గల్ఫ్‌లో బాంబుల వర్షం - తెలంగాణలోని వలసకార్మికుల కుటుంబాల్లో అలజడి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తెలంగాణలో అలజడి - నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు సుమారు 75 వేలు - క్షేమసమాచారం తెలియక ప్రశ్నార్థకంలో కుటుంబీకులు

Published : March 2, 2026 at 1:13 PM IST
Iran War Effect In Telangana : పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలపై పడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 75 వేలకు పైగా ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఇరాన్‌తో అమెరికా కూటమి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గల్ప్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు క్షణమొకయుగంలా గడుపుతున్నారు. తమ వారి యోగక్షేమాల సమాచారం కోసం తల్లడిల్లుతున్నారు. తమ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.
వీరంతా ఏం చేస్తున్నారంటే : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లినవారు ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులుగు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు ఇంటిపనులు చేసే వారిగా, డ్రైవర్లుగా, సహాయకులుగా, హోటళ్లలో క్లీనర్లుగా మరికొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలుగా ఆయా దేశాల్లో ఉంటున్నారు.

స్వస్థలాలకు వెళ్లాలని తాపత్రయం : గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్లివారి కళ్లముందే బాంబుల వర్షం కురియడంతో వారిలో ఒక్కసారిగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారంతా స్వస్థలాలకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారు. అయితే ఆయా దేశాల్లో గగనతలం మూసి వేయడంతో ఎటూవెళ్లలేని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇళ్లకు వద్దామనుకుంటే విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. మరి కొందరికి ఇళ్లకు చేరుకునేందుకు సరిపడ నగదు లేదు. ఇలాంటి అనుకోని విపత్తు రావడంతో ఏం చేయాలో తోచక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ యుద్ధపరిణామం వారి కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం లోకి నెట్టేసింది. వలస వెళ్లిన వారు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా సాయంతో తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు.
వంద మీటర్ల దూరంలోనే బాంబు : దుబాయ్ విమానాశ్రయానికి దగ్గరలో కామారెడ్డికి చెందిన వంగ బాల్‌రెడ్డి ఓ మాల్లో పనిచేస్తున్నారు. దీనికి దగ్గరలోనే ఓ సైనిక స్థావరం ఉంది. అయితే బాల్‌రెడ్డి పనిచేస్తున్న మాల్‌కు సుమారు వంద మీటర్ల దూరంలోనే ఓ బాంబు పేలింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేవుడిపైనా భారం వేసి బతుకుతున్నామని బాల్‌రెడ్డి కామారెడ్డిలో ఉన్న తన బంధువులతో ఫోన్లో పేర్కొన్నారు.
సమాచారం తెలుసుకుంటున్నాం : చంద్రంగౌడ్ అనే వ్యక్తి దుబాయిలో పని చేస్తున్నాడని అతడి అన్నయ్య గోరంట్ల భాస్కర్‌గౌడ్ తెలిపారు. అతడు పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే బనియస్లో సైనికి స్థావరాలు ఉన్నాయని తెలిపారు. అక్కడే ఇదివరకు రెండుసార్లు బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పారు. ప్రస్తుతానికి చంద్రంగౌడ్ కంపెనీ క్యాంపులో ఉన్నాడనీ ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ను నిలిపివేశారని అన్నారు. తమ్ముడి భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు వివరించారు.
"మా తమ్ముడు చంద్రంగౌడ్ దుబాయిలో పని చేస్తున్నాడు. అతడు పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే బనియస్లో సైనికి స్థావరాలు ఉన్నాయి. అక్కడే ఇదివరకు రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతానికి మా తమ్ముడు కంపెనీ క్యాంపులో ఉన్నాడు. ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ను నిలిపివేస్తారని చెప్పారట. తమ్ముడి భద్రతపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం." - గోరంట్ల భాస్కర్‌గౌడ్, మాచారెడ్డి
సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు : ఇరాన్, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలిని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ఆయా దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని సూచించారు. తెలంగాణవాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
వలస కార్మికుల వివరాలు :
- నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 50 వేల మంది ఉన్నారు.
- కామారెడ్డి జిల్లా నుంచి సుమారు 30 వేల మంది ఉన్నారు.
- వీరంతా దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఖతార్, మస్కట్ ప్రాంతాలకు వలస వెళ్లారు.
పశ్చిమాసియాలో భీకర యుద్ధం - హైదరాబాద్‌లో భయాందోళనలు
యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమాన సర్వీసులు రద్దు

