ETV Bharat / state

నెయ్యి కల్తీ గురించి వైవీ సుబ్బారెడ్డికి అప్పుడే చెప్పా - సిట్​ విచారణలో మాజీ జీఎం

'అప్పటి డిప్యూటీ ఈవోతో కలిసి వివరించా' - సిట్‌ విచారణలో అంగీకరించిన మాజీ జీఎం సుబ్రహ్మణ్యం

EX GM Agreed Details About Adulteration Ghee in SIT Interrogation
EX GM Agreed Details About Adulteration Ghee in SIT Interrogation (Eebadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 9, 2025 at 12:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

EX GM Subramanyam Agreed Details About Adulteration Ghee in SIT Interrogation : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందన్న విషయాన్ని నాటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి చెప్పానని ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యం (ఏ29) సిట్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. గత నెల 27న సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని సిట్‌ కార్యాలయంలో విచారించినప్పుడు చెప్పిన అంశాలను రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించారు. ఆ వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

నాలుగు నెయ్యి నమూనాలూ కల్తీవే : ‘2022 మే 20న తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో సుబ్బారెడ్డిని కలవగా ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ ట్యాంకర్లు, టిన్నుల ద్వారా టీటీడీ పంపే నెయ్యిని మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌లో పరీక్షించాలని ఆదేశించారు. జూన్‌లో నాలుగు నమూనాలు పంపగా నివేదికలు రావడంలో జాప్యం జరిగింది. దాంతో అక్కడి అధికారులతో మాట్లాడాలని డెయిరీ నిపుణుడైన డా. బత్తుల సురేంద్రనాథ్‌ను కోరాను. ఆయన వారిని సంప్రదించిన తర్వాత 2022 ఆగస్టు 3న టీటీడీ డిప్యూటీ ఈవో (వేర్‌ హౌసింగ్‌)కు నివేదిక వచ్చిందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ఆ నివేదికపై సురేంద్రనాథ్‌ అభిప్రాయం కోరగా నాలుగు నెయ్యి నమూనాలూ కల్తీవేనని ఆయన తెలిపారు. బీటా సిటోస్టెరాల్‌ పాజిటివ్‌గా మైసూరు ల్యాబ్‌ తేల్చిందని అంటే వెజిటేబుల్‌ ఆయిల్స్‌ కలిపారని చెప్పారు. ఇదే విషయాన్ని డిప్యూటీ ఈవో, తాను వైవీ సుబ్బారెడ్డికి వివరించినట్లు సుబ్రహ్మణ్యం సిట్‌ అధికారుల ఎదుట అంగీకరించారు. నెయ్యి కల్తీ అయినట్టు మీ నివేదికలో ప్రస్తావించవద్దని సుబ్రహ్మణ్యం 2022 ఆగస్టు 11 నుంచి 14 తేదీ మధ్య మూడు నాలుగు సార్లు ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారని డెయిరీ నిపుణుడు సురేంద్రనాథ్‌ సిట్‌ బృందానికి వెల్లడించారు.

మైసూరు ల్యాబ్‌ నుంచి నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో అప్పటికే ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించామని కల్తీ గురించి బయటకు తెలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారన్నారు. ఈ నేపథ్యంలోనే నెయ్యి కల్తీ అయిందా? లేదా? అని తాను స్పష్టంగా నివేదించనప్పటికీ బీటా సిటోస్టెరాల్‌ కలిసిందని మాత్రం అభిప్రాయపడ్డానని సిట్‌ అధికారులకు తెలిపారు.

డిప్యూటీ ఈవో కలిసి నిర్ణయం : మరోవైపు సుబ్రహ్మణ్యం మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారంలో అనుకూలంగా నివేదిక ఇవ్వాలని సురేంద్రనాథ్‌ను కోరలేదని వాంగ్మూలంలో పేర్కొన్నారు. కల్తీ గురించి వైవీ సుబ్బారెడ్డికి మాత్రమే చెప్పానని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. ఎందుకు వారికి చెప్పలేదని ప్రశ్నించగా మౌనం దాల్చారు. కల్తీ అంశంలో డెయిరీల నిర్వాహకులను హెచ్చరించారా? అని అడగ్గా లేదని బదులిచ్చారు. మైసూరు ల్యాబ్‌ నివేదికపై నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ఎవరైనా ఆదేశించారా? అని ప్రశ్నించగా తాను, డిప్యూటీ ఈవో కలిసి నిర్ణయం తీసుకున్నామని బదులిచ్చారు. గత నవంబరు 27న సురేంద్రనాథ్‌తోపాటు డెయిరీ నిపుణులైన డా. మల్లం మహేందర్, వి. వెంకట సుబ్రమణియన్, కె. జయరాజ్‌ రావును సిట్‌ అధికారులు విచారించారు. అదేరోజు సుబ్రహ్మణ్యంనూ ప్రశ్నించి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నిందితులకు నాలుగురోజుల కస్టడీ : కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నిందితులైన అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ (ఏ16), టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం (ఏ29)ను నాలుగు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. వీరిని ఈనెల 9 నుంచి 12 వరకు సిట్‌ విచారించనుంది.

తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్​ సేవలు - త్వరలో అత్యాధునిక కెమెరాల ఏర్పాటు

తిరుమలలో ఏఐతో అన్నప్రసాదం దినుసుల జల్లెడ - భక్తులకు నాణ్యమైన భోజనం