ETV Bharat / state

మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే రైజింగ్‌ 2047 - శాసనసభలో భట్టి విక్రమార్క

కఠినమైన లక్ష్యలు నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకెళ్తున్నాం - క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది - కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న భట్టి

Telangana Rising
Assembly on Hilt Policy (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 5:24 PM IST

4 Min Read
Choose ETV Bharat

Discussion On Hilt Policy : మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే తెలంగాణ రైజింగ్‌-2047 అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మనం కీలమైన మలుపు 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నామని అన్నారు. 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణకు భారీగా స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అనే లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ రైజింగ్‌ 2047పై చర్చించాలని ప్రతిపక్షాలను కోరుతున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర, పిల్లల భవిష్యత్‌కు చాలా ముఖ్యమని, 2047పై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే రైజింగ్‌ 2047 - శాసనసభలో భట్టి విక్రమార్క (ETV)

"మన పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించేదే రైజింగ్‌ 2047. మనం కీలమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాం. 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నాం. 1.2ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారు. 3 ట్రిలియన్ డాలర్లకు ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కఠినమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ రైజింగ్‌ 2047పై చర్చించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా" -భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

భవిష్యత్​ తరాల కోసమే : పూర్వీకులు స్వచ్ఛమైన ప్రకృతిని వారసత్వంగా అందించారని మంత్రి శ్రీధర్‌బాబు శాసన సభలో మాట్లాడారు. రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రకృతిని అందజేస్తున్నామా? లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా? అని ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని తెలిపారు. భవిష్యత్‌తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. రేపటి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్‌పాలసీ తీసుకొస్తున్నామని వివరించారు.

హిల్ట్‌పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తమపై బురద చల్లాలని విమర్శలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. హిల్ట్‌పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాసప్రాంతంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని, నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలివైపునకు తరలిస్తామని స్పష్టం చేశారు. జీడిమెట్ల, ఉప్పల్, సనత్‌నగర్, చర్లపల్లి ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లుగా ఉండేవని, ఒకప్పుడు జనావాసాలకు దూరంగా ఉండేవని తెలిపారు. 50 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంగా విస్తరించిన నేరథ్యంలో ఒకప్పటి నగర శివారు ప్రాంతాలు ప్రస్తుతం రెసిడెన్షియల్ కాలనీస్‌గా మారాయని అన్నారు.

భూగర్భజలం విషపూరితం అవుతోంది : ప్రస్తుతం పరిశ్రమలకు పక్కనే అపార్టుమెంట్లు ఉన్నాయని, పరిశ్రమల నుంచే వచ్చే పొగను ప్రత్యక్షంగా పీలుస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. పరిశ్రమలు, రెసిడెన్షియల్ ప్రాంతాలకు మధ్య బఫర్‌జోన్లు లేవని, బఫర్‌జోన్లు లేకపోవడం వల్ల ఎల్జీ పాలిమర్స్, భోపాల్‌ గ్యాస్ దుర్ఘటనలు జరిగినట్లు గుర్తుచేశారు. నగరంలోని భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయన్న శ్రీధర్ బాబు పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భజలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయని తెలిపారు. ఇప్పటికీ మేల్కొకపోతే హైదరాబాద్‌ కూడా దిల్లీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.

హిల్ట్‌పాలసీ విషయంలో శాసన సభ్యులు రాజకీయాలు పక్కనపెట్టాలని, చైనాలో బ్లూస్కై పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను నగరం అవతలివైపునకు తరలించారని శ్రీధర్ ​బాబు గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. దిల్లీలో నివాసాల మధ్య ఉన్న 168 పరిశ్రమలను తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్‌పాలసీ తీసుకొచ్చినట్లు వివరించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఓఆర్‌ఆర్‌ లోపల ఉండకూడదని హిల్ట్‌పాలసీ తీసుకొచ్చామన్నారు. హిల్ట్‌పాలసీ తాము కొత్తగా చేస్తున్నది కాదని, దీని కోసం విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు. వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని, హిల్ట్‌పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాలుష్యం నుంచి రక్షించాలనేదే మా లక్ష్యం : జీవోఎంఎస్‌ 19కు సంబంధించి లీజ్ ల్యాండ్స్‌పై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చిందని శ్రీధర్​బాబు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉండేలా పాలసీ తీసుకువచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్‌ చేస్తామన్నారు. నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వానివని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్, బీజేపీకి రహస్య అనుబంధం ఉందని శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల అసత్య ప్రచారం నమ్మకుండా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారని అన్నారు. హిల్ట్‌పాలసీ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతామన్న ఆయన ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

జీవోలు దాచి పెడుతున్నారు : హిల్ట్​ పాలసీ లీక్‌కావడంపై ప్రభుత్వంలో ఆందోళన ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి అన్నారు. హిల్ట్‌పాలసీకి సంబంధించి వేసిన సబ్‌కమిటీ నిర్ణయాలు బయటపెట్టలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43,462 జీవోలు దాచిపెట్టిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములు, 22 పారిశ్రామికవాడలను అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అతిప్రమాదకరమై ఐడీఏ బొల్లారంను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఫ్యూచర్‌ సిటీలో భూములు ఇస్తే చాలా ఉపయోగం ఉంటుందని, పార్మాసిటీ కాకుండా ఫోర్త్‌ సిటీ చేస్తున్నారని విమర్శించారు.

రద్దీ ఛార్జీలతో వాయు కాలుష్యం కట్టడి - 'కంజెషన్‌ టాక్స్‌' పెట్టాల్సిందేనా?

రూ.వందల కోట్లు ఖర్చు చేసినా గాలి నాణ్యత పెరగలేదు - కాలుష్య నియంత్రణపై కానరాని చిత్తశుద్ధి