చలిలో వాకింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
తెలంగాణ రాష్ట్రంలో గజ గజ వణికిస్తున్న చలి - రాత్రి నుంచి ఉదయం వరకు ఉధృతంగా శీతల గాలులు - చలికాలంలో పొద్దునే లేచి నడవడం గుండె ఆరోగ్యానికి మంచిదికాదంటున్న వైద్యులు

Published : January 11, 2026 at 2:48 PM IST
Health Problems in Winter : కొంతమంది ఉదయాన్నే లేచి నడవడానికి బద్ధకంగా భావిస్తారు. మరికొందరు ఆరునూరైనా క్రమశిక్షణగా తెల్లవారకముందే అనుకున్న సమయానికి లేచి నడక, వ్యాయామాలు ప్రారంభిస్తారు. ఇలా నడవడం మంచి అలవాటే కానీ, చలికాలంలో పొద్దు పొద్దున్నే లేచి నడవడం మాత్రం గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని చెబుతున్నారు దిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు. దీనికి కారణం చలివల్ల గుండెకు సంబంధించిన కండరాలు బాగా కుంచించుకుపోతాయట.
గుండె కండరాలు కచుంచుకుపోతే ఆ మార్గంలో రక్తప్రసరణ సరిగా జరగక, గుండె కండరాలపైన ఒత్తిడి పెరిగి, గుండెనొప్పి రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. అంతవరకూ ఇంట్లో వెచ్చగా పడుకుని, ఒక్కసారిగా తీవ్రమైన చలిలోకి వెళ్లినప్పుడు ఉష్ణోగ్రతల్లోని ఈ విపరీతమైన మార్పులు గుండె కండరాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటం, కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల కూడా గుండెపోటు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పటికే గుండె జబ్బులున్నవారు చలిలో వాకింగ్‌కి పూర్తిగా దూరంగా ఉండాలంటమే ఉత్తమమైన పద్దతి అని అంటున్నారు. దీనికి బదులుగా, కాస్త సూర్యకిరణాలు వచ్చాక వాకింగ్ చేయడం, ముందుగా వార్మప్ వ్యాయామాలు చేసి ఆపైన నడవడం, దాహం ఉన్నా లేకపోయినా నీళ్లు తాగడం వంటివి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయట.
"ప్రస్తుతం చలి గజగజ వణికిస్తోంది. శిశువుల నుంచి వృద్ధుల వరకు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రధానంగా దీర్ఘకాలిక రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు చలిలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి. నిత్యం యోగా, వ్యాయామం వంటివి వాటిని చేయాలి. సూర్యరశ్మి వచ్చిన తర్వాతే కాసేపు ఎండలో నడక ప్రారంభించాలి" -రాగవేణి సంగారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రి ఫిజీషియన్
వాతావరణ మార్పులతో : గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటోంది. శీతలగాలులు వీస్తున్నాయి. సూర్యుడి దర్శనం అంతంత మాత్రంగానే ఉంటోంది. చాలా మంది ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు : చిన్న పిల్లలకు స్వెటర్లు, మంకీ క్యాపులు వేసి వెచ్చగా ఉండేలా తల్లిదండ్రులు పలు జాగ్రత్తలను పాటించాలి. ప్రధానంగా నాలుగేళ్ల లోపు వయసున్న పిల్లలు జలుబు, దగ్గుతో ఎక్కువగా ఆయాస పడుతుంటారు. వారికి వేడినీటితో ఆవిరి పట్టించాలి. గొంతు నొప్పి ఉంటే గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మేస్తే కాస్త కుదుటపడుతుంది. పిల్లలకు 8 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరమవుతుంది. త్వరగా జీర్ణమయ్యే ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి.
అందరూ పాటించాల్సినవి
- ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి.
- ఆహారంతో పాటు జామ, బొప్పాయి, బత్తాయి పండ్లు తినాలి.
- నూనె ఎక్కువగా ఉండే వేపుడు పదార్థాల జోలికి అస్సలు వెళ్లవద్దు.
- శీతల పానీయాలు, మద్యం, సిగరెట్ల వంటివి సేవించవద్దు.
తెలంగాణలో శీతల గాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా 12 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, ఎనిమిది జిల్లాల్లో 10.1 నుంచి 11 మధ్య, మిగిలిన జిల్లాల్లో 11.1 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

