ETV Bharat / state

ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ - 23న ఉప ఉత్పత్తుల వేలం

ఎర్రచందనం ఉప ఉత్పత్తులకు భారీ డిమాండ్​ - వాయిద్య పరికరాలు, విలువైన ఫర్నిచర్, అలంకార వస్తువులు, మందుల తయారీ - జిల్లా ఫారెస్ట్‌ అధికారి కార్యాలయంలో ఈ నెల 23న వేలం

E AUCTION FOR BYPRODUCTS RED SANDAL
E AUCTION FOR BYPRODUCTS RED SANDAL (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 3:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

E-auction For By-Products Of Redsandal : విశేషమైన అటవీ సంపదకు కనిగిరి శేషాచలం అడవులు ఒక నిలయం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన అటవీ వృక్షాల్లో ఎర్రచందనం ఈ అడవులలో పుష్కలంగా లభిస్తుంది. స్మగ్లర్లకు ఈ ఎర్రచందనం దుంగలు రూ.కోట్లు కురిపిస్తాయి. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. వీటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లర్లు కొన్నేళ్లుగా తరలిస్తూనే ఉన్నారు. చెట్టులోని ఏ ఒక్క భాగం కూడా వృథా కాదు.

వేరు నుంచి మొదలుకొని చెట్టు బెరడు వరకు మొత్తం కాసులు కురిపిస్తోంది. వీటిని ఉపయోగించి వాయిద్య పరికరాలు, విలువైన ఫర్నిచర్, అలంకార వస్తువులు, మందులను తయారు చేస్తారు. అందుకే స్మగ్లర్లు ఈ చెట్టు వేర్లతో సహా పెకిలించి అక్రమంగా రవాణా చేస్తుంటారు. అలా తరలించే ప్రయత్నంలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలతోపాటు ఉప ఉత్పత్తులుగా పిలిచే చిప్స్, వేర్లు, చెట్ల నుంచి వేరుచేసిన చిన్నచిన్న కర్రలు, కొమ్మలను సైతం స్వాధీనం చేసుకొని గోదాముల్లో భద్రపరిచారు. ఏటా గోదాముల్లోని ఎర్రచందనం దుంగలకు డ్రెస్సింగ్‌ చేసేందుకు తొలగించిన పేళ్ల (చిప్స్‌)ను కూడా నిల్వ చేశారు.

స్థానికంగానే విక్రయం : ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా విక్రయించేందుకు గ్లోబల్‌ టెండర్లను పిలుస్తుంటారు. గత ఐదేళ్లుగా ఈ ఎర్రచందనానికి ఆశించిన మేర స్పందన లేదు. స్థానిక మార్కెట్లలోనే ఉప ఉత్పత్తులను టెండర్ల ద్వారా విక్రయిస్తుంటారు. వీటికి మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. ఫార్మా కంపెనీలు, కళాకారులకు అందుబాటులో ఉండేలా ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఉత్పత్తులతో ఆటబొమ్మలు, గృహోపకరణాలు, కొన్ని మందులు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తుంటారు.

ఉప ఉత్పత్తులకు ఈ-వేలం : 2025 అక్టోబరులో ఎర్రచందనం ఉప ఉత్పత్తులకు ఈ-వేలం నిర్వహించారు. 35 లాట్లుగా సంబంధించిన 143.8 టన్నుల వేర్లు, చిప్స్‌ను ఫార్మా కంపెనీల ప్రతినిధులు, కళాకారులు కొనుగోలు చేశారు. దీంతో అటవీశాఖకు రూ.6.71 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి 3,19,985.93 కిలోల ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 27 లాట్లుగా విభజించిన 8,865 బ్యాగుల చిప్స్, 17 బ్యాగులుగా విభజించిన ఒక లాట్ చిన్నకర్రలు, ఒక లాట్​గా సమీకరించిన 162 బ్యాగుల వేర్లు, 35 బ్యాగుల పలకలు, 913 బ్యాగుల బిల్లెట్స్​ (చతరుస్రాకారంలో ఉండే ఎర్రచందనం ముక్కలు), 228 బ్యాగుల్లో భద్రపరిచిన ఎర్రచందనం బండిల్స్‌ ఉన్నాయి. కపిలతీర్థంలో ఉన్న జిల్లా ఫారెస్ట్‌ అధికారి కార్యాలయంలో ఈ నెల 23న వేలం జరగనుంది.

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హెచ్చరిక : అయితే గతంలో ఎర్రచందనాన్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్న వారు దాన్ని ఆపి స్వచ్ఛందంగా లొంగిపోవాలనీ, లేకపోతే ప్రత్యేక ఆపరేషన్‌ చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించామన్న పవన్‌కల్యాణ్, టాస్క్‌ఫోర్స్‌ ద్వారా వారిని పట్టుకుంటామని చెప్పారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఇష్టారీతిన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్న పవన్‌, దాన్ని అడ్డుకునేందుకు అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎర్రచందనం గిడ్డంగులను పవన్ సందర్శించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గోదాముల్లోని ఎర్రచందనాన్ని ఆయన పరిశీలించారు. అంతేకాకుండా వాటి రికార్డులను కూడా పరిశీలించారు.

అర్ధరాత్రితో మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం - సర్వదర్శనానికి 15 గంటల సమయం

సిమ్​ కార్డులతోనూ సైబర్​ నేరాలు: ఈ యాప్​తో చెక్​ పెట్టొచ్చు