ETV Bharat / state

'ఈ గడ్డిమందు చుక్క మీద పడ్డ చనిపోవడం ఖాయం!'

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పారాక్వాట్‌ పాయిజనింగ్ (గడ్డిమందు) - పారాక్వాట్‌ని బ్యాన్ చేయాలని వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల ఆందోళన - పారాక్వాట్‌ అంత ప్రమాదంగా మారుతుందో వివరించిన డాక్టర్ గంగాధర్​

Paraquat Poisoning
Paraquat Poisoning (Getty Image)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 6:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Doctor Gangadhar Interview About Paraquat Poisoning : పారాక్వాట్‌ పాయిజనింగ్ (గడ్డిమందు) ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం. ఒక్క చుక్క అయినా చాలు ప్రాణాలు హరిస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారాక్వాట్‌ని బ్యాన్ చేయాలని వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్ చేసిన ఈ పారాక్వాట్‌ మనకెందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏటా వేలాది మంది పారాక్వాట్‌ పాయిజనింగ్​తో ఆస్పత్రి పాలవుతుండగా ఒకరిద్దరు కూడా కోలుకోటవం కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పారాక్వాట్‌ అంత ప్రమాదంగా మారుతోంది. పారాక్విట్ తీసుకున్న వారిలో ఏం అవుతుంది అన్న వివరాలపై డాక్టర్ గంగాధర్​ మాట్లాడారు.

పారాక్వాట్​కి యాంటీడోట్ లేకపోవడం : గడ్డి మందులో పారాక్వాట్ అనే పాయిజనింగ్ ఉంటుందని, దీనిని గడ్డిని చంపడానికి ఉపయోగిస్తారని డాక్టర్ గంగాధర్ తెలిపారు​. ఈ గడ్డి మందులో పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది ఉంటుందని చెప్పారు. ఇది మన శరీరంలోకి వెళ్లినప్పుడు వెంటనే లంగ్స్, లివర్, కిడ్నీలల్లోకి వెళుతుందని, తక్కువ మోతాదులో తీసుకున్నా వెంటనే అవయవాలు విష ప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయని, పారాక్వాట్​కి యాంటీడోట్ లేకపోవడం వల్ల ప్రజలను కాపాడలేకపోతున్నామని, కొన్ని పాయిజనింగ్​కి యాంటీడోట్ ఉన్నందునే ప్రాణాలు కాపాడగలుగుతున్నామని వివరించారు.

ఆత్మహత్యకు ఉపయోగిస్తారని వాళ్లకు తెలియకపోవచ్చు : ఏదైనా కెమికల్​కు అనుమతి ఇవ్వడానికి అగ్రికల్చర్ కింద ఎక్స్​పర్ట్ కమిటీ ఉంటుందని, వాళ్లు రివ్యూ చేసినప్పుడు ఈ గడ్డి మందును ఆత్మహత్యకు ఉపయోగిస్తారనే ఇన్ఫర్మేషన్ వాళ్ల దగ్గర లేదని అన్నారు. ఈ మందును పొలాల్లో వాడతారని, ఆత్మహత్యకు ఉపయోగిస్తారని తెలిస్తే అనుమతి ఇచ్చేవాళ్లు కాదని, ఆత్మహత్యకు ఉపయోగిస్తున్నారని తెలిస్తే యాక్షన్ తీసుకుంటారని తాను అనుకుంటున్నానని వివరించారు.

ఒక్క శాతం మాత్రమే బతికే అవకాశం : హాస్పిటల్స్​కి వందల సంఖ్యలో కేసులు వస్తుంటాయని, వారు బతకడం చాలా కష్టమవుతోందని డాక్టర్ తెలిపారు. కేవలం ఒక్క శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని, పారాక్వాట్​కి యాంటీడోస్ లేకపోవడం వల్ల రక్షించలేకపోతున్నామని పేర్కొన్నారు.

మందు పిచికారి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : పంట పొలాల్లో ఈ గడ్డి మందును పిచికారి చేసేటప్పుడు రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గంగాధర్ సూచించారు. లేకపోతే చర్మం ద్వారా, శ్వాస తీసుకునేటప్పుడు శరీరంలోకే ప్రవేశించే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆసుపత్రిపాలైన వాళ్లు ఉన్నారని అన్నారు. ఈ మందును పిచికారి చేసేటప్పుడు మాస్కులు ఉపయోగించాలని సూచించారు. అధికారులు ఈ మందుల గురించి రైతులకు, ప్రజలకు ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించాలని కోరారు.

"హాస్పిటల్స్​కి వందల సంఖ్యలో కేసులు వస్తుంటాయి. వారు బతకడం చాలా కష్టమవుతుంది. కేవలం ఒక్క శాతం మాత్రమే బతికే అవకాశం ఉంది. పారాక్వాట్​కి యాంటీడోట్ లేకపోవడం వల్ల రక్షించలేకపోతున్నాం."- డాక్టర్ గంగాధర్, వైద్యనిపుణులు

వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు : మరోవైపు రాష్ట్రంలో పారాక్వాట్‌ పురుగు మందు తయారీ, పంపిణీ, విక్రయాలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిబ్రవరి 19న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విషపూరిత రసాయనాలతో కూడిన ఈ పురుగు మందు వినియోగం వల్ల ఏటా 200 మంది మృతి చెందుతున్నారంటూ హైకోర్టుకు ఓ లేఖ అందింది. ఈ మందు తక్కువ పరిమాణంలో వాడినా ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, దీన్ని యూరోపియన్‌ యూనియన్‌తోపాటు చైనా, బ్రెజిల్‌లలో నిషేధించినట్లు లేఖలో పేర్కొన్నారు. దీని వినియోగంపై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాసిన ఆ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 19న విచారణ చేపట్టింది. ఇలాంటి విషపూరిత వ్యవసాయ రసాయనాల ఉత్పత్తి, విక్రయాల నియంత్రణకు ఏవైనా చట్టాలున్నాయో లేదో చెప్పాలంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖలకు, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, వ్యవసాయశాఖ కమిషనర్, సెంట్రల్‌ ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (సీఐపీఎంసీ)లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

పురుగు మందుతో ప్రాణాలు పోతే ఇక అంతే సంగతులు! - రూ.అర కోటి జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష

మందుల పిచికారీతో రైతులకు అస్వస్థత! - ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం సేఫ్!