అడుగంటిన నీటిమట్టాలు - తెలంగాణకు పొంచి ఉన్న తాగు, సాగు నీటి గండం!
జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలు - రాష్ట్రానికి పొంచి ఉన్న జలగండం - బిరబిరా పరుగులు తీయని కృష్ణమ్మ, గలగలా పారని గోదావరి - శ్రీశైలం, సాగర్‌లో కనిష్ఠ నీటిమట్టాలు

Published : July 9, 2026 at 7:35 AM IST
|Updated : July 9, 2026 at 8:49 AM IST
Water Levels in Reservoirs have Dropped Drastically : రాష్ట్రానికి జలగండం పొంచి ఉంది. చినుకు జాడ లేక కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీయకపోగా, గోదావరి కూడా గలగలా పారడం లేదు. రాష్ట్రంతో పాటు ఎగువన కూడా తగిన వర్షాలు లేని పరిస్థితుల్లో వరద రాక జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి. కృష్ణాపై ఉన్న ఆల్మట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే దిగువకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అటు గోదావరి ఉపనది ప్రాణహితలో 80 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది.
ప్రాజెక్టుల్లో అడుగంటిన నీటి మట్టాలు : ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఫలితంగా నదుల్లోకి కూడా ప్రవాహం రావడం లేదు. కృష్ణా, గోదావరి రెండు నదులకూ ఈ ఏడాది ఇంకా వరద రాలేదు. దీంతో జలాశయాల్లో నీరు చేరలేదు. గత సీజన్‌లో వచ్చిన నీటినే తాగునీటి అవసరాల కోసం జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జూన్ ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరం ప్రారంభమైనా, కృష్ణాపై ఉన్న ప్రధాన జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి నీరు రాలేదు. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 42 టీఎంసీలు మాత్రమే ఉంది. నిరుడు ఇదే సమయంలో శ్రీశైలంలో 199 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి ఎలాంటి ప్రవాహం లేదు.
నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యమైన 312 టీఎంసీలకు గానూ 138 టీఎంసీల నీరు ఉంది. నిరుడు ఇదే సమయంలో 171 టీఎంసీల నీరు సాగర్‌లో ఉంది. రాష్ట్రానికి ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ప్రవాహాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్మట్టిలోకి లక్షా 26 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 34 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. అక్కడ వంద టీఎంసీలకు చేరితే గానీ దిగువకు నీరు వదిలే పరిస్థితి లేదు. తుంగభద్రలో 105 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 11 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. తుంగభద్రలోకి 17 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.
వెలవెలబోతోన్న గోదావరి : గోదావరి విషయానికి వస్తే ప్రధాన జలాశయమైన శ్రీరాంసాగర్‌లో పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 18 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గానూ 8 టీఎంసీలు మాత్రమే ఉంది. సింగూరు, నిజాంసాగర్‌లో కూడా నిల్వలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలోని జైక్వాడీ నుంచి ప్రవాహాలు లేవు. జైక్వాడీ పూర్తి సామర్థ్యం 102 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 48 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. నిరుడు ఇదే సమయంలో అక్కడ 74 టీఎంసీలకు పైగా నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో దాదాపు 3 వేల క్యూసెక్కుల వరకు ఉంది.
గోదావరి ఉపనది అయిన ప్రాణహితలో మాత్రం ప్రవాహాలు బాగానే ఉన్నాయి. దాంతో గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట వద్ద 82 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది. పియర్స్ కుంగి మొత్తం గేట్లు ఎత్తివేయడంతో మొత్తం నీరు అక్కడి నుంచి దిగువకు వెళ్తోంది. దిగువన సమ్మక్క వద్ద 96 వేల క్యూసెక్కులు, సీతారామ సాగర్ వద్ద లక్ష క్యూసెక్కులకుగా పైగా ప్రవాహం ఉంది.

