హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు వరుసలుగా విస్తరణ - ఇకపై ప్రయాణం సులువు
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు డీపీఆర్ సిద్ధం - 209 కి.మీ. బ్రౌన్‌ఫీల్డ్, 22 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా - రూ.10 వేల కోట్లతో నిర్మాణం - త్వరలో పీఏటీఎస్‌సీ ముందుకు

Published : November 6, 2025 at 6:58 PM IST
Hyderabad to Vijayawada Highway Expansion : హైదరాబాద్ నుంచి విజయవాడ దారి ఇప్పుడు మరింత విస్తరించబోతోంది. రోజూ వేలాది వాహనాలు పరుగులు తీసే ఈ మార్గం త్వరలోనే ఆరు వరుసల జాతీయ రహదారిగా రూపుదిద్దుకోనుంది. ప్రాజెక్ట్ యొక్క సమగ్ర ప్రణాళిక డీటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఈ నెల రెండో వారంలో ఈ డీపీఆర్‌ను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి చెందిన ప్రాజెక్ట్ ఎప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ (పీఏటీఎస్‌సీ) ముందు అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
ఈ డీపీఆర్‌లో నాలుగు వేర్వేరు ఆప్షన్లు రూపొందించారు. అందులో మొదటి ఆప్షన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అనుకూలంగా గుర్తించింది. దీని ప్రకారం, మొత్తం 231.32 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించనుంది. అందులో 209 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్ (అంటే ప్రస్తుత రోడ్డు విస్తరణ), 22.25 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ (కొత్త మార్గం) ఉండనుంది.
తెలంగాణ పరిధిలో ఉన్న రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, అంబారుపేట, ఐతవరం పరిధిలో 7.3 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేయనున్నారు. ఇందులో 6.65 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ నిర్మిస్తారు. అలాగే కాచవరం, పల్లిపాడు పరిధిలో 16.15 కి.మీ. మేర బైపాస్ రోడ్డు (ఇందులో 15.6 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్) నిర్మాణం చేపడతారు.
మొత్తం రహదారిలో నాలుగు ఫ్లైఓవర్లు ఉండనున్నాయి. అలాగే చిన్న, పెద్ద కలిపి 60 వాహనాల అండర్‌పాస్‌లు, ఇంకా జంతువులు రహదారి దాటడానికి ప్రత్యేకంగా 10 అండర్‌పాస్‌లు కూడా నిర్మించనున్నారు. భద్రత, సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ అన్నీ పరిగణనలోకి తీసుకుంటూ డిజైన్ సిద్ధం చేశారు.
4 నుంచి 6 వరుసల విస్తరణకు 182.41 హెక్టార్ల భూసేకరణ అవసరమని గుర్తించారు. యాదాద్రి జిల్లా మల్కాపూర్ నుంచి ప్రారంభమై చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, నవాబుపేట, నందిగామ, కీసర, పరిటాల, ముళ్లపాడు, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు విస్తరించనున్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభం : ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.10,000 కోట్ల భారీ వ్యయం అంచనా వేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, పీఏటీఎస్‌సీ కమిటీ ఆమోదం అనంతరం నివేదికను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఎప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ముందు ఉంచుతారు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ముందు తుది ఆమోదం పొందనుంది. దాంతో, ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ ప్రక్రియకు కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ దశకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ భారీ రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి.
రెండు రాష్ట్రాల అభివృద్ధి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా మారిన మార్గం. ఈ హైవే ఆరు వరుసలుగా మారితే ప్రయాణ సమయం తగ్గడం, ప్రమాదాల సంఖ్య తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, పారిశ్రామిక రవాణా సౌలభ్యం పెరగడం వంటి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేయబోయే ఈ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కొత్త దిశగా మారబోతోంది.
'6 వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి - అప్పటి నుంచే పనులు ప్రారంభం'
యాచారం మీదుగా హైదరాబాద్ To అమరావతి జాతీయ రహదారి - 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజీలు ఏర్పాటు

