కనీస ప్రమాణాలు పాటించని డ్రైవింగ్ స్కూల్స్- ఇష్టానుసారంగా నిర్వహణ
నిబంధనలు పాటించని 15 డ్రైవింగ్ స్కూల్స్‌పై చర్యలు - పాత వాహనాలకు మరమ్మతులు చేసి వాటితోనే శిక్షణ - ఆర్టీవో నిర్ణయించిన ప్రకారం శిక్షణ సొమ్ము వసూలు చేయకుండా నచ్చినట్లు వసూళ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 1:57 PM IST
Driving Schools in vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లు నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం, వినియోగదారులతో కొందరి దురుసు ప్రవర్తన, అధిక వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులతో ఎట్టకేలకు అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఉన్నవాటిల్లో సగం మేర విరుద్ధంగా నడుస్తున్నాయని తేల్చారు.
ఇలా కొనసాగుతున్న కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 27 వరకు కేంద్రాలున్నాయి. ఇటీవల అధికారులు జరిపిన తనిఖీల్లో మూడింటిని రద్దు చేశారు. మరో 12 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. వీటిల్లో పూర్తిస్థాయిలో శిక్షణ గదుల్లేవు. ఒకటి, రెండున్నా వాటిలో కార్యాలయాలు నడుపుతున్నారు. అర్హతల్లేని శిక్షకులు కొత్త వారికి శిక్షణ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారే శిక్షణ తీసుకునే వారికి తర్ఫీదు ఇస్తున్నారు. పాత వాహనాలకు మరమ్మతులు చేసి వాటినే శిక్షణకు ఉపయోగిస్తున్నారు.
శిక్షణ ఇచ్చే డ్రైవర్‌కు మెకానికల్ డిప్లొమా అర్హత ఉండాలి. వాహనం నేర్చుకునే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. రేడియేటర్, ఇంజిను, టైర్లు చెక్ చేసుకోవడంపై క్లారిటిగా వివరించాలి. బైక్ అయినా కార్ అయినా మినిమమ్ మెయింటెనెన్స్, బేసిక్ అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. సరైన శిక్షణ లేని డ్రైవింగ్‌తో నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఒక్క కేంద్రానికీ విశాలమైన శిక్షణ ప్రాంగణం లేదు. జాతీయ రహదారులు, గ్రామీణ దారుల్లో శిక్షణ ఇస్తున్నారు. సరైన కండిషన్లో లేని వాహనాలే శిక్షణకు వినియోగిస్తున్నారని వెల్లడైంది. ముందుగా ఖాళీ స్థలంలో శిక్షణ ఇవ్వాలి. డ్రైవింగ్ బాగా వచ్చిన తర్వాతే రోడ్డుపైకి రావాలి. సాధారణంగా శిక్షణ ఇచ్చే సమయంలో కనిష్ఠంగా ఇద్దరు గరిష్ఠంగా ముగ్గురు మాత్రమే వాహనంలో ఉండాలి. శిక్షణ వాహనాల్లో ఐదుగురు, ఆరుగురు అభ్యర్థులు ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా ఉండాలి
పాఠశాల నిర్వహించేవారికి విశాలమైన ప్రాంగణాలుండాలి. నాలుగు చక్రాలైతే ఎకరా స్థలం తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు అవసరం. చోదక రంగంలో అయిదేళ్ల అనుభవం ఉంటేనే లైసెన్సు మంజూరు చేస్తారు. ట్రేడ్ మార్కు నమోదు చేసుకోవాలి. ఎంఎస్‌ఎంఈ, బీమా పాలసీ, పాన్, టాన్‌లతో పాటు సంబంధిత ఆర్టీవో నుంచి డ్రైవింగ్ ఇన్‌స్ట్ర్టక్టర్ లైసెన్సు పొందాలి.
తరగతుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి. అందులో డ్రైవింగ్ నియమ నిబంధనలకి సంబంధించి ఛార్ట్ ఏర్పాటు చేయాలి. ముందుగా వారం పాటు తరగతులు నిర్వహించాలి. థియరీ కోసం కనీసం 8 గంటలైనా కేటాయించాలి. ఏ సైన్ బోర్డ్ ఏం సూచిస్తుందో వివరించి చెప్పాలి. ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తే శిక్షణ తీసుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ తదితరాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. శిక్షణ తరగతుల్లో వాటిని చూపించాలి. రోడ్డు నిబంధనలు, సంకేతాలపై అవగాహన తప్పనిసరిగా కల్పించాలి.
నచ్చినట్టు వసూళ్లు
నగరానికి చెందిన ఇద్దరు యువకులు ఓ శిక్షణ కేంద్రానికి వెళ్లారు. నెలకు రూ.4 వేలతో పాటు అదనంగా మరో రూ.5 వేలు కడితే లైసెన్సు కూడా వచ్చేలా చేస్తామని యజమాని తెలిపాడు. అలా వద్దని యువకులు చెబితే రెండూ కలిపి తీసుకోవాలని పట్టుబట్టాడు. ఎక్కడికెళ్లినా అంతేనని చెప్పడంతో తప్పక శిక్షణ తీసుకున్నారు.
కొన్ని కేంద్రాల నిర్వాహకులు లెసెన్సులు ఇప్పిస్తామంటూ అదనంగా నగదు వసూలు చేస్తున్నారు. ఆర్టీవో నిర్ణయించిన ప్రకారం శిక్షణ సొమ్ము వసూలు చేయాలి. కానీ నచ్చినట్లు తీసుకుంటున్నారు. ఇకనుంచి ఆ పరిస్థితి లేకుండా చూస్తామని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే లైసెన్సులు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. రోడ్ల పక్కన నడుపుతున్నవారు, గదులు, యంత్రాలు లేనివారు తప్పనిసరిగా అన్నీ సమకూర్చుకోవాలని చెప్పారు.
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్ - రాష్ట్రంలో 2 వేలకు మించి పాజిటివ్ కేసులు
సంక్రాంతి బరిలో దిగేందుకు 'పందేం కోళ్లు' సిద్ధం - ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు

