ETV Bharat / state

'బధిరుల' భవితకు నిస్వార్థ సేవలు - 24 ఏళ్లుగా ఉచితంగా చదువు, వసతి కల్పిస్తున్న సుబ్బారావు

బధిరులకు బాసటగా నిలుస్తున్న నాగుబడి సుబ్బారావు - బధిరుల్లో ప్రతిభను వెలికితీసి ప్రయోజకులు చేయాలని సంకల్పం - 2002లో తల్లిదండ్రుల పేరిట నాగుబడి రంగయ్య- అచ్చమ్మ బధిరుల బడి ఏర్పాటు

Special Story For Deaf School in Bapatla District
Special Story For Deaf School in Bapatla District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2026 at 4:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Special Story For Deaf School in Bapatla District : బధిరులకు స్పష్టంగా వినపడదు, సరిగా మాట్లాడలేరు. మానసికంగా కుంగిపోతూ నలుగురిలో కలవలేరు. అలాంటి వారందర్నీ ఒకే దగ్గరకు చేర్చేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ వైద్యుడు. విభిన్న ప్రతిభావంతులను ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా ఉచితంగా చదువు చెప్పిస్తూ వసతి కల్పిస్తున్నారు. 24 ఏళ్లుగా నిస్వార్థ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొమర్నేనిపాలేనికి చెందిన నాగుబడి సుబ్బారావు యూరాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. వినికిడి లోపంతో తన తోబుట్టువులు పడిన కష్టాన్ని, చదువుకు దూరవ్వడాన్ని కళ్లారా చూశారు. అందుకే వారిలా ఇంకెవ్వరూ కాకూడదని నిర్ణయించుకున్నారు. బధిరులను విద్యావంతులుగా మార్చి ఉన్నతస్థితిలో నిలపాలని సంకల్పించారు. ఇందుకోసం 2002లో నాగులపాలెంలో తన తల్లిదండ్రుల పేరిట నాగుబడి రంగయ్య- అచ్చమ్మ బధిరుల పాఠశాలను స్థాపించారు.

'బధిరుల' భవితకు నిస్వార్థ సేవలు - 24 ఏళ్లుగా ఉచితంగా చదువు, వసతి కల్పిస్తున్న సుబ్బారావు (ETV)

బధిర పిల్లల్ని బడిలో చేర్పించేందుకు చాలా కష్టపడ్డారు సుబ్బారావు. చదువు చెబుతామంటూ ఊరూరా తిరిగి ఒప్పించి పాఠశాలకు రప్పించారు. ఇప్పుడీ విద్యాలయంలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాతల నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా సొంత నిధులు వెచ్చిస్తున్నారు. ఏడాదికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు సుబ్బారావు.

ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా రంగు రంగుల బొమ్మలు, మ్యాపులు, చార్టులతో గోడలను నింపేశారు. ఆడుకోవాడానికి పరికరాలు సమకూర్చారు. బీఈడీ చేసిన ఉపాధ్యాయులను నియమించి బోధిస్తున్నారు. ప్రత్యేకంగా వినికిడి యంత్రాలను తెప్పించి పాఠాలు చెబుతున్నారు. టీచర్లు ఎంతో ఓర్పుగా నేర్పిస్తున్నారు.

అంధులు, బధిరుల కోసం ప్రత్యేక పాఠశాల : మరోవైపు విజయనగరంలో అంధులు, బధిరుల కోసం ప్రత్యేక పాఠశాల ఉంది. పూల్‌బాగ్‌ కాలనీలో ఉన్న ఈ పాఠశాలలో ఏడాది పొడవునా ప్రవేశాలకు అవకాశం ఉంది. గజపతులు అయిదెకరాల స్థలాన్ని ఇక్కడ కేటాయించారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ రెండు పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరైనా చదువుకునేందుకు అవకాశం కల్పించారు.

ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పిల్లలున్నారు. అప్‌ గ్రెడేషన్‌ కోసం ఇటీవల ప్రతిపాదించారు. ఈ రెండు విద్యాలయాలతో పాటు సమీపంలోని పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే రూ.85.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. అదనపు తరగతి గదులు, చిన్నపాటి మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, నడకదారులు, వంటగది బాగు తదితర పనులు జరగనున్నాయి.

పాఠశాలలో ఇవీ ప్రత్యేకం :

  • సువిశాల ఆట మైదానం
  • ఉచిత వసతి సదుపాయం, భోజనం, దుస్తులు
  • బ్రెయిలీ విధానంలో కంప్యూటర్ల వినియోగం
  • ఐఎఫ్‌పీ ప్యానెల్స్, వివిధ రకాల థెరపీ విద్య
  • భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు
  • అన్నిచోట్లా రెయిలింగ్‌లు
  • ప్రత్యేక మెనూ
  • పోటీ పరీక్షలకు తర్ఫీదు
  • పింఛను సదుపాయం
  • తల్లికి వందనం
  • ఇతర పథకాల అమలు
  • సంగీతం, డ్యాన్స్‌ పోటీల నిర్వహణ

సైగల రెస్టారెంట్ - మాట్లాడకుండానే కస్టమర్లను మెప్పిస్తారు!

పుట్టుకతోనే మాట, వినికిడి శక్తిని కోల్పోయిన యువతి -ఆంధ్ర మహిళా జట్టులో కీలక పాత్ర