ఏలూరు ప్రజలకు ముఖ్య గమనిక - ఇకపై రోజుకు ఒక్కసారే తాగునీరు
ఎల్‌నినో ప్రభావంతో ఏలూరులో తాగునీటి ఎద్దడి - డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్న దెందులూరు, పంపుల చెరువు నీటి నిల్వలు - రేపటి నుంచి ఉదయం పూట మాత్రమే నీటి సరఫరా

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 21, 2026 at 8:53 PM IST
Eluru Water Crisis : ఎల్‌నినో ప్రభావం ఏలూరు నగరానికి తీవ్ర తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది. సరైన వర్షాలు లేక జలాశయాలు అడుగంటడంతో నగరంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటివరకు ప్రజలకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగునీరు అందించిన నగరపాలక సంస్థ అధికారులు, రేపటి నుంచి కేవలం ఒక్క పూట మాత్రమే నీటిని సరఫరా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అడుగంటిన నీటి నిల్వలు : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. నగరంలో 2 లక్షల 90 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మొత్తం 83 వేల కుటుంబాలు ఉండగా, అందులో 60 వేలకు పైగా ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. వీరికి దెందులూరు, పంపుల చెరువుల నుంచి నీటిని సరఫరా చేస్తుంటారు. దెందులూరు పరిధిలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3,000 ఎంఎల్‌డీలు. కానీ ప్రస్తుతం అందులో కేవలం 350 ఎంఎల్‌డీల నీరు మాత్రమే మిగిలింది. అటు 25 ఎకరాల్లో ఉన్న పంపుల చెరువు సామర్థ్యం 600 ఎంఎల్‌డీలు కాగా, అందులో 105 ఎంఎల్‌డీల నీరు మాత్రమే ఉంది. జలాశయాల్లో నీటి మట్టాలు ఒక్కసారిగా డెడ్ స్టోరేజ్‌కు పడిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.
రోజుకు ఒక్కసారే సరఫరా : నగర ప్రజల అవసరాలు తీర్చాలంటే ప్రతిరోజూ రెండు పూటలా కలిపి మొత్తం 35 ఎంఎల్‌డీల నీరు అవసరం అవుతుంది. ప్రస్తుతమున్న నీటి నిల్వలతో ఇలాగే రెండు పూటలా సరఫరా చేస్తే ఆ నీరు కేవలం 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న 4 రోజుల పాటు కేవలం ఉదయం ఒక్క పూట మాత్రమే ప్రజలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఇలా చేయడం వల్ల రోజుకు 17.5 ఎంఎల్‌డీల మేర నీరు సరిపోతుందని, తద్వారా నీటి నిల్వలు మరో 20 రోజుల పాటు ప్రజలకు అందించవచ్చని బల్దియా అధికారులు అంచనా వేస్తున్నారు.
అందుకే సమస్య : ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంతో కాలువలకు కూడా నీరు వదిలే పరిస్థితులు కనిపించడం లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విడుదల చేసిన నీరు కాలువల ద్వారా వస్తున్నప్పటికీ, మార్గమధ్యంలోనే రైతులు తమ వ్యవసాయ పనుల కోసం మళ్లించుకుంటున్నారు. ఏలూరు కాలువ శివారు ప్రాంతంలో ఉండటంతో నగరానికి తాగునీరు చేరుకోవడం గగనంగా మారింది. కాలువల్లో నీటి ప్రవాహం లేకపోవడం, మోటార్ల ద్వారా చెరువుల్లోకి నీటిని పంపించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
"ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి ఏర్పడింది. చెరువుల్లో తాగునీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రేపటి నుంచి నగరంలో ఒక పూట మాత్రమే మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితులను బట్టి నగరవాసులు తమకు అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."- భాను ప్రతాప్, నగరపాలక సంస్థ కమిషనర్
వేసవికి ముందే ప్ర'జల' కష్టాలు - పట్టణ ప్రాంతాల్లో మొదలైన ఎక్కిళ్లు!
రెండు వారాలుగా తాగునీటి కార్మికుల సమ్మె - చుక్క నీరందక అల్లాడుతున్న 500 గ్రామాల ప్రజలు

