'మరింత తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు - యూనిట్ వ్యయం రూ.4.60 లక్ష్యం'
మూడేళ్లలో కొనుగోలు వ్యయం తగ్గించే యత్నం - యూనిట్‌కు రూ.4 లోపు తీసుకు వచ్చే ప్రయత్నాలు - విద్యుత్ సంస్థల డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 7:36 AM IST
Reduce Electricity Charges in AP: రాబోయే 3 ఏళ్లలో అనగా 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.4 లోపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.5.19గా ఉండేదని అన్నారు. దాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.90కు తగ్గించామని చెప్పారు. కొనుగోలు వ్యయం యూనిట్‌కు 29 పైసలు చొప్పున తగ్గడం వల్ల ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) అమలు చేశామని, దీని ఫలితంగా నవంబరు బిల్లులో యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలు తగ్గించామని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో బుధవారం విద్యుత్ సంస్థల డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎస్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్‌ల డైరీలు, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. యూనిట్ కొనుగోలు వ్యయం 2026-27లో రూ.4.60కు తగ్గించాలనేది లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
5 ఏళ్ల లక్ష్యాన్ని దాటేశాం: గతేడాది గుజరాత్‌లో నిర్వహించిన ఎనర్జీ సమ్మిట్‌లో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 76 గిగావాట్ల సౌర, పవన, హైబ్రిడ్, పీఎస్పీ, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామని కేంద్రానికి ప్రతిపాదించామని సీఎస్ అన్నారు. 5 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాన్ని అధిగమించమన్నారు. ఇప్పటికే 90 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. వాటిని గ్రౌండింగ్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2029 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన తెలిపారు.
100 శాతం విద్యుదీకరణ: ‘రాష్ట్రంలో 100 శాతం విద్యుదీకరణ సాధించామని సీఎస్ విజయానంద్ అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలకూ లైన్లు ఏర్పాటు చేశాం. తద్వారా విద్యుత్ అందిస్తున్నామన్నారు. సరఫరా, పంపిణీ నష్టాలను 9.6 శాతానికి తగ్గించామని వివరించారు. ఆర్డీఎస్‌ఎస్ కింద ఫీడర్ల విభజన పనులు పూర్తి అయితే ఓవర్‌లోడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామాలకు అంతరాయం లేకుండా త్రీఫేజ్ విద్యుత్ అందించడం సాధ్యం అవుతుంది అని తెలిపారు.
2005లో ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గాయి: 2025లో దేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీలు తగ్గించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు ఇంకా పెద్దఎత్తున తగ్గించే లక్ష్యంతో 2026లో పని చేస్తామని స్పష్టం చేశారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం కృషి చేస్తున్నారని, తద్వారా విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గి ప్రజలపై భారం తగ్గనుందన్నారు. సోలార్ ద్వారా పగటిపూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.
రూ.923 కోట్ల విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: మరోవైపు గత కొద్ది నెలల కిందట విద్యుత్ ఛార్జీల బాదుడు నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. రూ.923.55 కోట్ల విద్యుత్ ఛార్జీలను (ట్రూడౌన్) తగ్గించింది. ఆ మొత్తాన్ని వినియోగదారులకు అప్పటి వినియోగం లెక్కల ఆధారంగా సర్దుబాటు చేయనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ అనే మాటలు మాత్రమే విన్న వినియోగదారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి ‘ట్రూడౌన్’ను పరిచయం చేసింది. తగ్గించిన మొత్తాన్ని విద్యుత్ కంపెనీలు వినియోగదారులకు చెల్లించాయి. వీటిని నవంబరు బిల్లు నుంచి 12 సమాన వాయిదాలలో తిరిగి ఇచ్చారు. ప్రతినెలా ఇచ్చే బిల్లులో యూనిట్‌కు 13 పైసల చొప్పున అప్పటి వినియోగం ఆధారంగా విద్యుత్ సంస్థలు ఛార్జీలను కూడా తగ్గించనున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ కొనుగోళ్లపై చేసిన ఖర్చు, పంపిణీ నష్టాలు, సరఫరా, ఇతర ఖర్చులు అన్నింటిని కలిపి ఎఫ్‌పీపీసీఏ కింద రూ.2,758.76 కోట్ల వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత రూ.1,863.64 కోట్లు వసూలు చేయడానికి అనుమతించాలని కమిషన్ నిర్ణయించింది. ఆ సంవత్సరం యూనిట్‌కు 40 పైసల చొప్పున ఎఫ్‌పీపీసీఏ కింద ప్రతి నెలా బిల్లులో కలిపి విద్యుత్ సంస్థలు వసూలు చేశాయి.
ఇలా విద్యుత్ సంస్థలు వసూలు చేసిన మొత్తం రూ.2,787.19 కోట్లుగా లెక్క తేలింది. ఈ మొత్తంలో ఎఫ్‌పీపీసీఏ కింద అనుమతించిన రూ.1,863.64 కోట్లుకు గాను రూ.923.55 కోట్లు ట్రూడౌన్ చేయాలని ఏపీఈఆర్‌సీ సైతం నిర్ణయించింది. ట్రూడౌన్ మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ కమిషన్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ఇంధనశాఖకు 'సెకి' లేఖలు - ఒప్పందం ప్రకారం 7వేల మెగావాట్లు
" మీరు చేసిన పని వల్ల నేను తలదించుకోవాల్సి వచ్చింది" - అధికారులపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

