'ఆరుతడి పంటలకే జలాలు' - తుంగభద్ర డ్యామ్‌కు 'ఎల్‌నినో' దెబ్బ
కర్ణాటకలో వర్షాభావంతో డ్యామ్‌కు రాని వరద - 170 టీఎంసీల ప్రవాహానికి బదులు ఈసారి 98 టీఎంసీలే - తాగునీరు, ఆరుతడి పంటలకే నీరు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 10:10 PM IST
El Nino Impact on Tungabhadra Dam : వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే 'సూపర్ ఎల్‌నినో' ప్రభావం తుంగభద్ర జలాశయంపై తీవ్రంగా పడింది. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తుంగ, భద్ర నదుల నుంచి డ్యామ్‌లోకి వరద రావడం లేదు. ఫలితంగా జలాశయం దాదాపు ఎండిపోయిన పరిస్థితికి చేరుకుంది. ఏటా ఈ సమయానికి డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేవారు. కానీ ఈ ఏడాది జలాశయం నిండటమే గగనంగా మారింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో తుంగభద్ర డ్యామ్‌కు సాధారణంగా 170 నుంచి 250 టీఎంసీల వరద వస్తుంది. కానీ ఈసారి కేవలం 98 టీఎంసీల ప్రవాహం మాత్రమే నమోదైంది. దీంతో జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోలేదు. సెప్టెంబర్ నెలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తగా వరద వచ్చే అవకాశం లేకపోవడంతో జలాశయంలో చేరిన కొద్దిపాటి నీటినే ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ, కర్ణాటక ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలని ఉమ్మడిగా నిర్ణయించాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆరుతడి పంటల సాగుతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేటు 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్రస్ట్ గేట్ల భద్రత ముప్పుగా మారిందని నీటి నిల్వను 105 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలకే పరిమితం చేయాలని నిపుణులు సూచించారు. దీంతో 2024-2025లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి నిర్ణయంతో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేశారు. జలాశయం భద్రతపై సాంకేతిక పరీక్షలు నిర్వహించిన నిపుణులు, తక్షణమే గేట్లు మార్చాలని నివేదిక ఇచ్చారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.52 కోట్లు విడుదల చేసి, గతేడాది డిసెంబర్‌లో గేట్ల మార్పిడికి శ్రీకారం చుట్టింది. పనుల కోసం డ్యామ్‌లోని నీటిని కాలువల ద్వారా వదిలేసి డెడ్ స్టోరేజీకి చేర్చారు. ఆ సమయంలో రైతులు రెండో పంటను త్యాగం చేసి ప్రభుత్వానికి సహకరించారు. అన్నదాతల సహకారంతో ఏపీ సర్కార్ కేవలం ఆరు నెలల్లోనే జలాశయానికి ఉన్న 33 గేట్లు, వాటి గొలుసులను మార్చి సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ నాటికే వరద నీటిని నిల్వ చేసేందుకు డ్యామ్‌ను సిద్ధం చేశారు. కానీ ఈసారి సరైన ప్రవాహాలు రాకపోవడంతో కొత్త గేట్లను దాటి నీరు రాని పరిస్థితి నెలకొంది.
అనంతపురం జిల్లాకు 16 టీఎంసీలు : సీజన్ ప్రారంభానికి ముందు జలాశయంలో కేవలం 9 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఏపీ, కర్ణాటక 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం మళ్లించాయి. ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అనంతపురం జిల్లాకు 16 టీఎంసీల కోటాను కేటాయించారు. ఇందులో 8 టీఎంసీలను తాగునీటికి, మిగిలిన నీటిని ఆరుతడి పంటలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే హెచ్ఎల్సీ, జీబీసీ కాలువల ద్వారా రైతులకు ఆరుతడి పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కడికక్కడ అవకాశం ఉన్న మేర నీటిని ప్రభుత్వం నిల్వ చేస్తోంది.
"గతేడాది డ్యామ్ గేట్ల మార్పిడి కోసం మేమంతా రెండో పంటను త్యాగం చేశాం. కొత్త గేట్లు ఏర్పాటై ఈసారైనా పంటలకు పుష్కలంగా నీరు అందుతుందని ఆశించాం. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల వరద రాకపోవడం దురదృష్టకరం. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరుతడి పంటలనే సాగు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి."-చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు
"కర్ణాటకలో ఈసారి వర్షాలు ఆశాజనకంగా లేవు. తుంగ, భద్ర నదుల నుంచి డ్యామ్‌లోకి ఆశించిన స్థాయిలో ప్రవాహం రాలేదు. ప్రకృతి అనుకూలించని కారణంగా నీటి కొరత ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి నీటినే రెండు రాష్ట్రాల రైతులు, ప్రజలు పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది."-పురుషోత్తం, కర్ణాటక రైతు సంఘం బళ్లారి జిల్లా అధ్యక్షుడు
"ఈ ఏడాది అనంతపురం జిల్లాకు 16 టీఎంసీల నీటి కోటా కేటాయించడం జరిగింది. ఇందులో 8 టీఎంసీలు కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. మిగిలిన నీటిని హెచ్చెల్సీ, జీబీసీ కాలువల ద్వారా ఆరుతడి పంటల సాగుకు విడుదల చేస్తున్నాం. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు నీటిని వృథా చేయకుండా అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని కోరుతున్నాం."-సుధాకర్, హెచ్ఎల్సీ ఎస్ఈ
ఉత్తరాంధ్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం - అనకాపల్లి గడ్డను ముద్దాడిన గోదావరి జలాలు
గలగలా గోదావరి - బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం: సీఎం చంద్రబాబు

