మీరొక్కరే ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు - అదెలాగో తెలుసుకోండి
అవయవ లోపాలతో బాధపడేవారు అనేకం - దాతల కోసం పలువురు ఎదురుచూపులు - అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న పలు సంస్థలు - మరణంలోనూ ఇతరుల కుటుంబాల్లో వెలుగు నింపి సహృదయాన్ని చాటుతున్న దాతలు

Published : October 14, 2025 at 7:52 PM IST
Awareness On Organ Donation : తమవారు లేరని ఇక తిరిగి రారనే పుట్టెడు దుఃఖంలోనూ కొందరు మానవత్వాన్ని చాటుతున్నారు. వారితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లో జీవన జ్యోతులు వెలిగిస్తున్నారు. శరీర అవయవాలను దానం చేయడం ద్వారా మరి కొందరికి జీవితాన్ని అందించవచ్చనే ఉదార మనస్కులు పలు జిల్లాలో పెరుగుతున్నారు. వారి నిర్ణయం ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండగా చైతన్యవంతమైన సమాజానికి అడుగులు పడుతున్నాయి. కాలుడు కబళించినా, కరుణ చాటుతున్న సహృదయులు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
- సిద్ధిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిషన్‌గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. కళ్లు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను కుటుంబ సభ్యులు దానం చేసి, మరో ఐదుగురికి ప్రాణదానేం చేశారు.
- సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన పార్థసారథి ఓ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యారు. రోదనలోనూ ఆ కుటుంబ సభ్యులు కళ్లు, కాలేయం తదితర అవయవాలు దానం చేసి, అయిదు మంది ప్రాణాలు కాపాడారు.
- మెదక్ పట్టణానికి చెందిన మోక్షిత్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. కళ్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం సేకరించి మరో తొమ్మిద మందికి అమర్చారు.
- వికారాబాద్ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న శంకరయ్య మృతి చెందారు. శోకంలో ఉన్న ఆ కుటుంబం ఆయన మృతదేహాన్ని స్థానిక మహావీర్ ఆసుపత్రికి అప్పగించారు.
అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ :
- పుట్టుకతో, జీవన ప్రయాణంలో వివిధ అవయవ లోపాలతో బాధపడే వారి సంఖ్య క్రమేపీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో దాతల కోసం పలువురు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో అలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి.
- వాసవి, అలయన్స్, లయన్స్ ఇతర క్లబ్ల ప్రతినిధులు ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నారు. పలువురు భవిష్యత్తులో అవయవదానానికి అంగీకరిస్తూ పత్రాలను సమర్పించారు.
- కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, వైద్యులు ఈ జాబితాలో ఉన్నారు.
ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు : భవిష్యత్తులో అవయవదానం చేయాలని నిర్ణయించుకున్న వారు www.jeevandan.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. సంస్థ తరఫున డోనర్కార్డును కూడా ఆన్లైన్లో అందిస్తారు. ఈ సమ్మతి ప్రక్రియను ప్రతిజ్ఞగా పేర్కొంటారు. అవయవాలు అవసరమైన వారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులను సంప్రదించవచ్చు. దీనికోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 040 23489494, 63006 25242. వీటి ద్వారా మన సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
ఇలా చేయవచ్చు :
- ఒకరు తమ తదనంతరం ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.
- జీవన్మృతులుగా మారితే మూత్రపిండాలు, కాలేయం, గుండె, గుండె వాల్వ్, కార్నియా, ఊపిరితిత్తులు దానం ఇవ్వవచ్చు.
- సాధారణ మరణం సంభవిస్తే ఆరు గంటల్లోపు కార్నియా దానం చేయవచ్చు.
సిద్ధిపేట జిల్లాలో వివిధ సందర్భాల్లో పలువురు భార్యాభర్తలు, ఇతర కుటుంబ సభ్యులకు సమస్య ఎదురైనప్పుడు మూత్రపిండాలు, కాలేయం దానం చేశారు. చనిపోయిన తరువాత భౌతిక కాయాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అప్పగిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒక్క ముందడుగు - ఏడుగురికి ప్రాణం పోస్తుంది
అవయవదానాల్లో తెలంగాణ @ నంబర్ వన్ - ఎక్స్‌లెన్స్ అవార్డు సొంతం

