రెగ్యులర్ పంటలా - ఆరుతడి పంటలా? - ఎటూ తేల్చుకోలేని స్థితిలో అన్నదాత
ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్‌నినో - వర్షాలు కురవకపోవడంతో వరి సాగుకు ఇబ్బందులు - జిల్లాల్లో తగ్గిన వరి సాగు - వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతుుల

Published : July 3, 2026 at 7:13 PM IST
El Niño impact on Kharif season : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఏ పంటలు సాగుచేయాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా అన్నదాతలు మొగ్గు చూపడంలేదు. వరి పండే నేలల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు.
సందిగ్ధంలో అన్నదాతలు : ప్రతికూల వాతావరణ పరిస్థితులతో జిల్లాల్లో వానాకాలం సాగు సందిగ్ధంలో పడింది. కనీసం పది శాతం వరకు కూడా విత్తనాలు పడలేదు. జలాశయాల్లో నీటినిల్వలు సరిపడా లేకపోవడంతో వరిసాగుకు నీరందే పరిస్థితి లేదు. బావులు, బోరుబావుల్లో నీరు అంతంత మాత్రమే ఉండటంతో పంటలు వేయాలా వద్దా అని అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే వరినార్లు పోసి, పత్తి విత్తనాలు నాటినా వర్షాలు లేక ఎండిపోయే పరిస్ధితి ఏర్పడింది.
"ప్రభుత్వం సన్నరకాల ధాన్యాలు సాగు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కావట్లేదు. అధికారులు సన్నాలు వేయమని చెప్పారు. ఇప్పటికే సమయం అయిపోయింది. ఇప్పుడు విత్తనాలు నాటితే పంటపై ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు కూడా లేవు. వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఎక్కువైనట్లయితే ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలంగా ఉండదు. సన్నవడ్లపై రూ.500 అదనంగా ఇస్తామని చెబుతున్నారు. అవి మాకు ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ సన్నరకాల్లో 15 క్వింటాళ్ల కంటే అధిక దిగుబడి రావట్లేదు"- రైతులు
అరుతడి పంటలే మేలు : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా రైతుల్లో స్పందన లేదు. వరిసాగుచేసిన భూముల్లో ముఖ్యంగా నల్లరేగడి నేలలో ఇతర పంటల సాగుకు యోగ్యంకాదని రైతులు చెబుతున్నారు. సన్నరకాల వరి పండించేందుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. వరి తర్వాత అధికంగా పత్తిని రైతులు సాగుచేసేవారు. రెండు లక్షల సాధారణ సాగు విస్తీర్ణానికి ప్రస్తుతం లక్షఎకరాల్లో వేశారు. భవిష్యత్‌లో వర్షభావ పరిస్థితులు తీవ్రమైతే రైతులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
"వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు బదులుగా పప్పుదినులు, జొన్న, రాగి, సజ్జ లాంటి పంటలు సాగు చేయాల్సిందిగా రైతులకు సూచించాం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డబ్ల్యూజీఎల్44, కేఎన్ఎం 7715, తెలంగాణ సోనా లాంటి విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. నారు పోసుకునే రైతులు ముఖ్యంగా స్వల్పకాలిక సన్నరకాల వరి విత్తనాలను మాత్రమే సాగు చేయాలని సూచిస్తున్నాం"- వ్యవసాయ అధికారులు
స్వల్పకాలిక పంటలపై రైతులకు అవగాహన : స్వల్పకాలిక, ఆరుతడి పంటలపై రైతువేదికల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రభుత్వం సూచించినట్లుగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపితేనే ఎల్‌నినో ప్రభావం, నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్! - రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం

