శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో రాత్రి కలకలం - గోపురం ఎక్కి వ్యక్తి హల్చల్
ఏకాంతసేవ ముగిశాక మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి - విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశం - నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 1:15 PM IST
|Updated : January 3, 2026 at 1:35 PM IST
Security Lapse at Sri Govindaraja Swamy Temple in Tirupati: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో రాత్రి కలకలం రేగింది. స్వామివారికి ఏకాంత సేవ ముగిసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే ఆలయ గోడ దూకి లోపలికి చేరుకున్నాడు. మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 3 గంటల పాటు అతడిని కిందకు దింపేందుకు తీవ్రంగా శ్రమించారు.
గోపురానికి నిచ్చెనలు ఏర్పాటు చేసి కిందకు దించారు. అనంతరం అదుపులోకి తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఆలయం గోపురం పైకి ఎక్కిన వ్యక్తి తెలంగాణ నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు పెద్దమల్లారెడ్డి చెందిన కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.
నిత్యం సందడిగా కోవెల: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం 1000 సంవత్సరాలకు పైగా నిత్యం పూజలు అందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమల వెళ్లే యాత్రికులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయం ఆనాదిగా వస్తోంది. నిత్యం వేలాదిమంది యాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి కోవెల ఎప్పుడూ సందడి వాతావరణం నెలకొంటోంది.
స్థల పురాణం: ఆలయ చరిత్ర తిరుపతి నగరం ఏర్పడక ముందే ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళొత్తంగ చోళుని పాలన కాలంలో శ్రీమద్ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఆ కాలంలో కొండ దిగువ ప్రాంతంలో కొత్తూరు అనే కుగ్రామం కూడా ఉండేది. తమిళనాడులోని చిదంబరం నుంచి తెప్పించిన గోవిందరాజస్వామి విగ్రహానికి సంప్రదాయకంగా పూజలు నిర్వహించారు. ఆయన గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ ఆలయమే ఇది.
ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం కూడా ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరి. గోవిందరాజులు వెలసినారు కాబట్టి గోవింద రాజపట్టణం అనీ, రామానుజచార్యుల వారు ప్రతిష్టించారు కనుక రామానుజపురం అనీ అప్పట్లో పిలిచే వారు. కాలక్రమేణ ఇది తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వేంకటేశ్వరస్వామి అని కూడా అర్థం. ఈ ఆలయం ప్రహరీ గోడలపై పలు శాసనాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం వద్ద శిల్పకళ అందర్నీ ఆకర్షిస్తుంది. ఆలయానికి ఉత్తరంగా ఉన్న మ్యూజియంలో అనేక శిల్పకళా రీతులనూ చూడవచ్చు.
ఎలా చేరుకోవచ్చు: తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సౌకర్యం ఉంది. తిరుమలకు వెళ్లే యాత్రికులు తిరుపతిలోని స్వామివారిని దర్శించేందుకు అన్ని సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పించింది. తిరుపతి రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఉంది. అలాగే ప్రధాన బస్ స్టాండ్ నుంచీ ఆలయానికి చేరుకోవచ్చు. రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి వివిధ వాహనాలతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకునే సదుపాయం కూడా ఉంది.
తిరుమల కొండపై గంటలకొద్దీ నిరీక్షణకు చెక్ -‘కమాండ్’తో దర్శనాల్లో వేగం
రికార్డు స్థాయిలో తిరుమల లడ్డూల విక్రయం - నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు హర్షం

