టీటీడీ "కల్తీ నెయ్యి" కేసు అప్డేట్స్ - అక్రమ నగదుతో నిందితుల "రియల్" దందా
టీటీడీ కల్తీ నెయ్యి కేసు - బుధవారం నాడు 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 11:37 AM IST
TTD Ghee Adulteration Case : వైఎస్సార్సీపీ పాలనలో టీటీడీకి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసింది. పోగేసిన అక్రమ నగదుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. దాదాపు రూ.45 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాల కొనుగోలు చేయడంతో పాటు భారీ భవనాల నిర్మాణం కూడా చేపట్టినట్లు ప్రాథమికంగా గుర్తించింది.
ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ, మాల్‌గంగా డెయిరీల ముసుగులో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు ఈడీ నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనను పలు వ్యాపార సంస్థల ద్వారా మళ్లించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చినట్లు తేల్చింది. నిందితులంతా కలిసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది.
వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లైనా పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ వినయ్‌కాంత్ చావ్డా, దిల్లీలోని హవాలా ఏజెంట్ ఆశిష్ అగర్వాల్, మనీ లాండరింగ్‌కు వీలుగా నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించిన మహేష్‌కుమార్ రొహిరా, అజయ్‌కుమార్ సుగంధ్‌తోపాటు రాజేష్ మన్‌సుఖ్‌లాల్ చావ్డా, మచీంద్ర శాంతారామ్ లంకేల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
అదేవిధంగా దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ, అహిల్యనగర్‌లోని మాల్‌గంగా డెయిరీ, రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుల వద్ద రూ.60 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలూ స్వాధీనం చేసుకున్నారు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సాగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ED on TTD Ghee Case : టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా ఆ అక్రమ సొత్తుతో దేహ్రాదూన్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో రూ.7.80 కోట్లతో మూడు వాణిజ్య స్థలాలు కొన్నట్లు ఈడీ గుర్తించింది. భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ తన సంస్థ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ ఖాతా నుంచి 1.18 కోట్లు మళ్లించుకుని ఆ సొత్తుతో భారీ భవనం నిర్మించినట్లు తేల్చింది. రూ.1.36 కోట్లు, రూ.79.55 లక్షలతో మరో రెండు ఆస్తులు, రూ.3.41 కోట్లు వెచ్చించి పలుచోట్ల స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించింది.
ఇవేగాక మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లు తేలడంతో ఈడీ ఆరా తీస్తోంది. పలు సంస్థల ఖాతాల నుంచి వేతనాల పేరిట కోట్లు తీసుకుని వాటితోనూ భారీగా ఆస్తులు కొన్నట్లు, నిందితులు వారి అక్రమ సంపాదనను వేరే ఖాతాల్లోకి మళ్లించేందుకు, బోగస్ కంపెనీల నెట్‌వర్క్, నకిలీ లావాదేవీల ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. పొమిల్ జైన్, విపిన్ జైన్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, దిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా మనీ రూటింగ్ చేసినట్లు ఈడీ తేల్చింది.
భోలేబాబా డెయిరీ 2019-24 మధ్య 59 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థతో పాటు వైష్ణవి, మాల్‌గంగా, ఏఆర్ డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసింది! తద్వారా రూ.235 కోట్ల అనుచిత లబ్ధి పొందింది. ఈ నగదును భోలేబాబా, దాని అనుబంధ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్ కంపెనీ, హర్ష్ ఫ్రెష్ డెయిరీ, వైష్ణవి డెయిరీ, వాటికి సంబంధించిన కీలక వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి హవాలాకు పాల్పడింది. ఆ అక్రమార్జనతోనే స్థిరాస్తులు కొన్నట్లు ఈడీ గుట్టురట్టు చేసింది.
'కల్తీ నెయ్యి సరఫరాకు వైఎస్సార్సీపీ కీలక నేతలే ప్రధాన కారకులు' - తేల్చి చెప్పిన ఏకసభ్య కమిటీ
కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ - రసాయన మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా

