ETV Bharat / state

అందరినీ ఆకట్టుకునేలా - తుది దశకు మర్దగూడ ఎకో టూరిజం పార్కు పనులు

అల్లూరి సీతారామరాజు జిల్లా మర్దగుడలో ఎకో టూరిజం పార్కు నిర్మాణం - తుది దశకు చేరుకున్న పనులు - మరో 20 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి

ECO Tourism Park Works in Mardaguda
ECO Tourism Park Works in Mardaguda (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 30, 2026 at 8:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

ECO Tourism Park Works in Mardaguda : పర్యాటకులకు అడవి మధ్యలో ఉన్న అనుభూతిని ఇచ్చే ఎకో టూరిజం పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మర్దగుడ గ్రామ సమీపంలో దీనిని చేపట్టారు. నిధుల విడుదలలో జాప్యం, వుడెన్ కాటేజ్‌ల నిర్మాణానికి అవసరమైన కలప సామగ్రి రావడంలో ఆలస్యం కావడం వల్ల ఏళ్ల తరబడి సాగిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది.

సందర్శకులను మంత్రముగ్ధులను చేసేందుకు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రకృతి వనాన్ని మరో 20 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఐటీడీఏ, అటవీశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాఫీ తోటల నడుమ ఈ పార్కు పర్యాటక రంగానికి సరికొత్త వెలుగులు నింపనుంది.

రూ.5.5 కోట్ల ఎన్‌టీపీసీ నిధులతో: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాఫీ తోటల మధ్య దీనిని నిర్మిస్తున్నారు. వైఎస్సార్సీపీ సర్కార్​లో 2022లో రూ.5.5 కోట్ల జాతీయ థర్మల్‌ విద్యుత్ సంస్థ (ఎన్‌టీపీసీ) నిధులతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. తొలత వేగంగా సాగిన పనులు ఆ తర్వాత పలు కారణాలతో మందగించాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో మళ్లీ వేగం పుంజుకుంది. ఇప్పటికే కాఫీ హౌస్‌, 10 ఉడెన్‌ కాటేజ్‌లు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌, గ్రావిటీ తాగునీటి పథకం, ముఖద్వారం, అంతర్గత రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్టారెంట్‌కు సంబంధించిన పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.

ఎకో పార్కులో ఎన్నెన్నో వింతలు విశేషాలు : ఎకో టూరిజం పార్కు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ప్రకృతి అద్భుతాలను కళ్లకు కట్టేలా ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటోంది.

  • పచ్చని కాటేజ్‌లు : పర్యాటకులు బస చేయడానికి వీలుగా సకల వసతులతో 10 ప్రత్యేక ఉడెన్‌ కాటేజ్‌లు.
  • రంగురంగుల సీతాకోకచిలుకల లోకం : ఇక్కడ ప్రత్యేకంగా "ఓపెన్ బటర్‌ఫ్లై గార్డెన్"ను ఏర్పాటు చేస్తున్నారు. సీతాకోకచిలుకలను ఆకర్షించేందుకు, వాటికి అవసరమైన మకరందాన్ని అందించే వివిధ రకాల పుష్పజాతుల మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు.
  • స్కై వ్యూ వాచ్​టవర్ : చుట్టూ దట్టంగా అల్లుకున్న అడవి, పచ్చని కొండల అందాలను పర్యాటకులు తిలకించేందుకు వీలుగా ఎత్తైన వాచ్‌ టవర్​ను నిర్మిస్తున్నారు.
  • ఆర్కిడెరియం & ఔషధ వనం : అరుదైన, అందమైన ఆర్కిడ్ మొక్కల కోసం 'ఆర్కిడెరియం', అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే రకరకాల ఔషధ మొక్కల వనాన్ని ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు.
  • జీవవైవిధ్య స్టడీ సెంటర్‌ : తూర్పుకనుమల్లోని విభిన్న అటవీ సంపద, జంతుజాలం, జీవవైవిధ్యం గురించి సందర్శకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • గిరిజన సేంద్రియ ఉత్పత్తుల విక్రయం : అడవిలో లభించే స్వచ్ఛమైన తేనె, పసుపు, కాఫీ పొడి వంటి సేంద్రియ అటవీ ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నారు.

త్వరలోనే ప్రారంభిస్తాం : పార్కుకు సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని పాడేరు డీఎఫ్​ఏ, ఉమామహేశ్వరి తెలిపారు. ప్రస్తుతం రెస్టారెంట్‌ పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. మరో నెల రోజుల్లోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. అటవీశాఖకు ఇదొక అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని ఉమామహేశ్వరి వెల్లడించారు.

ఎకో టూరిజం హబ్‌గా 'సదాశివకోన' - పర్యాటక రంగానికి ఇక మహర్దశ

నిరుపయోగంగా ఎకో టూరిజం ప్రాజెక్టు - అరకు పర్యాటకంలో నిర్వహణ లోపాలు