ETV Bharat / state

నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి లీలలు - వేరే జీఎస్టీ నంబరుతో సీసాల తయారీకి ఆర్డర్‌

నకిలీ మద్యం కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అద్దేపల్లి జనార్దనరావు లీలలు - వేరే జీఎస్టీ నంబరుతో మద్యం సీసాల తయారీ ఆర్డర్‌ - ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడించిన నిందితుడు సింథిల్

Excise_officials_questione_Senthil
Excise_officials_questione_Senthil (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 3:29 PM IST

4 Min Read
Choose ETV Bharat

Excise Officials Question Senthil in Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ (ఓఏబీ) బ్రాండ్​ సీసాలను తయారు చేయించి తెప్పించేందుకు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు అడ్డదారులు తొక్కాడు. సెంథిల్ (ఏ22)ను నమ్మించేందుకు ఇతరు జీఎస్టీ నెంబరు ఇచ్చి బురిడీ కొట్టించాడు. ఓఏబీ సీసాల తయారీ కోసం పలు చోట్ల ప్రయత్నించి విఫలమై చివరకు కోయంబత్తూరుకు చెందిన సెంథిల్​ని సంప్రదించారు. తనకు సొంతంగా మద్యం తయారీ కంపెనీ ఉందని, దానికి ఏపీ బేవరేజెఎస్ కార్పొరేషన్ నుంచి అనుమతి ఉందని జనార్దనరావు నమ్మించాడు.

నిందితుడు సెంథిల్ 2 రోజుల కస్టడీ ముగిసింది. అతని నుంచి 2వ రోజు పలు అంశాలకు సంబంధించి ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు పలు సమాధానాలు రాబట్టారు. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి ఈ నెల 5వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. జనార్ధనరావుకు సొంత మద్యం కంపెనీకి ఉందని దానికి అనుమతి ఉందని నమ్మిన సెంథిల్ సీసాల రవాణా కోసం జీఎస్టీ నెంబరును పంపించమని అడిగాడు. దీనికి శ్రీనివాసరెడ్డి (ఏ11)కు చెందిన జీఎస్టీ నెంబరును తీసుకుని కోయంబత్తూరుకు పంపించాడు.

యూపీఐ ద్వారా నగదు బదిలీ: దీనిపై అనుమానంతో జీఎస్టీ నెంబరును ఆ శాఖకు చెందిన వెబ్​సైట్​లో వెతికాడు. ఈ నెంబరు చలామణిలోనే ఉందని సింథిల్​ నిర్ధారించుకున్నాడు. దీంతో జనార్దనరావు ఇచ్చిన అర్డర్ మేరకు అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ గోదాములకు రవాణా చేశాడు. వీటిని లారీల్లో పంపించాడు. దాదాపు 2 లక్షల ఓఏబీ సీసాల సరకును అందుకున్న జనార్ధనరావు వీటికి సంబంధించి చెల్లింపులను రవికుమార్ ద్వారా ఇచ్చాడు.

ప్రధాన నిందితుడి తరపున ఇతనే లేబుళ్లు, మూతలు, స్పిరిట్ సరఫరా చేసిన వారికి యూపీఐ ద్వారా నగదు బదిలీ చేశాడు. సెంథిల్​కు కూడా రవి విడతల వారీగా డబ్బులు చెల్లించాడు. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు రవికి చెందిన ఐడీఎఫ్​సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.4.79 లక్షలు పంపించాడు. విడతల వారీగా రూ.1.68 లక్షలు, రూ.87,200, రూ.29,364, రూ.21,626 చొప్పున బదిలీ చేసినట్లు ఎక్సైజ్, సిట్ అధికారులు గుర్తించారు.

2012లో మద్యం వ్యాపారం ప్రారంభం: రిమాండ్‌ రిపోర్టు ప్రకారం, జనార్దన్‌రావు 2012లో మద్యం వ్యాపారం ప్రారంభించారు. ఆయనకు ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్‌ బార్‌ ద్వారా లాభాలు వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైవేల్లో ఉన్న బార్‌లను మార్చాల్సి రావడంతో, వ్యాపారం దెబ్బతింది. అప్పటి నుంచి పోటీ పెరగడం, కోవిడ్‌ సమయంలో నష్టాలు ఎదురవ్వడం వల్ల జనార్దన్‌రావు నకిలీ మద్యం తయారీ దిశగా అడుగులు వేశారు.

జనార్దన్‌రావు మొదట హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గది అద్దెకు తీసుకుని, అక్కడే నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు. 35 లీటర్ల ప్లాస్టిక్‌ డబ్బాల్లో మద్యం నింపి, వాటిపై “పినాయిల్‌” స్టిక్కర్లు వేసి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి తరలించేవారు. ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ ఇన్వాయిస్‌లు, బిల్లులు తయారు చేసి సరుకు పంపేవాడు. ఈ మద్యం డబ్బాలను హాజీ (ఇబ్రహీంపట్నం కేసులో ఏ5) అనే వ్యక్తి రిసీవ్‌ చేసుకునేవాడు. తర్వాత మద్యం లీటర్‌ బాటిళ్లలో నింపి, విడిగా విక్రయించేవాడు.

కొత్త బార్‌, కొత్త భాగస్వాములు: 2022లో జనార్దన్‌రావు “E7” పేరుతో హైదరాబాద్‌లో మరో బార్‌ను ఆరుగురి భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఆ బార్‌ నుంచి నకిలీ మద్యం 35 లీటర్ల డబ్బాల్లో ఇబ్రహీంపట్నం ఏఎన్‌ఆర్‌ బార్‌కు సరఫరా చేసేవారు. 2023లో భాగస్వాములతో గోవాకు వెళ్లిన జనార్దన్‌రావు అక్కడ తెలుగు వ్యక్తి బాలాజీ (కేసులో ఏ3)తో పరిచయం ఏర్పరుచుకున్నారు. బాలాజీకి డిస్టిలరీస్‌ పరిచయాలు ఉండటంతో ఎక్స్‌పెన్సివ్‌ బ్రాండ్‌ల మాదిరి నకిలీ మద్యం తయారీ ఆలోచన వచ్చింది. అతనితో కలసి జనార్దన్‌రావు పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించారు.

2023 నుంచి ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్‌ బార్‌లోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించారు. బాలాజీ (ఏ3) బెంగళూరు, ముంబయి, దిల్లీ నగరాల నుంచి ముడి సరకు ఐషర్‌ వ్యాన్‌లో సరఫరా చేసేవాడు. రవి (ఏ4) నకిలీ లేబుల్స్‌, బాటిల్‌ మూతలు సరఫరా చేసేవాడు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్‌, ఓల్డ్‌ అడ్మిరల్‌, క్లాసిక్‌ బ్లూ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యం తయారు చేశారు. మొదట ఈ మద్యం బాటిళ్లు ఏఎన్‌ఆర్‌ బార్‌లోనే విక్రయించారు. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 35 నుంచి 40 రూపాయిల వరకు లాభం ఆర్జించారు.

ఎన్నికల సమయంలో నిలిపివేత: 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్‌ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశాడు. ఆ సమయంలో జనార్దన్‌రావు కూడా కార్యకలాపాలు తగ్గించారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఆయనకు స్నేహితుడు కాగా, ఆయన అనుచరులు సురేంద్రనాయుడు, పీఏ రాజేష్‌ వైన్‌ షాపులు నిర్వహిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. 2025 మేలో జనార్దన్‌రావు మళ్లీ ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ ప్రారంభించారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా కార్యకలాపాలను పునరుద్ధరించారు.

గత నెల 25న జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారని తెలిసి జనార్దన్‌రావు అక్కడకి వెళ్లాడు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్‌ ఉన్న సమయంలో ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. “ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో నకిలీ మద్యం వ్యాపారం సూత్రధారి జనార్దన్‌రావే,” అని ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు.

ములకలచెరువు నకిలీ మద్యం కేసు - వెలుగులోకి కీలక విషయాలు

'నకిలీ మద్యం కేసులో జోగి సోదరులదే ముఖ్యపాత్ర' -ఛార్జిషీట్‌లో సిట్‌ కీలక వివరాలివే