కాటన్ బ్యారేజీకి పూడిక ముప్పు - ప్రక్షాళనకు ఎన్డీయే సర్కార్ కసరత్తు
1.25 టీఎంసీలకు పడిపోయిన కాటన్ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం - వైఎస్సార్సీపీ హయాంలో పనులు చేయకుండానే బిల్లుల కోసం యత్నం - పాత ఒప్పందం రద్దు కొత్త టెండర్లకు జలవనరుల శాఖ ఆదేశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 8:31 AM IST
Dowleswaram Barrage Dredging : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో పూడికతీతకు రంగం సిద్ధమైంది. బ్యారేజీలో ఇసుక, మట్టి భారీగా పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం సగానికి పైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పూడిక తీసేందుకు ఎన్డీయే ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడకుండా సరికొత్త విధానాల్లో పూడిక తీసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
సగానికి పడిపోయిన సామర్థ్యం : ఉభయ గోదావరి జిల్లాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా కాటన్ బ్యారేజీ ద్వారానే సాగునీరు అందుతోంది. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలను సైతం ఇదే తీరుస్తోంది. ఈ బ్యారేజీని వాస్తవానికి 2.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. కానీ కాలక్రమంలో ఇందులో ఇసుక, కంకర, ఒండ్రు మట్టి, గ్రావెల్ భారీగా పేరుకుపోయాయి. దీంతో బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం కేవలం 1.25 టీఎంసీలకు పరిమితమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పాత కాంట్రాక్ట్ రద్దు, కొత్త టెండర్లు : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో బ్యారేజీ డ్రెడ్జింగ్ (పూడికతీత) పనుల కోసం రూ.272 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. అఖండ గోదావరి ఎడమగట్టున పూడిక తీసేందుకు రూ.144.43 కోట్లు, కుడిగట్టుకు రూ.128.32 కోట్లతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. అయితే అప్పట్లో పనులు దక్కించుకున్న సంస్థ, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయకుండానే నేరుగా బిల్లులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసింది. తాజాగా ఈ ఏడాది (2026) జనవరి 8న మళ్లీ కొత్త టెండర్లు పిలవాలని జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బేతీమెట్రిక్ సర్వే అత్యవసరం : కాటన్ బ్యారేజీలో ప్రస్తుతం పూడిక ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా తేల్చాల్సి ఉంది. ఎక్కడెక్కడ నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయిందనే అంశాలను సాంకేతికంగా నిర్ధారించాలని నిపుణులు సూచిస్తున్నారు. పూడిక వల్ల భవిష్యత్తులో వరద నిర్వహణ, సాగునీటి పంపిణీకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా బ్యారేజీలో బేతీమెట్రిక్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత సబ్ బాటమ్ ప్రొఫైలింగ్ ద్వారా పూడిక తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు.
ఆదాయం తెచ్చే 'రెవెన్యూ జనరేషన్' నమూనా : పూడికతీత పనుల్లో సర్కారుపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడకుండా 'రెవెన్యూ జనరేషన్' (ఆదాయ సృష్టి) నమూనాను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తుంగభద్ర జలాశయం పూడికతీతపై ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఆ భేటీలో ప్రధానంగా ఈ రెవెన్యూ జనరేషన్ నమూనాపైనే చర్చించారు. విదేశాలతో పాటు, మన పొరుగు రాష్ట్రం తెలంగాణలోని దిగువ మానేరు, మిడ్ మానేరు, కడెం ప్రాజెక్టుల్లో దీన్ని ఇప్పటికే అమలు చేశారు.
డ్రెడ్జర్లతో పర్యావరణహితంగా పూడిక తీయడం ఈ నమూనా ముఖ్య ఉద్దేశం. అలా తీసిన మట్టిని రైతులకు వ్యవసాయానికి అందిస్తారు. పూడికలో వినియోగించదగ్గ ఇసుక తదితర పదార్థాలను మార్కెట్లో విక్రయించి, ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లిస్తారు. తద్వారా పనులు జరగడంతో పాటు ఖజానాకు ఆదాయం వస్తుంది. కేంద్ర పర్యావరణ నిబంధనలకు లోబడి, నదీగర్భాన్ని అతిగా తవ్వకుండా ఉండేందుకు పనులు ప్రారంభించడానికి ముందే పర్యావరణ, సాంకేతిక అధ్యయనం చేసేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ధగధగా మెరవనున్న 'ధవళేశ్వరం' - రూ.150 కోట్లు మంజూరు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - అప్రమత్తమైన అధికారులు

