తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామన్న సీఎం చంద్రబాబు - పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఓడరేవు నిర్మిద్దామని వెల్లడి, పోర్టు ఏర్పాటుకు నరసాపురం వద్ద అనువుగా ఉంటుందేమో చూడాలని సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 9:22 AM IST
Dugarajapatnam Port in Tirupati District: తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా వస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓడరేవు ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని ఆదేశించారు. పోర్టు ఏర్పాటుకు నరసాపురం వద్ద అనువుగా ఉంటుందేమో చూడాలని సూచించారు.
అనువైన ప్రదేశం చూడాలని సీఎం సూచన: అక్కడ ఓడరేవు నిర్మాణానికి తగినంత భూములు లేవని రోడ్లు, భవనాలు, రవాణా, ఐఅండ్‌ఐ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కాకపోతే పోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో చూడాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సూచించారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నందున పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి, ఎయిర్ కనెక్టివిటీ పెంపొందిస్తే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, పన్నుల రూపంలో ఆదాయం వస్తుందనీ, అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందన్న సీఎం: నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉందనీ, తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు వస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాటితో పాటు దొనకొండ, నాగార్జునసాగర్, బొబ్బిలిల్లోని ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేద్దామని చెప్పారు.
ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణం గురించి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రస్తావించగా తదుపరి దశలో చేపడదామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా గంట ప్రయాణంలో చేరుకోగలిగేలా కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు. 2025లో చాలా బాగా పనిచేశామనీ, ఎన్నికల హామీలన్నీ నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. రూ.50 వేల కోట్లకు పైగా పింఛన్లు అందజేశామన్నారు. యోగాంధ్ర, విశాఖలో భాగస్వామ్య సదస్సు వంటివి విజయవంతంగా నిర్వహించామని చంద్రబాబు తెలియజేశారు.
మంత్రులు బాగా పనిచేశారు:సీఎం ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామనీ, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అతి పెద్ద విజయమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్నామనీ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిన పెట్టామని, విశాఖ రైల్వే జోన్ ఆచరణలోకి వస్తోందని చెప్పారు. 2026 కూడా ఆశాజనకంగా ఉంటుందనీ, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. 2025లో మంత్రులు బాగా పని చేశారని ఆయన కితాబిచ్చారు. వచ్చే సంవత్సరం మరింత చురుగ్గా పని చేయాలనీ, ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మహాత్ముల పేర్లు మనం వారికిచ్చే గౌరవం: అన్నమయ్య స్వగ్రామం రాజంపేట నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇప్పుడా నియోజకవర్గం కడప జిల్లాలో కలుస్తున్నా, మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అన్నమయ్య పేరునే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. మహాత్ముల్ని గౌరవించేందుకు జిల్లాలకు వారి పేర్లు పెడుతున్నామనీ, వారు జన్మించిన ఊరు అదే జిల్లాలో ఉండాలన్న నిబంధనేదీ లేదని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ జన్మస్థలం కృష్ణా జిల్లాలో ఉండగా, దానికి బదులు కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని గుర్తు చేశారు. పోలవరం గ్రామం లేకుండా కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు పోలవరం పేరు పెట్టడంపై చర్చ జరుగుతోందని మంత్రి దుర్గేశ్ ప్రస్తావించారు.
పోలవరం ఊరు ఆ జిల్లాలో లేకపోయినా ప్రాజెక్టు ముంపు గ్రామాలన్నీ కొత్త జిల్లా పరిధిలోకే వస్తున్నాయనీ, ప్రాజెక్టు అక్కడే ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడమే సముచితమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కర్నూలు జిల్లాలోని ఆదోనిని మూడు మండలాలు చేయాలన్న చర్చ జరిగింది. కానీ చివరకు రెండు మండలాలతోనే సరిపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాల్ని కూడా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తేవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు.
కేబినెట్ మీటింగ్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కంటతడి - ఓదార్చిన సీఎం చంద్రబాబు

