ఒక్క క్లిక్‌తో పొలం దగ్గరకే డ్రోన్ - సమయం, ఖర్చు ఆదా అంటున్న రైతులు
చేతి పంపుతో రెండెకరాల్లో పిచికారీకి అయిదారు గంటలు - డ్రోన్‌తో క్షణాల్లోనే పని - డ్రోన్లు వచ్చాక సమయమూ, ఖర్చూ ఆదా అవుతున్నాయని అన్నదాతల హర్షం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 8:28 PM IST
Drone Service with One Click In Agriculture : సాగులో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. యంత్రాలు, ట్రాక్టర్ల దశ దాటి డ్రోన్ల యుగం నడుస్తోంది. డ్రోన్ సేవలను మరింత సులభతరం చేసేలా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ర్యాపిడో, ఉబర్ తరహాలో ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే డ్రోన్ వచ్చేలా సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ యాప్ ఏంటి? ఎలా పని చేస్తోంది? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కొరత వేధిస్తోంది. సీజన్‌లో కూలీలు దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పురుగుమందులు, విత్తనాలు, ఎరువులు చల్లేందుకు డ్రోన్లనే ఆశ్రయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో గతంలో అక్కడక్కడా మాత్రమే కనిపించే డ్రోన్ల వినియోగం, ఇప్పుడు బాగా విస్తరించింది. ఏ పొలంలో చూసినా డ్రోన్లు ఝుమ్మంటూ ఎగురుతూ సందడి చేస్తున్నాయి.
డ్రోన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ పిచికారీ : పురుగుమందుల పిచికారీతో రైతులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదమే లేదు. డ్రోన్‌కు అమర్చే కెమెరాతో పంటల ఫొటో తీయడం, చీడపీడలు గుర్తించడం సులభమవుతుంది. శిలీంద్రనాశినులు, కలుపు నివారణ మందులు ఎంచక్కా డ్రోన్లతో స్ప్రే చేసేయొచ్చు. అంతేకాదు కూలీలతో చేయిస్తే ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే అదే డ్రోన్‌తో 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో రెండెకరాల్లో పిచికారీకి అయిదారు గంటలు పడితే డ్రోన్‌తో క్షణాల్లోనే పని కానివ్వొచ్చు. డ్రోన్లు వచ్చాక సమయమూ, ఖర్చూ ఆదా అవుతున్నాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు, పురుగు మందుల తయారీ సంస్థలే డ్రోన్లతో మందుల పిచికారీకి ముందుకొస్తున్నాయి. ప్రైవేట్ డ్రోన్ ఆపరేటర్లూ పుట్టుకొస్తున్నారు. ఏ ప్రాంతంలో డ్రోన్ ద్వారా పిచికారీ చేయాలన్నా కంకిపాడుకు చెందిన ప్రైవేట్ డ్రోన్ నిర్వాహకులు అక్కడికి వెళ్లిపోయి పొలాలకు స్ప్రే చేసేస్తున్నారు." - గోపీ రాజా, డ్రోన్ నిర్వాహకుడు
ఆన్‌లైన్‌లో డ్రోన్ల బుకింగ్ : సేద్యంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తున్న డ్రోన్ సేవలను విస్తృతం చేసేందుకు ఇప్పటికే 80 శాతం రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యవసాయ డ్రోన్ సేవలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ర్యాపిడో, ఉబర్ తరహాలో బుక్ చేసుకుంటే పొలం వద్దకే కిసాన్ డ్రోన్లు వచ్చేలా నయా యాప్‌ను రూపొందించింది.
ఇంతకీ ఈ యాప్ ఏంటి : వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగిందని, ఒక నెల రోజుల కింద నుంచి 'ఒబరైజేషన్ ఆఫ్ డ్రోన్' అనే యాప్‌ను రూపొందించారు. ఇది అగ్రికల్చర్‌కు సంబంధించిందని వ్యవసాయ శాఖ అధికారణి ఉషారాణి పేర్కొన్నారు. ఈ యాప్‌లో సర్వీస్ ప్రొవైడర్లు ఉంటాయని, అన్ని మండలాల్లోని డ్రోన్లు సర్వీస్ ప్రొవైడర్లు కనిపిస్తాయని చెప్పారు. ఎలాగైతే ఓలా, రాపిడో మాదిరి రైతులు డ్రోన్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఇందులో రిజిష్టర్ అయ్యి, లాగిన్ చేసుకొంటే చాలు మీ చుట్టుపక్కల ఉండే డ్రోన్లన్నీ కనిపిస్తాయని చెప్పారు. పొద్దున లేక సాయంత్రం ఎప్పుడు స్ప్రే చేయించుకుంటారో చెబితే చాలు, వాళ్లే వచ్చి స్ప్రే చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
తక్కువ పెట్టుబడి-అధిక రాబడి లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంపై కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిచికారీలతో పాటే యూరియా వంటి వాటిని కూడా చల్లేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు.
వ్యవసాయంలో పెరుగుతోన్న డ్రోన్ల వినియోగం - డ్రోన్ మార్ట్ పేరిట ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్ప
డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ - నెలకు రూ.31 వేలు సంపాదిస్తున్న యువత

