వారి బుద్ధి మారదా ? - నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేస్తే బెయిల్‌పై వచ్చి మళ్లీ అదే అవతారం
రెండురోజుల క్రితం 12 మంది దొంగ డాక్టర్లు పోలీసుల అదుపులోకి - క్లినిక్‌లు మూసివేసినా మళ్లీ యథావిధిగా తెరిచి రోగులకు చికిత్సలు - అనుమతులు లేకుండా మెడికల్ షాపుల నిర్వహణ

Published : August 29, 2026 at 1:27 PM IST
Fake Doctors In Hyderabad : వైద్యులను దేవుడితో సమానంగా చూస్తారు. ఎందుకంటే చావుపుట్టుకలు ఆ దేవుడి చేతిలో ఉన్నట్లే మన జననమరణాల నిర్ధారణ కూడా వైద్యుల చేతిలోనే ఉంటాయి. ఏదైనా అనారోగ్యం కారణంగా డాక్టర్ వద్దకు వెళ్తే అతనిపైనే ఆశలు పెట్టుకుని ఉంటాం. పోయే ప్రాణాన్ని తిరిగి తెప్పించగలుగుతాడని నమ్ముతాం. అంత గొప్ప వృత్తికి ప్రస్తుతం పలువురు మచ్చ తెచ్చి పెడుతున్నారు. వీధికో నకిలీ డాక్టర్ వెలుస్తూ దొంగ వైద్యం చేస్తున్నారు. దీని ద్వారా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలతో కొందరు పోలీసులకు దొరికిపోయారు. అయినా వారి బుద్ధి మారలేదు. మళ్లీ అదే అవతారమెత్తి అక్రమాలు చేస్తున్నారు.
12 మంది డాక్టర్లను అరెస్ట్ : హైదరాబాద్ నగరంలో రెండురోజుల క్రితం 12 మంది దొంగ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పది, ఇంటర్ మాత్రమే పాసై దొంగ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు తెరిచి రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే అరెస్ట్ చేసినవారు స్టేషన్ బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇలా వచ్చారో లేదో మళ్లీ క్లినిక్‌లు తెరచి అక్రమాలు మొదలుపెట్టారు. చిలకలగూడ దర్గా గల్లీలో రెండు నకిలీ క్లినిక్‌లు పోలీసులకు చిక్కాయి. కానీ వీటిని రెండు రోజులుగా యథావిధిగా తెరిచి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
పర్యవేక్షణ లోపంతో ఈ ఘటనలు : క్లినిక్, నర్సింగ్‌హోంల వంటివి చట్టప్రకారం ప్రారంభించాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు కింద మొదట జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వైద్యుల అర్హత, క్లినిక్‌లోని మౌలిక వసతులు ఇతరత్రా పరిశీలించి అనుమతులిస్తారు. కానీ 80 శాతం క్లినిక్‌లకు అనుమతులు కరవయ్యాయి. తెలంగాణ మెడికల్ కమిషన్ నగర వ్యాప్తంగా 6 నెలల్లో 300 వరకు నకిలీ క్లినిక్‌లను గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి కూడా అనుమతులు తీసుకోవటం లేదు. ఇలా క్లినిక్ పక్కనే మెడికల్ షాపులు, క్లినిక్లలోను మందులు నిల్వ ఉంచుతున్నారు. వాటిని అధిక ధరలకు రోగులకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా అమయాక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
నకిలీ వైద్యులను ఇలా గుర్తించండి : వీళ్లను గుర్తించేందుకు నిపుణులు చెబుతున్న సూచనలు ఇవే!
- ఆసుపత్రి లేదా క్లినిక్‌కు వెళ్లినప్పుడు రిసెప్షన్ వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రదర్శించారో లేదో చెక్ చేసుకోవాలి.
- ఒకవేళ వైద్యుని అర్హతల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే, వెంటనే 'onlinetsmc.in' వెబ్‌సైట్‌ను సందర్శించి, అందులోని సెర్చ్ టూల్‌లో వైద్యుని పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి వివరాలను సరిచూసుకోవాలి.
- వైద్యుల పేర్లతో పాటు విద్యార్హతలు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా బోర్డుపై లేదా కనిపించేలా ప్రదర్శించాలి.
- ఇవేవి లేకుండా ఎక్కడైనా నకిలీ వైద్యులు ఉన్నట్లు సమాచారం తెలిస్తే, దయచేసి 112 నంబర్‌కు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.
రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు - అనుమానాలుంటే ఈ వెబ్సైట్లో చెక్ చేయండి
ఇంటర్ కూడా పాస్ కాకుండానే డాక్టర్ - హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు

