మద్యం రవాణాలో దోచారు - కుటుంబ సభ్యులకు పంచారు!
కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించిన ఈడీ - కుంభకోణంలో కారుమూరి కుటుంబమే ప్రధాన లబ్ధిదారని వెల్లడి - కొల్లగొట్టిన సొత్తులో రూ.11.95 కోట్లు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 7:36 AM IST
AP Liquor Transportation Scam Updates : వైఎస్సార్సీపీ నాటి మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కుమార్ ప్రధాన లబ్ధిదారులు కీలక సూత్రధారులని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఇప్పటి వరకూ చేపట్టిన దర్యాప్తులో రూ.18.09 కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అందులో రూ.11.95 కోట్లు కారుమూరి కుటుంబ సభ‌్యుల ఖాత్లోలకే వెళ్లినట్లు నిర్ధారించింది.
నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఖాతాలోకి రూ.3.73 కోట్లు, ఆయన భార్య కీర్తి ఖాతాలోకి రూ.6.15 కోట్లు, మామ వల్లూరు ప్రతాప్‌రెడ్డి ఖాతాలోకి రూ.93 లక్షలు, తల్లి కారుమూరి లక్ష్మీకిరణ్ ఖాతాలోకి రూ.80 లక్షలు, సోదరి కారుమూరి దీపిక ఖాతాలోకి రూ.9 లక్షలు, అచ్చప్ప రామ్మూర్తి ఖాతాలోకి రూ.24 లక్షలు చేరినట్లు ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. కారుమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు, ఆస్తుల సమీకరణ కోసం అడ్వాన్సుల చెల్లింపునకు, మైనింగ్ లీజుల హక్కులు పొందేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. విలాసవంతమైన వాహనాలు, ఖరీదైన వాచీల కొనుగోలు, పుట్టినరోజు వేడుకల నిర్వహణ, విమాన ప్రయాణాలు తదితర ఖర్చులు, పొలిటికల్ ఫండింగ్‌కూ ఈ అక్రమ సొత్తే వాడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది.
జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానంలో ఉన్న మద్యం రవాణా కాంట్రాక్టును ఈ ముఠా కేంద్రీకృతం చేసి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సిగ్మా సంస్థకు కట్టబెట్టిందని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసుకు కిలోమీటరుకు రూ.19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవారని చెప్పింది. అయితే కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని ఏకంగా రూ.32.53కు పెంచేశారని వివరించింది. తద్వారా ఒక్కో మద్యం కేసుపై కిలోమీటరుకు రూ.13 చొప్పున దోచుకున్నారని తెలిపింది.
Karumuri Nageswara Rao Remand Report : ఆ తర్వాత సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ పేరిట కారుమూరి నాగేశ్వరరావు సబ్‌కాంట్రాక్టు పొందారని ఈడీ పేర్కొంది. తద్వారా వచ్చిన లబ్ధిలో 85 శాతం కారుమూరి కుటుంబానికి, 15 శాతం సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌కు చెల్లించేలా మౌఖికంగా ఒప్పందం చేసుకున్నారని వెల్లడించింది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు వ్యవహారాలన్నీ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్‌కు చెందిన వ్యక్తులే చూసేవారని చెప్పింది.
బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సిగ్మాకు, సిగ్మా నుంచి సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాలోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమయ్యేవని రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ నుంచి నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేవని పేర్కొంది. మరికొంత సొత్తును ఆ సంస్థ ఖాతా నుంచి విత్‌డ్రా చేసి నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందించేవారని తెలిపింది. స్కాంలో కొల్లగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు ఈ ఎత్తుగడలు అవలంబించారని వివరించింది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును తమకు కట్టబెట్టినందుకు రాజ్ కెసిరెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు రూ.50-60 లక్షలు సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధి సందీప్ ద్వారా చెల్లించేవారని చెప్పింది. ముఠాలోని మిగతా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేదని ఈడీ వెల్లడించింది.
మరోవైపు విచారణకు రావాలంటూ కారుమూరి నాగేశ్వరరావుకు ఈ ఏడాది జూన్ 24న నోటీస్తే రాలేదని ఈడీ తెలిపింది. ఆ తర్వాత ఆగస్ట్ 17 వరకు మొత్తం 10 సార్లు నోటీసులిచ్చినా కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతోనే విచారణకు గైర్హాజరయ్యారని వివరించింది. వాస్తవాలు దాచిపెట్టి, దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారని పేర్కొంది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అందుకే అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. మద్యం రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును తనకు, తన కుటుంబ సభ్యులకు మళ్లించేలా చూడటంలో నాగేశ్వరరావు రాజకీయ మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్పింది. ఇతర వ్యక్తులకు సబ్‌కాంట్రాక్టు ఇప్పించినందుకు లాభాల్లో 50 శాతం వాటా తీసుకున్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు - మాజీ మంత్రి కారుమూరికి 2 వారాల జ్యుడీషియల్ రిమాండ్
మద్యం రవాణా కుంభకోణం కేసు అప్డేట్స్ - మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

