'ప్రసాద్' పనుల్లో జాప్యం - సింహాచలంలో భక్తులకు తప్పని ఇబ్బందులు
త్వరలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం - ఇంకా కొనసాగుతున్న పనులు - నిరుపయోగంగా బస్టాండ్ - పూర్తయిన నిర్మాణాన్ని అప్పగించాలని కోరుతున్న దేవస్థానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 10:11 AM IST
Prasad work Delay in Simhachalam Temple: సింహాచలం అప్పన్న దేవస్థానంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని చేపట్టిన పనులు ప్రసాద్ పథకం పనులు ఇంకా పలు దశల్లోనే కొనసాగుతున్నాయి. అయితే చందనోత్సవం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ పనులు మరొకసారి చర్చనీయాంశమయ్యాయి.
అంతేకాకుండా గతేడాది ఏప్రిల్ 30వ తేదీన చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కొన్ని నెలల పాటు పనులు నిలిచిపోయాయి. అయితే గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టి కొత్తవారికి పనులను అప్పగించడం గమనార్హం. ఏప్రిల్ 20వ తేదీన జరిగేటటువంటి చందనోత్సవం కంటే ముందుగానే పూర్తయిన నిర్మాణాలేమైతే ఉన్నాయో వాటిని అప్పగించాల్సిందిగా దేవస్థాన అధికారులు ఇప్పటికే పర్యాటక శాఖను కోరుతున్నారు.
ప్రసాద్ పనుల్లో అంతులేని జాప్యం: ప్రధానంగా ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో వ్యూపాయింట్ నిర్మిస్తున్నప్పటికీ రూ.5.40 కోట్ల వ్యయంతో సింహగిరి రెండో ఘాట్‌రోడ్డు ప్రవేశం వద్ద దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న బస్ కాంప్లెక్సు నిర్మాణం 80 శాతం పూర్తయింది. అదే విధంగా ఫుడ్ కోర్టులు, దుకాణాలు, టాయిలెట్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. మొత్తం రూ.4.78 కోట్ల వ్యయంతో కొండ దిగువన చేపట్టినటువంటి పుష్కరిణి సత్రం రెండు బ్లాకుల నిర్మాణం దాదాపుగా చివరి దశకు చేరింది.
రూ. 11.20 కోట్లతో జీప్లస్ వన్ భవనం: అదే విధంగా రూ.3.80 కోట్ల వ్యయంతో గతంలో చేపట్టిన తొలిపావంచా, మెట్లమార్గం అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోవడం గమనార్హం. హిల్‌టాప్ రహదారి మార్గంలో యాత్రికులు వేచి ఉండేందుకు రూ. 11.20 కోట్ల వ్యయంతో నిర్మించిన జీప్లస్ వన్ భవనం పూర్తయింది. ప్రస్తుతం దీనికి ఇంకా తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది. నృసింహ మండపంలో 500 మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్నటువంటి యాంపీ థియేటర్ పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరగోపురం ఎదురుగా పాత కల్యాణోత్సవ ప్రాంగణంలో వార్షిక కల్యాణాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అంతేకాకుండా సింహగిరిపై రూ. 5.60 కోట్ల వ్యయంతో చేపట్టిన దుకాణ సముదాయ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం దీన్ని వ్యాపారులకు అప్పజెప్పి వినియోగంలోనికి తీసుకొచ్చారు. అదే రీతిలో దక్షిణ వైపున సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో మెట్ల నిర్మాణాన్ని ఇంకా జరగాల్సి ఉంది.సింహాచలం దేవస్థానంలో రూ. 3.46 కోట్ల వ్యయంతో చేపట్టిన పర్యాటక సమాచార భవనం, ఫుడ్‌కోర్టులు, సోలార్ విద్యుత్తు ప్లాంటు నిర్మాణాలపై దేవాదాయ శాఖ కమిషనర్ కొన్ని అభ్యంతరాలను చెప్పినప్పటికీ అప్పటి ఇంజినీరింగ్ అధికారులు మాత్రం కొనసాగించారు.
ప్రారంభం కాని యాగశాల: అంతేకాకుండా రూ. 7.70 కోట్లతో చేపట్టిన వివధ పనుల్లో కొన్ని పనులు ఇంకా ప్రారంభమే కాకపోవడం ఆశ్చర్యకరం. ప్రధానంగా త్రిపురాంతక స్వామి ఆలయం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. ఇది అప్పగించినట్లయితే చందనోత్సవం రోజు భక్తుల కోసం క్యూ లైన్లను ఇక్కడే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయంలో ఎలివేటర్, పార్కింగ్ ప్రాంగణాలను ఇంకా ప్రారంభించనేలేదు. దేవస్థాన ప్రాంగణంలో నిర్మించవలసిన యాగశాల ఇంతవరకు ప్రారంభమే కాలేదు.
ఇవి మాత్రమే కాకుండా రూ.3.75 కోట్ల వ్యయంతో పాన్ ప్రాంత అభివృద్ధి, ఆరు ఎలక్ట్రిక్ మినీ వ్యాన్లు, డిజిటల్ సూచిక బోర్డులు, బ్యాగేజీ స్క్రీనింగ్, సెక్యూరిటీ వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు, తదితర సదుపాయాలను కల్పించాల్సి ఉన్నది. దీనికితోడు ఇటీవల ఇంజినీరింగ్ అధికారుతో సమీక్షను నిర్వహించిన ఈవో వెంకటరావు పూర్తయిన నిర్మాణాలు ఏమైతే ఉన్నాయో వాటిని దేవస్థానానికి తక్షణమే సమర్పించాల్సిందిగా కోరారు.
ప్రసాద్ పథకం వివరాలిలా! ప్రసాదం పథకానికి సంబంధించిన వివరాలను ప్రధానంగా పరిశీలించినట్లయితే సింహాచలం దేవస్థానానకి కేంద్రం మంజూరు చేసింది రూ. 54 కోట్లుగా ఉంది. వీటిని 2023వ సంవత్సరం డిసెంబర్ నెలలో మంజూరు చేసింది. దీనికి వర్చువల్ విధానంలో ప్రధాని మోదీతో శంకుస్థాపన 2024 మార్చి 7వ తేదీన జరిగింది. నిర్మాణానికి గడువును 2024 డిసెంబర్ నాటికి పూర్తవ్వాలని నిర్ణయించారు. పనుల్లో ఏమైనా జాప్యం జరిగితే దాన్ని 2025 మార్చి వరకు పొడిగించింది.
పురాతన పద్ధతిలో ఆలయాలకు మరమ్మతులు - సున్నం, బెల్లం, కరక్కాయలతో మిశ్రమం
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ - అంతరాలయంలో ప్రత్యేక పూజలు

