ETV Bharat / state

రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసింది మీరు కాదా? - కేసీఆర్​, హరీశ్​రావులకు భట్టి కౌంటర్ ఎటాక్

బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయన్న భట్టి విక్రమార్క - చేసిన అప్పులను తక్కువ చేసి చూపించేందుకు కేటీఆర్‌, హరీశ్‌ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య - బీఆర్ఎస్​పై తీవ్ర విమర్శలు

DY CM Bhatti Vikramarka Fires on KTR Harish Rao
DY CM Bhatti Vikramarka Fires on KTR Harish Rao (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 3, 2026 at 5:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

DY CM Bhatti Vikramarka Fires on KTR Harish Rao : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ప్రజా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని చెప్తూనే గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్‌గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్​ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు : వివిధ మార్గాల ద్వారా బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని భట్టి విక్రమార్క అన్నారు. బుకాయింపులు, అసస్యలతో ఎన్నాళ్లు మోసం చేస్తారని మండిపడ్డారు. ఈ అప్పులపై నిత్యం మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందని వెనక్కి తగ్గామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక, వడ్డీతో కలిపి రూ.2.08 లక్షల కోట్లను చెల్లించామన్నారు. 10 వడ్డీకి కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చారన్నారు. వడ్డీల భారాన్ని తగ్గించేందుకు తాము అనేక చర్యలు చేపట్టినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కట్టాల్సిన వడ్డీని రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించామన్నారు. రోడ్డుపై నిలబడి అడ్డగోలుగా రోజూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిపై బీఆర్ఎస్​ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. సింగరేణి కోల్‌ బ్లాక్‌లను పెంచేందుకు చిన్న ప్రయత్నమైనా చేశారా అని భట్టి ప్రశ్నించారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు : బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను కేటీఆర్, హరీశ్​రావులు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. హరీశ్​రావు మంత్రిగా చేశాననే విషయం మర్చిపోయి అనేక విషయాలపై అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చెప్పే అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్నారు. నిశ్శబ్ధంగా ఉంటే వ్యవస్థలకు నష్టం చేసిన వాళ్లమవుతామన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అబద్ధాల పునాదులపై పదేళ్లపాటు పాలన చేశారన్నారు. ఆ పార్టీ నేతలు కావాలని పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆ పార్టీ వారు అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లు బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన అప్పులపై కేసీఆర్ మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. అప్పులు చేసి రాష్ట్రంపై పెనుభారం వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

"హాస్టల్‌ పిల్లలకు క్వాలిటీ వస్తువులు ఇవ్వాలనే టెండర్లు పిలిచాం. రూ.1,142 కోట్లకు టెండర్లు పిలిస్తే రూ.2 వేల కోట్ల అవినీతి అంటున్నారు. మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా. పదేళ్లపాటు దోపిడీ చేసింది ఎవరు కేసీఆర్‌ కాదా? రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేసీఆరే బయటకు వచ్చి మాట్లాడాలి. బాధ్యతగా పనిచేస్తున్న మంత్రులపై అభాండాలు సరికాదు. ఎవరి స్థాయి ఏమిటో వారు పోషించే పాత్రతో తెలుస్తుంది. మీరు చేసిన అప్పులు తీర్చేది కాళేశ్వరం కార్పొరేషనా, ప్రభుత్వమా. కీలక విషయాలపై కేసీఆర్ మాట్లాడాలి.. కేటీఆర్‌, హరీశ్‌రావు కాదు. మీరు చేసిన అప్పులు రాష్ట్రానికి పెనుభారంగా మారాయి"- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

సింగరేణి బొగ్గు ఆరోపణలపై విచారణకు ఆదేశం : సింగరేణికి నష్టం కలిగించాలని బీఆర్ఎస్​ పార్టీ నాయకులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కోల్​బ్లాక్​లు తెచ్చుకునేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నామన్న ఆయన సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. సింగరేణిపై కావాలనే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణికి కొత్త బ్లాక్​లు రాకుండా అడ్డుకున్నది కేటీఆర్, హరీశ్​రావులేనని భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణిలో బొగ్గుమాయమైందని కేటీఆర్, హరీశ్​రావులు చేసిన ఆరోపణలపై స్పందించిన భట్టి విక్రమార్క వాటిపై విచారించాలని ఆ సంస్థ విజిలెన్స్​ డైరెక్టర్​ను ఆదేశించారు. సింగరేణికి నష్టం కలిగిస్తే నష్టపోతేది రాష్ట్రప్రజలేనని ఆయన తెలిపారు.

తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయి : భట్టి విక్రమార్క