సాంకేతిక లోపంతో లిఫ్ట్ ప్రమాదం - విశాఖలో ప్రాణాలు కోల్పోయిన 75 ఏళ్ల వృద్ధురాలు
మంగళవారం రాత్రి కిందకు వెళ్దామని లిఫ్ట్ వద్దకు వచ్చిన వృద్ధురాలు - సాంకేతిక లోపంతో లిఫ్ట్ డోర్ తెరుచుకుని కిందపడి మృతి - దుర్వాసన రావడంతో గుర్తించిన మెకానిక్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 10:48 AM IST
Visakhapatnam Lift Accident : లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ ఫ్లోర్‌కు రాకుండానే డోర్ తెరచుకోవడంతో ముందుకు అడుగు వేసిన వృద్ధురాలు కింద పడిపోయారు. వెంటనే లిఫ్ట్ కూడా కిందకు దిగడంతో దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విశాఖపట్నం నగరంలోని ఊర్వశి జంక్షన్ వద్ద ఓ అపార్ట్‌మెంట్లో బుధవారం వెలుగు చూసింది.
లిఫ్ట్ మరో ఫ్లోర్‌లో ఉన్నప్పటికీ : కంచరపాలెం పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం దుర్గా సీత(75) కొంతకాలంగా ఊర్వశి జంక్షన్ వద్ద ఉన్న ఒక అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో ఆయాగా పని చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేస్తూ, అందులోనే ఓ గదిలో ఆమె కూడా ఉంటున్నారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకొని కిందకు వెళ్దామని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ మరో ఫ్లోర్‌లో ఉన్నప్పటికీ, తలుపు తెరవగానే ఓపెన్ అయింది. దీంతో ఆమె లోపలికి వెళ్లగా కింద పడిపోయారు. ఈ లోగా ఆ లిఫ్ట్‌ను వేరొకరు ఆన్ చేశారు. ఒక్కసారిగా అది కిందకు దిగడంతో ఆమె దాని కింద నలిగి మృతి చెందారు.
ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చి లిఫ్ట్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని అపార్ట్‌మెంట్ నిర్వాహకులు బుధవారం ఉదయం మెకానిక్‌ను పిలిపించారు. ఆయన తలుపు తీసి మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా తీవ్ర దుర్వాసన రావడంతో విషయం బయట పడింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

