ETV Bharat / state

చిన్ననీటి వనరులపై ఎల్​నినో ఎఫెక్ట్​ - చెరువుల్లో అంతంత మాత్రంగానే నిల్వలు - పంటలు చేతికొచ్చేనా?

తెలంగాణలో నీటి వనరులపై ఎల్‌నినో ప్రభావం - జులై, ఆగస్టులో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి కొంత మేర నీరు - కానీ అంతంత మాత్రంగానే చెరువుల్లో నీటి నిల్వలు

EL Nino impact on Telangana water Bodies
తెలంగాణలో ఎల్​నినో ప్రభావం, చాలా చెరువుల్లో ఆందోళనకర స్థాయిలో నీటి నిల్వ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 11:40 AM IST

3 Min Read
Choose ETV Bharat

EL Nino impact on Telangana : ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలోని చిన్ననీటి వనరులపై తీవ్రంగా ఉంది. జులై, ఆగస్టులో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, జలాశయాల్లోకి కొంత మేర నీరు చేరినప్పటికీ, చెరువుల్లో మాత్రం నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం చెరువుల్లో ప్రస్తుతం నీటి నిల్వలు 36 శాతంలోపే ఉన్నాయి.

చెరువులపై తీవ్ర ప్రభావం : తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులు, జలాశయాలతో పోలిస్తే చిన్న నీటి వనరులైన చెరువుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో చెరువులపై తీవ్ర ప్రభావం పడినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. జులైలో రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి నదుల్లోకి కొంత మేర వరద ప్రవాహాలు వచ్చాయి. ఫలితంగా ప్రధాన జలాశయాల్లోకి నీరు చేరింది. ఆ ప్రభావం చెరువులపై మాత్రం పెద్దగా కనిపించలేదు.

వేల చెరువుల్లో నీరే లేదు : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,500 చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 253.8 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం వాటిలో కేవలం 90.55 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం సామర్థ్యంలో 35.7 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చెరువుల వారీగా పరిశీలిస్తే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మొత్తం 21,500 చెరువుల్లో కేవలం 790 చెరువుల్లో మాత్రమే 75 నుంచి 100 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. మరో 3,051 చెరువుల్లో 50 నుంచి 75 శాతం వరకు నీరు ఉంది. అదే విధంగా 4,561 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిల్వలు ఉండగా, 7,302 చెరువుల్లో 25 శాతంలోపే నీరు ఉంది. మరో 5,796 చెరువుల్లోకి ప్రవాహాలు రాకపోవడంతో అసలు నీటి నిల్వలే లేవు.

రాబోయే రోజుల్లో వర్షాలపై ఆధారపడి చెరువుల నీటిమట్టాలు పెరగాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాల్లో చెరువుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 53 శాతానికి పైగా, వనపర్తి జిల్లాలో 52 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయి. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 50 శాతానికి పైగా చెరువుల్లో నీరు ఉంది. ఆదిలాబాద్​లో 49.9 శాతం, నాగర్‌కర్నూల్‌లో 44.6 శాతం, వికారాబాద్‌లో 43.1 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి.

జనగామలో అత్యల్పం : ఈ జిల్లాలతో పోలిస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చెరువుల్లో నీటి నిల్వలు అత్యల్పంగా ఉన్న జిల్లాల్లో జనగామ మొదటి స్థానంలో ఉంది. జిల్లాలోని చెరువుల్లో కేవలం 18.6 శాతం నీరు మాత్రమే ఉంది. సిద్దిపేటలో 19.3 శాతం, వరంగల్ అర్బన్‌లో 20.4 శాతం, కరీంనగర్‌లో 21.9 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి.

వ్యవసాయ రంగంపై గణనీయ ప్రభావం : జులై, ఆగస్టులో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నదుల్లోకి ప్రవాహాలు వచ్చాయి. ఆ నీరు ప్రధానంగా ప్రాజెక్టులు, జలాశయాలకే పరిమితమైనట్లు చెరువుల నిల్వలు సూచిస్తున్నాయి. చిన్ననీటి వనరులకు తగినంతగా వరద నీరు చేరకపోవడంతో తెలంగాణలోని వేలాది చెరువులు ఆశించిన స్థాయిలో నిండలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటితో పాటు భూగర్భ జలాల పెంపునకు చెరువులు కీలక ఆధారం. వాటిలో తక్కువ నిల్వలు ఉండటం వ్యవసాయ రంగంపై గణనీయ ప్రభావం చూపుతున్నాయి. మిగిలిన వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరితేనే వేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక్కడ కరవు, అక్కడ వరదలు - ఈ విభిన్న వాతావరణానికి కారణాలు ఏంటి?

ఎల్‌నినో దెబ్బకు సాగు కుదేలు - తెలంగాణలో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం