ETV Bharat / state

రైతు కూలీల కొరతకు చెక్ పెట్టిన యువకుడు - డ్రోన్ బుకింగ్​తో ఈజీగా పొలంలో పిచికారీ

డ్రోన్ల రంగంలో రాణిస్తున్న యువకుడు- స్థానిక రైతులకు డ్రోన్ సాయం అందిస్తున్న గోపీరాజా - ఆరింటితో మొదలై నేడు 60కి పైగా డ్రోన్లు-డ్రోన్ల తయారీ, మరమ్మతులు, వినియోగంపై శిక్షణ

Kisan Drone Raja in Vijayawada
Kisan Drone Raja in Vijayawada (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 6:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kisan Drone Raja in Vijayawada : ఓలా ఉబర్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నంత ఈజీగా పొలంలో పురుగుమందులు పిచికారీ చేసేందుకు డ్రోన్‌ బుక్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది? రైతులకు ఆ సదుపాయాన్నే అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకుడు. కూలీల కొరత పెరుగుతున్న ఖర్చులు వంటి వాటికి చెక్‌ పెడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్‌ సేవలు విస్తరిస్తున్నాడు కృష్ణాజిల్లాకు చెందిన గోపిరాజా. 6 డ్రోన్లతో మొదలుపెట్టి ప్రస్తుతం 60కి పైగా డ్రోన్లకు చేర్చి 150 మంది ఉద్యోగులతో తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

డ్రోన్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న యువకుడు (ETV)

డ్రోన్​ టెక్నాలజీ పై ఆసక్తి : కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన అంబుల గోపిరాజా గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో EEE చదువుతున్న సమయంలోనే డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నాడు. యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహంతో వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ల తయారీపై దృష్టి సారించాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్‌ను అభివృద్ధి చేయడంతో మొదలైన ప్రయాణం క్రమంగా వివిధరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఆ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు.

B.Tech పూర్తయ్యాక కంకిపాడులో ఫొపిల్ డ్రోన్ టెక్నాలజీస్ పేరుతో స్టార్టప్ సంస్థను ప్రారంభించాడు గోపిరాజా. KL యూనివర్సిటీతో పాటు గ్లోకుల్ టెక్నాలజీస్ ఆర్థిక సహకారం అందించడంతో ఇద్దరు ఉద్యోగులతో సంస్థను ముందుకు తీసుకెళ్లాడు. 3, 4, 5, 10 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్లు తయారు చేసి సామర్థ్యం బట్టి 3 నుంచి 5లక్షల రూపాయల వరకు ధర నిర్ణయించా డు. కొనుగోలు చేయలేని రైతులకు అద్దె ప్రాతిపదికన సేవలు అందిస్తున్నాడు.

ఆరు డ్రోన్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం పోర్త్ యాపిల్ రీసెర్చ్ ల్యాబ్ స్థాయికి చేరుకుంది. సంస్థలో నేడు డ్రోన్ల సంఖ్య 60కి ఉద్యోగుల సంఖ్య 150కు చేరింది. ఆర్-ప్లై డ్యాస్ ఇన్నోవేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న గోపిరాజా, కిసాన్ డ్రోన్ సేవలు మరింత విస్తరించాడు. పెద్దఎత్తున డ్రోన్ల తయారీతో పాటు రైతుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాడు గోపిరాజ.

"డ్రోన్ల పట్ల ఉన్న ఆసక్తితో, వాటిని తయారు చేయడం నేర్చుకున్నాను. ఈ చొరవ ద్వారా, స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు రైతులకు నిరంతరం సేవలు అందిస్తున్నాను. డ్రోన్ల సహాయంతో పంటలపై మందులు పిచికారీ చేయడంలో మేము సహాయపడతాం. తద్వారా శ్రమ, డబ్బు రెండూ ఆదా అవుతాయి. అంతేకాకుండా, మేము శిక్షణ ఇచ్చిన యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాము. ఈ సేవలను కేవలం ఈ జిల్లాకే పరిమితం చేయకుండా, రాష్ట్రమంతటా విస్తరించడమే మా లక్ష్యం." - గోపిరాజా, ఫొపిల్ డ్రోన్ టెక్నాలజీస్ ఫౌండర్‌

కేవలం డ్రోన్ల తయారీతోనే ఆగిపోకుండా అత్యవసర సమయంలో ఓలా, ఉబర్‌లను బుక్ చేసుకున్నట్టే రైతులు తమకు అవసరమైన వ్యవసాయ డ్రోన్ సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీంతో కృష్ణాజిల్లాకు పరిమితమైన సేవలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకూ సైతం విస్తరించాయి.

50 మంది వరకు ఉద్యోగులు అవసరం : డ్రోన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని కూడా ప్రారంభించాడు గోపిరాజా. డ్రోన్ల తయారీ, మరమ్మతులు, వినియోగంపై యువతకు శిక్షణ ఇస్తూ వారికి తన సంస్థలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. ప్రస్తుతం 150 మంది పని చేస్తుండగా మరో 50 మంది వరకు ఉద్యోగులు అవసరమని చెబుతున్నాడు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విలేజ్ బిజినెస్ పార్టనర్, ఫ్రాంచైజీ విధానాలను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు.

రైతులకు సేవలను మరింత వేగంగా అందించేందుకు ప్రత్యేక రైతు కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ డ్రోన్ల సరఫరా, పురుగుమందుల పిచికారీ, డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత, అధిక ఖర్చుకు గోపిరాజా సేవలు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తున్నాయి. విద్యార్థి దశలో మొదలైన డ్రోన్‌పై ఆసక్తిని వ్యాపారంగా, పరిశోధనగా, ఉపాధి కల్పించే వేదికగా మార్చుకున్నాడు అంబుల గోపిరాజా. సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండేలా డ్రోన్ టెక్నాలజీతో కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు ఈ డ్రోన్ రాజా.

డ్రోన్లతో సీడ్ బాల్స్ - అడవుల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వ వినూత్న చర్య

వైద్య సేవల్లో డ్రోన్లు - గిరిజన ప్రాంతాలకు సకాలంలో మందులు, రిపోర్టులు