జులై 15లోగా ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్: దేవాదాయశాఖ కమిషనర్
దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ - జూలై 15లోగా ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ సిద్ధం - దసరా నాటికి అన్నదానం కాంప్లెక్స్, పోటు ప్రసాదశాల నిర్మాణ పనులు పూర్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2026 at 4:53 PM IST
Indrakeeladri Temple Works and Master Plan 2026 : విజయవాడ ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్ జులై 15 లోగా సిద్ధమవుతుందని దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆగస్టు మొదటి వారంలో సాంకేతిక నిపుణుల కమిటీ ముందు మాస్టర్‌ప్లాన్‌ను ఉంచి వారి సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలోని అభివృద్ధి పనులను దసరా నవరాత్రుల నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. శ్రావణ మాసంలోనే అన్నదానం కాంప్లెక్స్, పోటు ప్రసాదశాల నిర్మాణ పనులు ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మిగిలిన చిన్నపాటి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు దృష్టి పెట్టాలన్నారు. దసరా ఉత్సవాల నాటికి భక్తులకు పూర్తి స్థాయిలో కొత్త ప్రసాదం పోటు, అన్నదాన సత్రం అందుబాటులోకి తీసుకొస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో జాప్యం : గతంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో జాప్యం జరిగినట్లు గుర్తించామని కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుతూ, ఇంజినీరింగ్ నిపుణులు, కన్సల్టెంట్లతో చర్చించి కొత్త ప్రణాళికను సిద్ధం చేశారని, మల్లికార్జున మండపం వద్ద ఈ కాంప్లెక్స్‌ను ఎక్కడ అనుసంధానం చేయాలనే అంశంపై స్పష్టత రావడంతో పనులు పునఃప్రారంభం కానున్నాయని చెప్పారు.
ఆ స్థలం కేవలం పార్కింగ్ కోసం మాత్రమే : ఈ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కింద ఎలాంటి దుకాణాలకు అనుమతి లేదని, ఆ స్థలాన్ని కేవలం పార్కింగ్ లేదా భక్తుల రాకపోకలకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. దుర్గ గుడికి నిధుల కొరత లేదని, ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాలకు ప్రసాద్ పథకం మరింత ప్రాధాన్యతనిస్తుందని కమిషన్ అభిప్రాయపడ్డారు. అన్నవరం, సింహాచలం వంటి క్షేత్రాల్లో ప్రసాద్ పథకం పనులు పుంజుకున్నాయని అన్నారు.
"దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో మౌలిక వసతులను పెంచడంతో భాగంగా అన్నదానం కాప్లెంక్స్, పోటు ప్రసాదశాల నిర్మాణ పనులు చేపట్టాం. త్వరలో దసరా నవరాత్రులు వస్తాయి, ఆ సమయంలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేస్తాం. శ్రావణ మాసంలోనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించాం. గతంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో జాప్యం జరిగింది. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కింద ఎలాంటి దుకాణాలకు అనుమతి లేదు, ఆ స్థలాన్ని కేవలం పార్కింగ్ లేదా భక్తుల రాకపోకలకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్ జులై 15లోగా సిద్ధమవుతుంది." - రామచంద్రమోహన్, దేవాదాయశాఖ కమిషనర్
ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్ల గోల్‌మాల్? - దుర్గమ్మ ఆదాయానికి లక్షల్లో గండి
వైభవంగా దుర్గామల్లేశ్వర స్వామివార్ల గిరిప్రదక్షిణ - భక్తి పారవశ్యంలో ఇంద్రకీలాద్రి

