ETV Bharat / state

ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు - మండలానికి రెండు?

పట్నాల నుంచి పల్లె బాట పడుతున్న విద్యార్థులు - ఎన్నో ప్రత్యేకతలతో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ - ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్

Telangana Public School Arutla
Telangana Public School Arutla (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 20, 2025 at 11:01 PM IST

4 Min Read
Choose ETV Bharat

Telangana Public School Arutla : ఇప్పటివరకు పల్లె నుంచి పట్టణాలు, నగరాలకు బస్సుల్లో పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థులు వెళ్లడం చూశాం. అందుకు భిన్నంగా పట్టణం నుంచి విద్యార్థులు ఓ గ్రామంలోని పాఠశాలకు స్కూల్​ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రభుత్వ బడిలో ఫుట్​బాల్ బాక్స్ కోర్టు, బాస్కెట్​బాల్ కోర్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? గత సంవత్సరం వరకు 760 మంది పిల్లలు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సారి ఏకంగా 840 మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని అడగకుండా ఉంటారా?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నమ్మలేని నిజాలకు విశిష్టతలకు ఒక్కటే సమాధానం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో అదీ ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు (టీపీఎస్) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో ఠీవిగా ఈ పాఠశాల దర్శనమిస్తోంది.

ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా : ప్రతి మండలంలో కనీసం రెండు ప్రభుత్వ బడులను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలన్నది సర్కారు లక్ష్యం. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మంటాల, ఆరుట్ల ఉన్నత పాఠశాలలను నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలంలో వంగూరు, పోల్కమ్​పల్లి హైస్కూళ్లను ఎంపిక చేశారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్​ (ఎన్డీఎఫ్) నుంచి సుమారు రూ. 3 కోట్లు విరాళంగా అందగా ఆ నిధులతో ఆరుట్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఐదు ఎకరాల స్థలంలోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పటికే అనేక పనులు పూర్తికావడంతో అది ఓ ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇదే.

విస్తృతంగా ప్రజల్లోకి : ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం టీపీఎస్​ల గురించి ప్రకటించింది. దీంతో ఈ గ్రామంలో ఉపాధ్యాలు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లో చదివే తమ పిల్లల్ని సైతం ఈ సంవత్సరం ఈ పాఠశాలలో చేర్చారు. టీపీఎస్​లను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్​కు అప్పగించింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ పాఠశాలలను 'ఈనాడు' సందర్శించింది. మిగిలిన మూడు పాఠశాలలకు సంబంధించి భవనాల నిర్మాణం, వివిధ సౌకర్యాల కల్పనకు ఆర్కిటెక్ట్​లు డిజైన్లను రూపొందిస్తున్నారు.

ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు -  మండలానికి రెండు?
ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు - మండలానికి రెండు? (Eenadu)

పాఠశాలలో ప్రత్యేకతలు : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేస్తాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ సమకూరుస్తారు. నర్సరీలో చేరితే పదోతరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల బడులు, జూనియర్ కళాశాలలుంటే ఒక ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తారు.

ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సులు సమకూరుస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి ఒక టీచర్​ను నియమిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకూ సమప్రాధాన్యం ఇస్తారు. సైన్స్, గణితం, ఆంగ్ల ల్యాబులు అందుబాటులో ఉంటాయి. ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో అవన్నీ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సమకూరుస్తారు.

ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు -  మండలానికి రెండు?
ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు - మండలానికి రెండు? (Eenadu)

ఆరుట్లలో పాఠశాలలో సౌకర్యాలు : ఆరుట్లలో ఒకప్పుడు ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్ ఉన్నాయి. బాలికల పాఠశాల మూతపడటంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో భాగంగా దాన్ని ఆధునికీకరించి ప్రాథమిక పాఠశాలకు కేటాయించారు. ప్రాథమిక పాఠశాలను విస్తరించి వరండా ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ పాఠశాలగా మార్చారు.

  • ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, ఫర్నిచర్ సమకూర్చారు.
  • ఫుట్​బాల్, క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా బాక్స్ నెట్, కోర్టు పని దాదాపు చివరి దశలో ఉంది. బాస్కెట్ బాల్ కోర్టు పూర్తయింది.
  • ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఒక గ్రంథాలయం, 9-12 తరగతుల విద్యార్థులకు మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భవనం పూర్తికాగా ఫర్నిచర్ పనులు సాగుతున్నాయి.
  • అంతర్గత రోడ్ల పక్కనే మొక్కలు, పచ్చదనం ఉండేలా పనులు ప్రారంభమయ్యాయి. జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
  • చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లల రాకపోకల కోసం ప్రస్తుతం మూడు బస్సులను కొనుగోలు చేశారు. మరో రెండు మూడు బస్సులు సమకూర్చుకోనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలూ ఇక్కడే : ఈ పాఠశాలలో దాదాపు 80 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల, పోలీస్ కానిస్టేబుళ్ల, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు చేరారు. గత సంవత్సరం వరకు ఈ ప్రాంగణంలో 760 మంది విద్యార్థులుండేవారు. ఈ సంవత్సరానికి ఆ సంఖ్య దాదాపు 1,600కు పెరిగింది. దీనిలో కొత్తగా చేరిన వారిలో 80 శాతానికి పైగా విద్​యార్థులు గత సంవత్సరం వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదుకున్న విద్యార్థులు కావడం విశేషం. ఈ సారి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి దాదాపు 60 మంది పిల్లలు బస్సులో వస్తున్నారు.

నిధుల కోసం ఎదురుచూపులు: నాలుగు టీపీఎస్​ల కోసం ప్రభుత్వం జూలైలో మొత్తంగా రూ. 56.69 కోట్లు కేటాయించింది. ఆరుట్ల పాఠశాలకు రూ.9.86 కోట్లు కేటాయించగా ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాలేదు. అవి వస్తే డైనింగ్​ హాలు, అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. త్వరగా విడుదల చేయాలని పాఠశాల అభివృద్ధి యాజమాన్య కమిటీ సభ్యులు కంబాల పల్లి భాస్కర్, శ్రీశైలం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, ప్రహరీ నిర్మాణం కోసం రూ.కోటి మాత్రమే విడుదలయ్యాయి.

"ఆరుట్ల పాఠశాలను టీపీఎస్​గా మారుస్తామని సర్కారు ప్రకటించడం, ఆదిశగా పనులు ప్రారంభించడంతో తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగింది. పెద్ద సంఖ్య పిల్లల్ని ప్రైవేట్​ బడుల్లో మాన్పించి ఇక్కడ చేర్పించడం వల్ల దాదాపు రూ.4 కోట్ల పీజును మిగల్చగలిగాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరిన్ని వసతులు సమకూరుతాయి. ఎన్​డీఎఫ్​ తరఫున విశ్రాంత ఆచార్యులు పద్మజా షా కూడా పనులను పర్యావేక్షిస్తున్నారు. ప్రీ ప్రైమరీ కలుపుకుని మొత్తం ఈ ప్రాంగణంలో 70 మంది టీచర్లు పనిచేస్తున్నారు." - ఎస్‌.గిరిధర్, గెజిటెడ్‌ హెచ్‌ఎం