ETV Bharat / state

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భారీ కుట్ర - మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

కుట్రకు పాల్పడిన 'సాక్షి' ఫొటోగ్రాఫర్ మోహన్‌కృష్ణ, వైఎస్సార్సీపీ కార్యకర్త కోటి అరెస్టు - కుట్రలో పాలుపంచుకున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారీ

Liquor Bottles Found in Tirumala
Liquor Bottles Found in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 7:09 AM IST

3 Min Read
Choose ETV Bharat

Liquor Bottles Found in Tirumala: తిరుమలలో ఓ మారుమూల ప్రదేశంలో పదుల సంఖ్యలో మద్యం సీసాలు పడి ఉండడం కలకలం రేపింది. పోలీసు అతిథి గృహానికి సమీపంలో వాటిని గుర్తించారు. గతంలోను కూడా కొందరు వలస కార్మికులు నివాసం ఉన్న ప్రాంతాల్లో మద్యం సీసాలు బయట పడటంతో పోలీసులు వారిని ఖాళీ చేయించారు. అనంతరం పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సీసాలు బయట పడడం, అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని మద్యం తిరుమలకు రావడం పై పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేశారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాద్యమాలలో జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వాన్ని, టీటీడీని, పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని బయటి నుంచి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. కుట్ర కోణం వెనుక సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భారీ కుట్ర - మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం (ETV)

తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం బాటిళ్ల ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరా దృశ్యాలు, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ డేటాను విశ్లేషించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఎక్సైజ్ శాఖ సహకారంతో బాలాజీ కాలనీ గోడ వెనుక చెట్ల పొదల్లో దొరికిన 9 మద్యం సీసాలను ఎక్కడ కొన్నారో గుర్తించి కుట్రకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్​ చేయించి: తిరుపతికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి కావాలనే తిరుపతి నుంచి పాత ఖాళీ మద్యం సీసాలను సేకరించి కారులో తిరుమలకు తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పథకం ప్రకారం కౌస్తుభం గెస్ట్ హౌస్ వెనుక వైపు వాటిని పడేశారని ఆ తర్వాత తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్‌కు సమాచారం ఇచ్చారని చెప్పారు. నవీన్ ద్వారా విషయం తెలుసుకున్న సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణ తన సిబ్బందిని అక్కడికి పంపి వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది.

చట్టపరమైన చర్యలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వీరు ఈ పని చేశారని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం జూపార్క్ రోడ్డులోని దేవలోక్ వద్ద ప్రధాన నిందితుడు కోటి, రెండవ నిందితుడు మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక కారు, ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మరో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టైన మోహన్ కృష్ణ తన ఫోన్ పోయిందంటూ విచారణకు సహకరించడం లేదని ఇది అతని నేర స్వభావాన్ని బయటపెడుతుందని పోలీసులు తెలిపారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదు - భూమనను ప్రశ్నించిన సిట్

దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ము దోచుకున్న పోలీసులు - బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు