తెలంగాణలో డిగ్రీలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి - వచ్చే ఏడాది నుంచే అమలులోకి
డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్ - బీటెక్‌లో రెండు ఇంటర్న్‌షిప్‌లు - నెలకు కొంత స్టైపెండ్ చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయం - స్టైఫెండ్ ఎలా చెల్లించగలమని వైస్ ఛాన్స్‌లర్ల ఆవేదన

Published : January 10, 2026 at 9:54 AM IST
Internship For Degree Students : ఇప్పుడు కొలువులన్నీ నైపుణ్యం ఉన్న వారినే వరిస్తున్నాయి. తమ అవసరాలకు అనుగుణంగా పని చేయడమే ప్రధాన లక్షణం అని పరిశ్రమలు తెగేసి చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి సైతం విద్యాశాఖ అధికారులతో ఎప్పుడు సమీక్ష నిర్వహించినా విద్యార్థులకు నైపుణ్యాలు ఎలా పెంచుతారు? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే విద్యాశాఖ ఈ దిశగా రంగంలోకి దిగింది.
తప్పనిసరిగా అమలు : ప్రాథమికంగా చర్చించాక రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌లో ఈ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం(2026-27)లో ఇంటర్న్‌షిప్/ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
స్టైఫెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ : ఇంటర్న్‌షిప్ అంటే విద్యార్థులు వివిధ పరిశ్రమలు, కార్యాలయాలు, దుకాణాల్లో కొన్నాళ్లు ఉద్యోగంలా పని చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది కూడా శిక్షణ. ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేయాలంటే వారు ఆసక్తి చూపకపోవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరుతున్న వారిలో అధిక శాతం మంది పేద, దిగువ మధ్య తరగతి వారుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వారికి ఇంటర్న్‌షిప్ కాలానికి నెలకు కొంత స్టైపెండ్ చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. అందుకు ఆయా వర్సిటీలు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆ మొత్తాన్ని చెల్లించేలా కసరత్తు చేస్తోంది. వర్సిటీలు తమ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు స్టైఫెండ్ చెల్లిస్తాయి. కొంత మొత్తం విద్యామండలి తన వాటాగా ఇస్తుంది. ఆయా పరిశ్రమలు ఇంకొంత చెల్లించేలా చేయాలన్నది ఆలోచన. ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.
దీనికోసం ప్రత్యేక పోర్టల్ : విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదా అప్రెంటిస్‌షిప్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ నియంత్రణ సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ చెబుతూనే ఉన్నాయి. ఏఐసీటీఈ దీనికోసం ప్రత్యేక పోర్టల్‌నే ప్రారంభించింది. అయినా అధిక శాతం మంది బీటెక్ విద్యార్థులకే ఇంటర్న్‌షిప్ అమలు కావడం లేదు. ఆయా విద్యాసంస్థలతో పరిశ్రమలకు అనుసంధానం లేదు. ఫలితంగా ఇంటర్న్‌షిప్ కొన్ని ప్రముఖ కళాశాలలకే పరిమితమైంది.
బీటెక్‌లో రెండు ఇంటర్న్‌షిప్‌లు : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ సిలబస్‌ను ఉన్నతీకరించేందుకు బీటెక్ విద్య స్వరూపాన్ని ఇప్పటికి అనుగుణంగా మార్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ పలు సిఫారసులు చేసింది. బీటెక్ రెండో ఏడాది రెండో సెమిస్టర్‌లో ఒకటి, మూడో ఏడాది రెండో సెమిస్టర్ పూర్తయ్యే నాటికి మరొకటి ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేయడం తప్పనిసరని పేర్కొంది.
స్టైఫెండ్ ఎలా చెల్లించగలం? : తమకు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికే ప్రతినెలా ఇబ్బంది అవుతోందని, అభివృద్ధి పనులకు నిధులు అసలే లేవని వర్సిటీలు మొత్తుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ విద్యార్థులకు స్టైఫెండ్ ఎలా చెల్లించగలమని వైస్ ఛాన్స్‌లర్లు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోటీ ప్రపంచంలో నెగ్గడానికి : విద్యార్థులకు సర్టిఫికేట్‌తో పాటు ఉపాధి, ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి జాబ్ మార్కెట్లో ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని నిరుద్యోగుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చదువు పూర్తైన తర్వాత కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేయడం మంచిది. దీనివల్ల జాబ్ మార్కెట్‌కు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. త్వరగా ఉద్యోగం పొందవచ్చు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సాధారణంగా ఇంటర్న్‌షిప్ వ్యవధి 30 రోజుల నుంచి 3 నెలల వరకు ఉంటుంది. కనుక ఈ స్వల్ప వ్యవధిలోనే ఉద్యోగానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే నేడు చాలా కంపెనీలు మీ డిగ్రీల కంటే, పని అనుభవానికే పెద్ద పీట వేస్తున్నాయి. మీరు ఇంటర్న్‌షిప్‌లో చేరితే చాలు సదరు కంపెనీలోకి మిమ్మల్ని అధికారికంగా అనుమతించి అక్కడ జరుగుతున్న పనిలో/ ప్రాజెక్టులో మీకు భాగస్వామ్యం కల్పిస్తారు.
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సూపర్ ఛాన్స్ - కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ చూశారా?

