రుచిగా ఉందని స్ట్రీట్‌ఫుడ్ లాగించేస్తున్నారా? - జర జాగ్రత్త!
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నాణ్యతలేని, అపరిశుభ్ర ఆహార విక్రయాలు - అలాంటి ఆహార పదార్థాలు తింటే రోగాల బారిన పడే అవకాశం - బయట తినకపోవడమే మంచిదంటున్న నిపుణులు

Published : October 18, 2025 at 10:21 PM IST
Story on Adulterated Street Food : రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రోడ్ల పక్కన భోజనం, తినుబండారాలు కల్తీ వస్తువులతో తయారు చేయడం, అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రయాణికులు పలు రోగాలబారిన పడుతున్నారు. ప్రయాణంలో సమయానికి ఏదో ఒకటి తినడం అప్పటికి ఆకలి తీర్చుకోవాలనే ఆలోచనతో అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారని వైద్యులు సైతం పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ కొరవడడంతో ఆయా హోటళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వంటలు చేసి వాటిని ప్రయాణికులకు అంటగడుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయం ఇప్పటికే ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనికీల్లో పలుసార్లు తేటతెల్లమైంది.
అపరిశుభ్ర తినుబండారాలు విక్రయిస్తూ : రాష్ట్రంలోని పలు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ప్రతి రోజు పలు పనుల నిమిత్తం వేలల్లో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దినసరి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణం చేస్తుంటారు. ఉదయాన్నే ఇంటి భోజనం సిద్ధం కాకపోవడం, రాత్రి వేళల్లో ఆలస్యంతో చాలా మంది ఆకలి తట్టుకోలేకపోతున్నారు. సమోసా, బజ్జీలు, బేల్‌పూరీ, పకోడి, వెజ్, నాన్ వెజ్ బిర్యానీ, ఇడ్లీ, ఉప్మా లాంటి వంటకాలను రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్నారు. కాచిన నూనెలోనే పలుమార్లు వంటలు చేయడం, నాణ్యత లేని పదార్థాలను వినియోగించడం, పాడైన కూరగాయలు, అపరిశుభ్రమైన వంట గదులు, సామగ్రిని వినియోగించడం, దుమ్ములోనే విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
విచ్చల విడిగా ఫుడ్‌కలర్స్‌ను వినియోగిస్తూ : రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించే హోటళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఆహార పదార్థాల తయారీకి ఫుడ్‌కలర్స్‌ను కొన్ని హోటళ్ల వారు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలాంటివి తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. సాయంత్రం అయితే చాలు రోడ్లపై తినుబండారాలను అమ్ముతున్నారు. వాటిపై ఈగలు వాలుతుంటాయి, దుమ్ము, ధూళి పడుతున్నా వాటినే ప్రజలకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లపై దాడి చేసిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. నిల్వఉంచిన మాంసం, అపరిశుభ్రంగా ఉన్న వంట పాత్రలు, వంటగదుల్లో బొద్దింకలు లాంటివి దర్శనమిచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బయట తినకపోవడమే మంచిది : సాధ్యమైనంత వరకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో అపరిశుభ్రమైన భోజనం, అల్పాహారం తీసుకోకపోవడం మంచిదని డైటీషియన్ వైద్యులు వినయ తెలిపారు. అలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరని ఆమె తిలిపారు. జీర్ణాశయ వ్యవస్థను దెబ్బతీస్తుందని వివరించారు. అతిగా ప్లాస్టిక్ వినియోగం వస్తువులను ఉపయోగిస్తుండడం వల్ల క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని వినయ అన్నారు. కల్తీ, బయటి ఆహారం తీసుకునేవారే ఎక్కువగా వైద్యం కోసం వస్తున్నారని ఆమె వివరించారు. ఇంటి భోజనం వెంట తీసుకెళితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు.
ఘుమఘుమలాడుతున్నాయనో, కంటికి కలర్‌పుల్‌గా కనిపిస్తున్నాయనో బయట లభించే ఆహారానికి అలవాటు పడితే హాస్పిటల్ ఖర్చులు అమాంతం పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. బయట తినేటప్పుడే కాదు, ఇంట్లో వండుకునేటప్పుడూ సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. బయట తినేముందు వారు శుచిగా, శుభ్రంగా తయారు చేస్తున్నారా లేదా అని పరిశీలించాలి. అప్పుడే మన ఆరోగ్యం చేజారిపోకుండా ఉంటుంది.
టేస్టీగా, టెంప్టింగ్గా ఉందని బయట తింటున్నారా? - ఆ టేస్ట్ అంతా 'కల్తీ' అంట! జర చూస్కోండి మరి

