'ఫ్రెండ్ వల్లే అలవాటయ్యింది' - ఈగల్ అధ్యయనంలో వెలుగుచూస్తున్న షాకింగ్ విషయాలు
స్నేహితుల ఒత్తిడి వల్ల తొలుత మత్తు పదార్థాల రుచి - రెండున్నరేళ్లలో 800 మంది వినియోగదారుల గుర్తింపు - వారిలో 100 మందికి పైగా అమ్మాయిలే - ఈగల్ అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడి

Published : August 31, 2026 at 1:24 PM IST
Findings Revealed In The Eagle Team Study : బెంగళూరులోని విలాసవంతమైన బనశంకరిలో నివసించే ఓ బిలియనీర్ కుమార్తె బీబీఎం చదువుతోంది. కళాశాల రోజుల్లో తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. అప్పటికే మత్తుపదార్థాలకు బానిసైన సదరు విద్యార్థి ఆ అలవాటును ఆమెకూ పరిచయం చేశాడు. దీంతో కొద్ది కాలంలోనే ఆమె కూడా మత్తు వ్యసనానికి బానిసగా మారింది. మాదకద్రవ్యాలు కొనడానికి తమ ఇంట్లో డబ్బు దొంగిలించడం ప్రారంభించింది. అదీ వీలుకాక గత్యంతరం లేక తన ప్రియుడు అందించిన మత్తుపదార్థాలను వినియోగదారులకు సరఫరా చేయడానికి అంగీకరించింది.
ఈ క్రమంలో ఆమె ఓసారి పోలీసులకు చిక్కింది. ఈ విషయం తెలిసి సదరు యువతి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో ఒక కేస్ స్టడీగా మారింది.
హాస్టళ్లలోనూ డ్రగ్స్ వినియోగం : ప్రస్తుతం రాష్ట్రంలో ఈగల్ టీమ్ యువతను, వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంపై అధికంగా దృష్టి సారిస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో దాదాపు 800 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని ఈగల్ తన అధ్యయనంలో వెల్లడించింది. వీరిలో 100 మందికి పైగా అమ్మాయిలే ఉండటం గమనార్హం. వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, వ్యసన విముక్తి కేంద్రాల(డీ అడిక్షన్ సెంటర్)కు పంపించింది. పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు హాస్టళ్లు కూడా మాదకద్రవ్యాల వినియోగ కేంద్రాలుగా మారుతున్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామాల్లోనూ గణనీయ వాడకం : ఇటీవల ఓ పేరొందిన విశ్వవిద్యాలయంలో జరిపిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. మరో యూనివర్సిటీలో నలుగురిని మత్తుపదార్థాలు అమ్మేవారి(డ్రగ్ పెడ్లర్)గా గుర్తించి అరెస్టు చేయగా ఇంకో 50 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు కనుగొన్నారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో డజన్ల కొద్దీ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నట్లు తరచుగా బహిర్గతమవుతుండటం గమనార్హం. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో కూడా గణనీయంగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని దర్యాప్తు బృందాలు సూచిస్తున్నాయి.
మిత్రుల నుంచే అలవాటు : ఇటీవల ఓ దర్యాప్తు బృందం సుమారు 500 మంది విద్యార్థులను మాదకద్రవ్యాలకు ఎలా అలవాటుపడ్డారని ప్రశ్నించగా 'స్నేహితుడు నుంచే' అని సమాధానమిచ్చారు. పుట్టినరోజు వేడుకలు దీనికి తొలి వేదికలవుతున్నాయి. బర్త్‌డేల ముసుగులో పబ్‌లు, పార్టీలు, ఫామ్‌హౌస్‌ల్లో జరుపుకునే వేడుకలు ఇటీవల షరామామూలైంది. ఈ కార్యక్రమాలకు ఎవరో ఒకరు మత్తుపదార్థాలు తీసుకురావడం, తోటివారి ప్రోద్భలంతో ఒకరి తర్వాత మరొకరు వాటిని రుచి చూడటం సాధారణమైపోయింది. ఇంటికి దూరంగా హాస్టళ్లలో నివసించడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వంటివి ఈ అలవాట్లు పెరగడానికి దోహదపడతున్నాయి.
డ్రగ్ రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వెల్లడి : ఈగల్ బృందం ఓ వైపు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు మత్తుపదార్థాలు ఎక్కువగా వాడే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విద్యాసంస్థల ప్రాంగణాలలో డ్రగ్ రాపిడ్ టెస్ట్ కిట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్షణ ఫలితాలను అందిస్తున్నాయి. ఈ కిట్‌లు మల్టీ-స్ట్రిప్ యూరిన్ స్క్రీనింగ్ సాధనాలుగా పనిచేస్తాయి. ఇవి అనుమానితుల మూత్ర నమూనాలను విశ్లేషించి యాంఫెటమైన్‌లు, ఓపియాయిడ్‌లు, గంజాయి, బెంజోడియాజెపైన్‌లు వంటి 12 రకాల మాదకద్రవ్యాల్లో ఏవైనా ఉన్నాయో లేదో గుర్తించి 15 నిమిషాల్లోపు ఫలితాలను అందిస్తాయి.
పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు సంబంధించి కోర్టు విచారణలో సాక్షాధారాల నిమిత్తం వారి రక్త నమూనాలను పరీక్షించడం కోసం ఆసుపత్రికి తీసుకెళతారు. అనంతరం విద్యార్థులకు నోటీసులు జారీ చేస్తారు. డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొంది కోలుకున్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే వారి పేరు కేసు నుంచి తొలగిస్తారు.
బీటెక్, ఎంబీఏ విద్యార్థుల డ్రగ్స్ దందా - కరీంనగర్లో 9 మంది అరెస్ట్
పెరుగుతున్న డ్రగ్స్ కేసులే అతి పెద్ద సవాల్ : డీజీపీ సీవీ ఆనంద్

