో పరిఢవిల్లాల్సిన ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు బదులు డబ్బులు, ఆస్తులు, వివాహేతర సంబంధాలు వంటివే ముఖ్యమైపోతున్నాయి. దీంతో అయినవారినే అంతమొందించేస్థాయికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. మద్యానికి బానిసలు కావడం వంటి చెడు అలవాట్లు పరిస్థితిని మరింత అధ్వానంగా మారుస్తున్నాయి.

ప్రతి నాలుగు హత్యల్లో ఒకటి ఇలాంటిదే : తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనో, ఆస్తులు పంచలేదనో, తనకు ఎక్కువ వాటా దక్కకుండా అడ్డొస్తున్నారనో ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులను, తోబుట్టువులను హతమారుస్తున్న ప్రబుద్ధులు పెరిగిపోతున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కట్టుకున్నవారినే కడతేరుస్తున్నవారి ఉదంతాలూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో 2025లో జరిగిన ప్రతి నాలుగు హత్యల్లో ఒకదానికి ఇలాంటి కారణమే నేపథ్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది నమోదైన 781 హత్యల్లో ఏకంగా 27 శాతం కుటుంబ కలహాల కారణంగానే జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటికితోడు చిన్నపాటి గొడవలు, భూ తగాదాలు, అనైతిక బంధాలతో ఏర్పడే అసూయ వంటి కారణాలతోనూ హత్యలు జరుగుతున్నాయి.

కనుమరుగైన ఉమ్మడి కుటుంబం : ఒకప్పుడు గ్రామసీమల్లో ఉమ్మడి కుటుంబాలు విలసిల్లేవి. మూడు, నాలుగు తరాలు ఒకే ఇంట్లో కలసి ఉండేవి. ఎప్పుడైనా చిన్నపాటి గొడవలు జరిగితే సర్దిచెప్పేందుకు పెద్దలుండేవారు. వారి మాటకు విలువనిచ్చి అంతా సర్దుకుపోయేవారు. అందుకే అప్పట్లో కుటుంబ వ్యవస్థ అంత బలంగా ఉండేది. ప్రపంచీకరణ నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగరీత్యా, బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి రావడంతో ఉమ్మడి కుటుంబాలు అరుదైపోతున్నాయి.అనుబంధాలు బలహీనమవుతూ కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగి, కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంతవరకు పరిస్థితులు వెళుతున్నాయి. గత మార్చిలో తెల్లాపూర్‌లో 27 ఏళ్ల యువకుడు తల్లిని హత్య చేయడం, పంజాగుట్టలో 80 ఏళ్ల విశ్రాంత పారిశ్రామికవేత్తను మనవడు అనేకమార్లు కత్తితో పొడిచి చంపేయడంలాంటి ఘోరాలు ఈ కోవలోనివే.

ఆరు రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృతి : చెప్పుకోదగ్గ కారణాలు లేకుండానే మనుషుల్లో ఆవేశం, ఆక్రోశం పెరిగిపోతున్నాయి. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు అనేకం. ఇంటిముందు రోడ్డుపై వాహనాన్ని పార్క్‌చేసి ఉంచడం, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తుంటే అడ్డుతగలడం, సామాజిక మాధ్యమాల్లో దూషిస్తూ మెసేజ్‌ పెట్టడం వంటి కారణాలతో మొదలవుతున్న గొడవలు చివరకు హత్యలకు దారితీస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. గత ఏప్రిల్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు రోజుల వ్యవధిలోనే ఏడుగురు హత్యకు గురయ్యారు. ఇవన్నీ చిన్నపాటి గొడవల కారణంగానే చోటుచేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం గమనార్హం. ముఖ్యంగా గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకులు ఎక్కువగా ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. ఇటీవలికాలంలో రహదారులపై పదుల సంఖ్యలో యువకులు మత్తులో తూగుతూ దాడులకు తెగబడుతున్న ఉదంతాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వివాహేతర సంబంధంతో విచక్షణ లేకుండా హత్యలు : సమాజం వివాహేతర సంబంధాలను హర్షించదు. ఇలాంటివి శ్రేయస్కరం కాదనేది అందరికీ తెలిసిన అంశమే అయినా పలువురు కట్టుబాట్లు దాటేస్తున్నారు. మరోవైపు అవకాశం చిక్కితే మహిళల్ని వంచించి, మోసగించే మృగాళ్లు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు టీనేజ్‌ పిల్లల్లో పలువురు పెళ్లి కాకుండానే అనైతిక బంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాల విషయంలో పర్యవసానాలను ఆలోచించకపోవడంతో పలు సందర్భాల్లో అవి నేరాలకు దారితీస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా రామడుగులో ఓ వృద్ధుడు తన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుమారుడిని హత్య చేయడం గత నెలలో సంచలనం సృష్టించింది. అనైతిక బంధాలతో ఏర్పడే అసూయ కూడా హత్యలకు ఓ కారణమవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రియుడి కోసం దారుణం - భర్తతో పాటు 22 ఏళ్ల కుమార్తె హత్య - ఆపై క్షుద్రపూజలతో!

ఈ చిట్టి యమడేంజర్! - ప్రియుడి కోసం భర్తనే చంపేసింది!!