ETV Bharat / state

అచ్చం ఒరిజినల్​ మాదిరిగానే - కంపెనీ ప్రతినిధులే గుర్తుపట్టలేనంతగా

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్తీ వస్తువుల కలకలం - తక్కువ ధరకే సిమెంట్​ అంటూ అంటగడుతున్న వ్యాపారులు, విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన దందా

Fake Cement in Anantapur District
Fake Cement in Anantapur District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 12, 2025 at 2:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fake Cement in Anantapur District: కాదేది కల్తీకి అనర్హం అని కేటుగాళ్లు నిరూపిస్తున్నారు. సబ్బులు, షాంపులు, వాషింగ్‌ పౌడర్లు, కొబ్బరి నూనె, వంట నూనె, గోధుమపిండి వంటి తదితర అన్నింటిలోనూ కల్తీ చేస్తున్నారు. ఆఖరికి నకిలీ సిమెంట్‌ తయారీని కూడా చేసి బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో అమాయకులకు అమ్మేస్తున్నారు. ఈ నకిలీ అక్రమాలకు సంబంధించి విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో వెలుగు చూస్తున్న విషయాలను చూస్తే ఏది అసలు, ఏది నకిలో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. చివరికి తాము కొన్న వస్తువుపై కంపెనీ లోగో, ఐఎస్‌ఐ ముద్ర, బార్‌కోడ్, క్యూఆర్‌ కోడ్‌ ఉన్నప్పటికీ అది అసలు కాదోమోనని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బార్‌ కోడ్‌ సైతం ట్యాంపరింగ్‌: నాణ్యత కోసం బ్రాండెడ్‌ వస్తువులను ఆశ్రయించే ప్రజల నమ్మకాన్ని మోసగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. అచ్చం బ్రాండ్లను పోలి ఉండే నకిలీ వస్తువులనే తయారు చేసి విక్రయిస్తున్నారు. లోగో, ప్యాకింగ్‌ అన్నీ బ్రాండ్‌నే పోలి ఉండటంతో సామాన్య ప్రజలకు ఏ విధమైన అనుమానం రావడం లేదు. సాంకేతిక సాయంతో బార్‌ కోడ్‌లను సైతం ట్యాంపరింగ్‌ చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో కల్తీ సిమెంట్ కలకలం (ETV)

స్థానిక వ్యాపారులతో కుమ్మక్కు: ఒకవేళ అనుమానం వచ్చి స్కాన్‌ చేసినా కంపెనీ పేరే చూపించేలా పకడ్బందీగా నకిలీలు తయారు చేస్తున్నారు. ఇటీవల గోరంట్లలో అల్ట్రాటెక్‌ పేరుతో తయారు చేస్తున్న నకిలీ సిమెంట్‌ బస్తాలను కంపెనీ ప్రతినిధులు కూడా గుర్తించలేక పోయారంటే కల్తీ ఏ స్థాయిలో చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

తమిళనాడు రాష్ట్రంలోని ప్లాస్టిక్‌ సంచులు, కవర్లు తయారు చేసే కంపెనీలతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కైనట్లు విజిలెన్స్‌ అధికారులు విచారణలో గుర్తించారు. తమకు కావాల్సిన కంపెనీ పేరు చెబితే చాలు వాళ్లే ప్యాకింగ్‌ కవర్లు తయారు చేసి ఇస్తున్నారు. అలాగే లేబుళ్లు, స్టిక్కర్లు వందశాతం అసలైన కంపెనీలాగే తయారు చేసి సరఫరా చేస్తుండటం గమనార్హం.

నకిలీ వస్తువులే జనాలకు విక్రయం: బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సబ్బులు, షాంపులు, నూనెలు, ఉప్పు, వాషింగ్‌ పౌడర్లు వంటి నకిలీ వస్తువులు తయారు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక డీలర్లను నియమించుకుని జిల్లాలో సరఫరా చేస్తున్నారు. ఒరిజినల్‌ కంపెనీల కంటే తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో హోల్‌సేల్‌ వ్యాపారులు నకిలీ వస్తువులనే తెప్పించుకుని జనాలకు విక్రయిస్తున్నారు.

"గత రెండు రోజుల క్రితం కల్తీ సిమెంటు తయారవుతుందనే సమాచారం మాకు అందింది. అనంతరం దీనిపై విచారణ చేస్తే బ్రాండెడ్ పేర్లతో సిమెంటును కల్తీ చేసి అమ్ముతున్నట్లు తేలింది. ఈ నకిలీ అమ్మకాలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలోని ప్లాస్టిక్‌ సంచులు, కవర్లు తయారు చేసే కంపెనీలతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కైనట్లు గుర్తించాం. ఈ నకిలీ వస్తువులను గుర్తు పట్టడం కూడా కష్టం. ఎందుకంటే చూసేందుకు నాణ్యమైన వాటిగానే కనిపిస్తాయి. కానీ అవి నకిలీవని గ్రహించేందుకు కాస్త సమయం పడుతుంది"-ప్రసాద్,అనంతపురం జిల్లా విజిలెన్స్​ ఎస్పీ

ఎమ్మార్పీ కంటే తక్కువకు ఇస్తే: నకిలీలపైనా ఒరిజినల్‌ కంపెనీకి చెందిన బార్‌ కోడ్‌లను ముద్రిస్తుండటంతో స్కాన్‌ చేయడం ద్వారా కనుక్కోలేమని విజిలెన్స్‌ శాఖకు చెందిన డీఎస్పీ నాగభూషణం అన్నారు. అయితే ఒరిజినల్‌ బ్రాండ్‌తో పోలిస్తే నకిలీ వస్తువుపై ఉన్న రంగుల్లో కచ్చితంగా తేడా ఉంటుందని ఆయన వివరించారు. మెరిసిపోయే రంగుల్లో ఉండే వస్తువులు నకిలీవి అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవ ధర కంటే తక్కువకే ఇస్తామని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందేనని ఈ సందర్భంగా ప్రజలను నాగభూషణం అప్రమత్తం చేశారు.

నకిలీ బ్రాండ్లు - నాసిరకం సరకు - విజయవాడ బస్టాండ్‌లో నయా దందా

'సేమ్​ టు సేమ్'​ కానీ పులస కాదు - డిమాండ్​ను క్యాష్​ చేసుకుంటున్న వ్యాపారులు