ETV Bharat / state

అమ్మవారి భక్తుల మంచినీళ్ల కోసం రూ.3.31 కోట్లు - ఆడిట్​ విభాగం అభ్యంతరం

మంచినీటిని ప్యాకెట్లు, బాటిళ్ల రూపంలో పంపిణీ చేసినందుకు రూ.3.31 కోట్లు - దుర్గగుడికి బిల్లులు పంపించిన విజయవాడ నగరపాలక సంస్థ - దీనిపై ఆడిట్​ విభాగం అభ్యంతరం

Durga Temple Bills On Water Supply
అధిక బిల్లులు చూపిస్తున్న గుడి సిబ్బంది (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 31, 2026 at 6:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Durga Temple Bills On Water Supply : దుర్గగుడిలో గత ఏడాది జరిగిన దసరా, భవానీ దీక్షల విరమణ వేడుకలకు తరలివచ్చిన భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, బాటిళ్ల రూపంలో పంపిణీ చేసినందుకు రూ.3.31 కోట్లు అయ్యిందంటూ విజయవాడ నగరపాలక సంస్థ నుంచి దుర్గగుడికి బిల్లులు పంపించారు. ఈ రెండు వేడుకలకు కలిపి గత ఏడాది తాము రూ.10 కోట్టు ఖర్చు పెట్టామని వెంటనే ఇవ్వాలంటూ నగరపాలక అధికారులు చెప్పారు. ఐతే మంచినీటికి రూ.3.31 కోట్లు ఏంటంటూ ఆడిట్‌ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని ఫలితంగా, మిగిలిన రూ.6 కోట్లు చెల్లించినప్పటికీ, ఈ నిర్దిష్ట నీటి బిల్లుకు సంబంధించిన చెల్లింపును దేవస్థానం నిలిపివేయడంతో రెండు విభాగాల మధ్య వివాదం తలెత్తింది.

భారీ బిల్లుల చూపిస్తున్న సిబ్బంది: దసరా వేడుకలను దుర్గగుడిలో నిర్వహించేందుకు ఏటా రూ.15 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తారు. క్యూలైన్లు, కౌంటర్లు, షామియానాలు, కేశఖండన శాల, పోలీసులు, ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ పనులు అన్నింటికీ కలిపి ఈ రూ.15 కోట్లను వినియోగిస్తారు. కానీ నగరపాలక సంస్థ మాత్రం వేడుకల నిర్వహణకు దేవస్థానం ఎంత వెచ్చిస్తోందో దానితో సమానంగా తామూ ఖర్చు పెట్టామని అంటోంది. దసరా విధులకు ఇతర శాఖల నుంచి వచ్చే సిబ్బందికి సంబంధించిన ప్రయాణ భత్యం, కరువు భత్యం బిల్లులను మాత్రమే దేవస్థానం చెల్లిస్తుంది.

ఈ సందర్భాలలో విధులకు హాజరయ్యే వేలాది మంది పోలీసు సిబ్బంది కోసం, ప్రతి పండుగకూ ఒక కోటి రూపాయల మొత్తాన్ని కేటాయిస్తారు. కానీ నగరపాలక సంస్థ మాత్రం భక్తుల కోసం తాము విజయవాడలో ఎక్కడెక్కడో ఏవేవో ఏర్పాట్లు చేశాం, మజ్జిగ పంచాం, బిస్కెట్లు ఇచ్చామంటూ భారీగా బిల్లులు పెడుతోంది. ఈ వ్యయం అసలు దేవాదాయ శాఖ పరిధిలోనే ఉండడం లేదు. వేడుక అంతా అయ్యాక మా నుంచి ఎంత బిల్లు వస్తే అంత మీరు చెల్లించాలన్నట్టుగా నగరపాలక అధికారుల తీరు ఉంటోంది.

అమ్మవారి ఆదాయం వృథా: దసరా ఉత్సవాలు పది రోజుల పాటు, భవానీ దీక్ష ముగింపు కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అదనంగా మరో ఐదు రోజులను పరిగణనలోకి తీసుకున్నా, మొత్తం వ్యవధి ఇరవై రోజులే అవుతుంది. ఈ కాలానికి రూ.10 కోట్ల బిల్లు అంటే రోజుకు రూ.50 లక్షల ఖర్చు అని అర్థం. ఇది అక్షరాలా నీళ్లలా డబ్బును వృథా చేయడమే.

భక్తులు అమ్మవారికి సమర్పించిన నిధులను సరైన లెక్కలు లేదా పర్యవేక్షణ లేకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఖర్చు చేస్తారు? నగరవ్యాప్తంగా మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీకి సంబంధించిన ప్రాంతాలను నిర్దేశిస్తే, ఆలయ యంత్రాంగమే స్వయంగా ఆ ఏర్పాట్లు చేయగలదు కదా. అలాంటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించి, భారీ మొత్తంలో బిల్లులు సమర్పించి, అమ్మవారి ఆదాయాన్ని ఎందుకు వృథా చేస్తోంది? ఈ ఏడాది అధికారులు ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

దుర్గ గుడిలో చీరల కుంభకోణం - మళ్లీ పాత కథే

వారం రోజులుగా రాని మంచినీళ్లు - ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన