గాజువాక నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ బస్సులు - రెండు రూట్లు ఖరారు
ప్రయాణికులకు 9 చోట్ల వెయిటింగ్ లాంజ్‌లు - జులై మొదటి వారంలో ట్రయల్ రన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 12:08 PM IST
Visakhapatnam - Bhogapuram Airport Bus Service : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న వేళ అక్కడికి ప్రయాణికులు చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళిక రూపొందించి ప్రాథమికంగా రెండు రూట్లను ఖరారు చేసింది. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి రెండు గంటలు, భోగాపురం నుంచి విశాఖ వచ్చేందుకు గంటన్నర సమయం పట్టనున్నట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. ప్రయాణ సమయం, విమాన సర్వీసుల వేళలను ఆధారంగా చేసుకొని బస్సులు నడపనున్నారు.
మొదటి రూటు: గాజువాక నుంచి భోగాపురం (షీలానగర్, ఎన్‌ఏడీ, మాధవధార, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక, మధురవాడ, ఆనందపురం)
రెండో రూటు: గాజువాక నుంచి సింధియా మీదుగా భోగాపురం (రైల్వేస్టేషన్, బస్టాండ్, వీఎంఆర్‌డీఏ పార్కు, రుషికొండ, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం)
ఈ ప్రాంతాల్లో లాంజ్‌లు: విమాన ప్రయాణికుల కోసం తొమ్మిది చోట్ల వెయిటింగ్ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 30 నుంచి 40 మంది ప్రయాణికులకు సరిపోయేలా వీటిని నిర్మించనున్నారు. అవసరమైతే బోర్డింగు పాసులు అందులోనే తీసుకొని లగేజి అక్కడే వదిలేసి నేరుగా విమానం ఎక్కించేలా ఆలోచన చేస్తున్నారు.
ప్రతి అరగంటకు ఒక బస్సు: మొదటి దశలో ఆటోనగర్, ఎన్‌ఏడీ, గురుద్వారా, వెంకోజిపాలెం, ఎండాడ వద్ద ఆ లాంజ్‌లను ఏర్పాటు చేసి తర్వాత హనుమంతువాక, ఆర్టీసీ కాంప్లెక్సు, వీఎంఆర్‌డీఏ పార్కు, రైల్వేస్టేషన్ వద్ద అందుబాటులోకి తేనున్నారు. ప్రతి అరగంటకు ఒక బస్సు అక్కడికి వచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. కొన్ని బస్సులు కేవలం లాంజ్‌ల వద్దే ఆగేలా, మరికొన్ని మద్దిలపాలెం, మురళీనగర్, షీలానగర్, మధురవాడ, కొమ్మాది, ఆనందపురం వద్ద కూడా నిలిపేలా అదనపు స్టేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మొదటి దశలో 20 విద్యుత్తు బస్సులు: విశాఖ నుంచి భోగాపురానికి మొదటి దశలో 20 విద్యుత్తు బస్సులు నడపనుండగా డిమాండు ఆధారంగా వాటిని 50 వరకు పెంచనున్నారు. గాజువాక - భోగాపురం రూట్లో పది, సింధియా మీదుగా మరో పది నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్ ఉంటే అడివివరం రూటూ పరిశీలించనున్నారు.
పుణె నుంచి విద్యుత్తు బస్సులు: త్వరలో ప్రయోగాత్మక పరిశీలన చేస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం అప్పల నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ " జులై మొదటి వారంలో పుణె నుంచి విద్యుత్తు బస్సులు విశాఖ వస్తున్నాయి. వచ్చిన వెంటనే ప్రయోగాత్మకంగా పరిశీలన చేపట్టనున్నాం. ఇప్పటికే రూటు పరిశీలన సర్వే పూర్తయింది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేస్తాం " అని తెలిపారు.
యూడీఎఫ్ ఛార్జీలు
భోగాపురం విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే దేశీయ ప్రయాణికులకు రూ.835 చొప్పున, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునే ప్రయాణికులకు రూ.355 చొప్పున యూడీఎఫ్ ఛార్జీలు వర్తించనున్నాయి. ఇక అంతర్జాతీయ సర్వీసుల విషయానికి వస్తే భోగాపురం నుంచి విదేశాలకు బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.1,255 గానూ, విదేశాల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు రూ.545 గానూ ఈ తాత్కాలిక రుసుములను ఇటీవల ఖరారు చేశారు.
అభివృద్ధికి సరికొత్త బాటలు
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో, ప్రాజెక్ట్ సంసిద్ధతపై ముందడుగు పడింది. ఏపీలో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఏదైమైనా భోగాపురం విమానాశ్రయం పూర్తైతే ఏపీలో ఉన్న పర్యాటక సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన, వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుంది.
ద్రాక్షారామ మణప్పురం ఫైనాన్స్‌లో భారీ మోసం : అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం
కనిపించేదంతా నిజం కాదు - డీప్‌ఫేక్ వీడియో కాల్స్‌పై అవగాహన అవసరం

