రాష్ట్రంలో ఆర్టీసీ మార్పులు, చేర్పులు - కొత్త జిల్లాల వారీగా డిపోల విభజన
పొరుగు జిల్లాల డీపీటీవోలకు బాధ్యతలు - ఆర్టీసీలో కూడా జిల్లాల వారీగా డిపోల విభజన - ఆదేశాలు జారీ చేసిన సంస్థ ఎండీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 11:43 AM IST
Division of RTC Depots According to New Districts: రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పాటు కొన్ని జిల్లాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా డిపోలను కూడా జిల్లాల వారీగా విభజించింది. ఈ మేరకు సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలవరం జిల్లాల్లో ఒక్క డిపో కూడా లేదు. ఇక మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు డిపోలు వచ్చాయి. మార్పులు, చేర్పులు అన్నీ నిన్నటి (బుధవారం) నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
పొరుగు జిల్లాల డీపీటీవోలకు బాధ్యతలు: కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి (DPTO) పోస్టులు సృష్టించారు. పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పడింది. ఈ జిల్లాకు డీపీటీవోగా తూర్పుగోదావరి జిల్లా డీపీటీవో వైఎస్‌ఎన్ మూర్తి బాధ్యతలు చూడనున్నారు. అదే విధంగా మరో కొత్త జిల్లా మార్కాపురం డీపీటీవోగా ప్రకాశం జిల్లా డీపీటీవో జి.సత్యనారాయణ వ్యవహరించనున్నారు.
ఇంతకాలం రంపచోడవరం బస్‌స్టాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి రానుంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం డిపో మేనేజర్‌కు ఆ బస్టాండ్‌ను కూడా ఎటాచ్ చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకి మారింది. 6 నెలలుగా చిత్తూరు డీపీటీవో రాము అన్నమయ్య జిల్లా డీపీటీవోగా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన్నే ఇప్పుడు మదనపల్లె కేంద్రంగా ఆ జిల్లా బాధ్యతలు కూడా చూడాలని ఆదేశించారు.
ఆ జిల్లా పరిధిలో ఒక్క డిపోయే: తాజాగా జరిగిన మార్పులు, చేర్పులతో రాష్ట్రంలో ఒక్క డిపో కూడా లేని జిల్లాగా పోలవరం నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డిపో ఒక్కటే ఉంది. విజయనగరం జిల్లాలో రెండేసి డిపోల చొప్పున విజయనగరం, ఎస్.కోట, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం డిపోలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఏకంగా 10 డిపోలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 7 డిపోలు చొప్పున ఉన్నాయి.
జిల్లాల పునర్విభజనతో డిపోల పరిధి మార్పులు ఇలా:-
| జిల్లా | డిపోలు |
| బాపట్ల | బాపట్ల, రేపల్లె, చీరాల |
| ప్రకాశం | ఒంగోలు, అద్దంకి, కందుకూరు |
| మార్కాపురం | మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు |
| నెల్లూరు | నెల్లూరు-1, 2, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, రాపూరు, గూడూరు |
| తిరుపతి | వాకాడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, మంగళం, అలిపిరి, తిరుమల, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు |
| చిత్తూరు | చిత్తూరు-1, 2, పలమనేరు, కుప్పం |
| అన్నమయ్య | పీలేరు, మదనపల్లె-1, 2, రాయచోటి, పుంగనూరు |
| వైఎస్సార్ కడప | కడప, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట |
ఇప్పటివరకు ఉన్న జిల్లాల నుంచి వేరొక జిల్లా పరిధిలోకి మారాయి. రాష్ట్రంలో జిల్లాల తాజా మార్పులు, చేర్పులు కారణంగా 9 డిపాలు మారాయి.
మారిన డిపోలివే:-
| డిపో | ఇప్పటివరకు ఉన్నజిల్లా | కొత్త జిల్లా |
| కందుకూరు | నెల్లూరు | ప్రకాశం |
| అద్దంకి | బాపట్ల | ప్రకాశం |
| కనిగిరి | ప్రకాశం | మార్కాపురం |
| గిద్దలూరు | ప్రకాశం | మార్కాపురం |
| మార్కాపురం | ప్రకాశం | మార్కాపురం |
| పొదిలి | ప్రకాశం | మార్కాపురం |
| గూడూరు | తిరుపతి | నెల్లూరు |
| పుంగనూరు | చిత్తూరు | అన్నమయ్య |
| రాజంపేట | అన్నమయ్య | వైఎస్సార్ కడప |
ఉన్నతాధికారుల నియామకం : నూతనంగా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నియామిస్తూ ఆదేశాలను జారీ చేసింది. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం జిల్లాకు ఇంఛార్జ్ కలెక్టర్‌గా ఎస్.దినేష్ కుమార్ నియమితులు అయ్యారు. ఆయన ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. పోలవరం జిల్లాకు ఇన్చార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ నియమించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దర్ ఉన్నారు. అల్లూరి జిల్లా జేసీగా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా ఇన్చార్జి జేసీగా నియమించారు.
ఏపీలో కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటు - తుది నోటిఫికేషన్ విడుదల
కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన - కలెక్టర్లు, ఎస్పీలను నియామిస్తూ ఆదేశాలు జారీ

