ETV Bharat / state

దేశంలో తొలిసారిగా ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

ఫాల్కన్ పోంజీ కేసు నిందితుడు అమర్‌దీప్‌కుమార్‌కు చెందిన విమానం వేలం - హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్‌800ఏ విమానం వేలం - ఆక్షన్​లో విమానాన్ని రూ.3 కోట్లకు విక్రయం

ED Auctions seized Aircraft
ED Auctions seized Aircraft (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 3, 2026 at 6:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

ED Auctions seized Aircraft : దేశంలోనే మొదటిసారిగా, ఓ కేసులో జప్తు చేసిన విమానాన్ని అధికారులు వేలం వేశారు. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన అధికారులు హాకర్ 800ఎ రకానికి చెందిన విమానాన్ని ఎంఎస్‌టీసీ సంస్థ ద్వారా రూ. 3 కోట్లకు బహిరంగ వేలంలో విక్రయించారు. విమానం విక్రయంతో వచ్చిన సొమ్మును ఈడీ బాధితులకు చెల్లించనుంది. ఫాల్కన్ స్కామ్ లో నిందితులు దేశవ్యాప్తంగా 7056 మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.4215 కోట్లు సేకరించారు. మోసం వెలుగులోకి వచ్చేసరికి 4065 మంది డిపాజిటర్లు నుంచి దాదాపు రూ. 792 కోట్ల వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ED Auctions seized Aircraft
ఈ-వేలంలో ఈడీ విక్రయించిన విమానం (ETV Bharat)

అసలేం జరిగిందంటే? : హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెసర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఒక నకిలీ వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తామంటూ నమ్మించి, వేలాది మంది అమాయక పెట్టుబడిదారుల నుంచి కోట్లు రూపాయలను వసూలు చేసింది. తీరా చూస్తే, అక్కడ ఎలాంటి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారమూ జరగలేదని, అది కేవలం ఒక బోగస్ స్కీమ్ అని అధికారులు తెల్చారు. ఈ మోసంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో, ఈడీ రంగంలోకి దిగి పీఎంఎల్‌ఏ చట్టం కింద మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.

ఈ స్కామ్‌కు సూత్రధారి అయిన ఫాల్కన్ గ్రూప్ సీఎండీ అమర్‌దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థతో పాటు ఇతరులపై ఈడీ గట్టి నిఘా పెట్టింది. దర్యాప్తులో భాగంగా 2025, మార్చి 7న ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడికి చెందిన హాకర్ 800ఎ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సహ నిందితులైన సందీప్ కుమార్, శరద్ చంద్ర తోష్నివాల్, ఆర్యన్ సింగ్ ఛాబ్రా నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విమానాన్ని సీజ్ చేసిన తర్వాత, ఈడీ చట్టపరమైన అనుమతులను తీసుకుంది.

ఈ వేలంలో రూ.3కోట్లు పలికిన విమానం : గత ఏడాది ఆగస్టు 18 న విమానం జప్తును సమర్థిస్తూ పీఎంఎల్‌ఏ అడ్జూడికేటింగ్ అథారిటీ ఈడీ దరఖాస్తును ధృవీకరించింది. 2025 సెప్టెంబర్ 29 న నిందితులపై ఈడీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2025 నవంబర్ 20న జప్తు చేసిన ఆస్తులను విక్రయించేందుకు వీలు కల్పించే పీఎంఎల్‌ఏ రూల్స్ 2013 [రూల్ 4(2)] ప్రకారం విమానాన్ని వేలం వేసేందుకు అనుమతించాలని ఈడీ కోరగా, అడ్జూడికేటింగ్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ అనుమతులతోనే చట్టపరమైన అన్ని అడ్డంకులను తొలగిన తర్వాత 2026 జూలై 1న రూ. 3 కోట్లకు విమానాన్ని వేలం వేశారు. అయితే కొనుగోలుదారు వివరాలు మాత్రం ఈడీ వెల్లడించలేదు.

ఫ్యాన్సీ నంబర్ల వేలం - తెలంగాణ రవాణా శాఖకు భారీగా ఆదాయం