లోన్ కోసం కన్సల్టెన్సీ, బ్రోకర్లను సంప్రదిస్తున్నారా? - ఈ మోసాల గురించి తెలుసుకోవాల్సిందే!
బ్యాంకు రుణాలిప్పిస్తామంటూ మాయగాళ్ల బురిడీ - ఆస్తులను ఏజెంట్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రుణాల స్వీకరణ - యజమానులకు కొద్ది మొత్తంలో అందించి పరార్- కమీషన్ల కోసం బ్యాంక్ ఉద్యోగులే ఏజెంట్లుగా మారుతున్న వైనం

Published : September 1, 2026 at 12:01 PM IST
Fake Consultancies And Brokers Fraud : హైదరాబాద్లో సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని పలువురు కేటుగాళ్లు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆర్థిక, సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ సహా ఆఫ్‌లైన్ ద్వారా కూడా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ కన్సల్టెన్సీలు, బ్రోకర్లు ఇతరుల పేర్లతో ఆస్తి పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించి భారీగా రుణాలు తీసుకొని ఆపై ముఖం చాటేస్తున్నారు.
సరైన విచారణ, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా నకిలీ కన్సల్టెన్సీలకు గానీ, బ్రోకర్లకు గానీ ఆస్తి పత్రాలను అప్పగించొద్దని డీసీపీ చైతన్య కుమార్ ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి యుగంధర్ అనే వ్యక్తి 20 మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇటీవల జరిగిన మోసాలు ఇలా ఉన్నాయి :
- పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇంటి పత్రాలను ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద తనఖా పెట్టి రూ.6 లక్షల రుణం పొందారు. అతను వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ అదనంగా మరో రూ.3 లక్షలు చెల్లించాలంటూ నోటీస్ రావడంతో షాక్‌కు గురయ్యారు. ఆరా తీయగా మొదట్లో రుణం పొందడానికి సహకరించిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు తనను మోసం చేశాడని ఆయన గ్రహించారు.
- మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంకు రుణం కోసం ప్రయత్నించారు. కానీ తక్కువ సిబిల్ స్కోరు కారణంగా అది సాధ్యపడలేదు. ఓ బ్యాంకు ఉద్యోగి సూచన మేరకు బ్రోకర్ సహాయంతో ఆమె రూ.75 లక్షల రుణం పొందేందుకు 300 చదరపు అడుగుల స్థలాన్ని మరొకరి పేరు మీద విక్రయ పత్రం(సేల్ డీడ్) ద్వారా బదిలీ చేసి, ఆ తర్వాత అందులో రూ.58 లక్షలను మాత్రమే అసలు యజమానికి అప్పగించారు.
లోన్ కోసం ఆస్తులను సేల్ డీడ్ చేయిస్తున్నారు : సరైన వ్యక్తిగత పత్రాలు లేనప్పుడు లేదా సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు చాలా మంది రుణాలు పొందడానికి కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తుంటారు. కొందరు నిర్వాహకులు సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. లోన్ రావడం కష్టమంటూ మాయమాటలు చెప్పి దరఖాస్తుదారుల ఇళ్లు, ఖాళీ స్థలాలతో పాటు వ్యవసాయ భూములను తమ ఏజెంట్లు లేదా అనుచరులకు సేల్ డీడ్ చేసేలా ఒప్పిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చిన తర్వాత ఆస్తి పత్రాలను తిరిగి ఇస్తామని హామీ ఇస్తారు. భారీ మొత్తంలో రుణాలు తీసుకొని అసలు యజమానులకు అందులో కొంత భాగాన్ని మాత్రమే ఇస్తున్నారు.
బ్యాంక్ ఉద్యోగులే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు : వాస్తవానికి యజమానులు తీసుకున్న డబ్బును పూర్తిగా తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి నోటీసులు వస్తుండటంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. కమీషన్ల ఆశతో బ్యాంకు ఉద్యోగులు కూడా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసిన వారిని కన్సల్టెన్సీలు, మధ్యవర్తుల వద్దకు పంపుతున్నారు. వారి ద్వారా దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణం మంజూరవుతుందని హామీ ఇస్తున్నారు.
ప్రకటనలు గుప్పిస్తూ మోసం : కఠినమైన నిబంధనలతో కూడిన డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే క్షణాల్లో ఖాతాలో లోన్ డబ్బులు జమ చేస్తామని పేర్కొంటూ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు తక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తున్నారు. మార్కెట్లో ఆదరణ కలిగిన ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల నుంచి వచ్చినట్లు కనిపించే ప్రకటనలకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. రుణం పొందడానికి తప్పనిసరిగా బీమా పాలసీని కొనుగోలు చేయాలని చెబుతున్నారు. వీటిని నిజమని నమ్మి బాధితులు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. అనంతరం అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

