ETV Bharat / state

తెలంగాణ వ్యాప్తంగా 305 చోట్ల ఈ-సిగరెట్ల అమ్మకాలు - గుట్టు రట్టు చేసిన ఈగల్​ టీమ్​

రెండు నెలలపాటు నిఘా అనంతరం వెలుగులోకి వచ్చిన ఈ-సిగరెట్ల బాగోతం - రాష్ట్రవ్యాప్తంగా 305 చోట్ల విక్రయిస్తున్నట్లు వెల్లడించిన ఈగల్ - వ్యాపెక్స్‌ కంపెనీ పేరుతో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

Eagle Team on E Cigarette Case
Eagle Team on E Cigarette Case (Getty Image)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 8:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Eagle Team on E Cigarette Case : రాష్ట్రంలో ఈ-సిగరెట్‌ విక్రయాల ముఠాకు సంబంధించిన విషయాలను ఈగల్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక పాఠశాల శౌచాలయంలో విద్యార్థులు ఈ-సిగరెట్లు వాడిన ఉదంతం ఆధారంగా చేసుకుని తెలంగాణ ఈగల్‌ కూపీలాగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 305 చోట్ల ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీనితో పాటు పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సిగరెట్లు విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో పలు జిల్లాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు రెండు నెలలపాటు నిఘా పెడుతూ సాంకేతికతను వినియోగించుకుని, ఇతర ఆధారాలతో ఈ-సిగరెట్లు విక్రయించే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వ్యాపెక్స్‌ కంపెనీ పేరుతో ఈ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అవి ఎక్కడెక్కిడికి చేరుతున్నాయి అనే వివరాలు సేకరించినట్లు ఈగల్‌ అధికారులు ఓ ప్రకటన విడదల చేశారు.

నిందితుల అరెస్టు : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో మూడు పాన్‌ డబ్బాల్లో మైనర్లకు సిగరెట్లు, గుట్కా విక్రయిస్తున్న అధికారులు గుర్తించారు. ఈ అక్రమానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో ఈ పాన్‌ షాపులు ఉన్నాయి. 8 మంది మైనర్లకు సిగరెట్టు, గుట్కా విక్రయించినందుకు ఏకే పాన్‌షాప్‌ యజమాని అబేద్‌ మొహిద్దీన్‌ ఖాన్‌, జకీర్‌ పాన్‌షాప్‌ యజమాని మహ్మద్‌ అబ్దుల్‌ ఖయ్యుం, మతిన్‌ షాన్‌షాప్‌ సయ్యద్‌ ఫహీముద్దీన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ-సిగరెట్​ విక్రయాలు : హైదరాబాద్‌ 205, రంగారెడ్డి 54, మెదక్‌ 13, ఖమ్మం 6, మహబూబ్‌నగర్‌ 6, కరీంనగర్‌ 5, నిజామాబాద్‌ 4, ఆదిలాబాద్‌ జగిత్యాల 2, కామారెడ్డి 2, నల్గొండ 2, మేడ్చల్‌ 2, సూర్యాపేట 1, వనపర్తి 1 ఈ జిల్లాల్లో ఈ-సిగరెట్లు విక్రయాలు జరుపుతున్నారని ఆధారాలను అధికారులు సేకరించారు.

యువతకు అవగాహన అవసరం : గంజాయి, ఈ - సిగరెట్ల వినియోగంపై పూర్తి నిషేధం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పాన్​ షాపులు, టీ షాపులలో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. మత్తు అనర్థాలపై యువతకు అవగాహన కల్పిస్తామని అధికారులు అంటున్నారు.

ఒకరికి మరొకరికి ఈ-వ్యసనం : భారత్​లో ఎలక్ట్రానిక్​ మత్తు ఉత్పత్తులపై 2019 నుంచి నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ తెలంగాణలోని పలు నగరాల్లో, పట్టణాల్లో ఇవి లభిస్తున్నాయి. కొందరు యువత గోవా, ముంబయి, హైదరాబాద్​ తదితర ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లోని కొన్ని పాన్​ షాప్​ల నిర్వాహకులు సరుకు తెప్పించుకుని గుట్టుగా అధిక ధరలతో విక్రయిస్తున్నట్లు తెలిసింది. స్నేహితుల్లో ఒకరి నుంచి మరొకరికి 'ఈ-వ్యసనం' అంటుతోంది.

వాసన రాకపోవడంతో : ఈ-ఉత్పత్తులు వాడే వారి నుంచి పొగాకు సిగరెట్ల మాదిరిగా పొగ వాసన అనేది ఉండదు. దీని వల్ల పిల్లల్లో ఈ అలవాట్లు ఉన్నట్లు తల్లిదండ్రులు సైతం గుర్తించలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా సుమారు వేల మంది గల్ఫ్​, తదితర దేశాలకు వలస వెళ్తున్నారు. వారిలో కొందరు దుబాయ్​ తదితర ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చే సందర్భంలో నిషేధిత ఉత్పత్తులను తెచ్చుకుని వాటిని వినియోగిస్తున్నారని తెలిసింది. ఇంట్లోని కుటుంబ సభ్యులే ఇలాంటి వారికి కౌన్సిలింగ్​ చేయాలని అధికారులు అంటున్నారు. నిషేధించిన ఈ సిగరెట్లను విక్రయించే వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాద్యత ప్రజలదే అని విజ్ఞప్తి చేస్తున్నారు.

'ఈ-వ్యసనం' ప్రాణాంతకం - ఎవరూ గుర్తించలేరని మత్తుకు బానిసలవుతున్న యువత

పొగతాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?